వేలం వేళా విశేషం

వేలం వేళా విశేషం


నేడు ఐపీఎల్‌–10 వేలం

బరిలో 357 మంది ఆటగాళ్లు

76 మందికే అవకాశం

ఉదయం గం.9.00 నుంచి  సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
   



ప్రపంచ వ్యాప్తంగా గొప్ప హిట్టర్‌గా గుర్తింపు ఉండవచ్చు... కానీ ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు పట్టించుకోకపోవచ్చు. ఎవరికీ తెలియని అనామకుడు కావచ్చు... ప్రతిభ ఉంటే చాలు కోట్లు వచ్చి పడవచ్చు. పాత పేరు ప్రఖ్యాతులకు ఇక్కడ చోటు లేదు... రికార్డులు కొల్లగొట్టిన వారికి కూడా రూపాయి ఇచ్చేందుకు యజమానులు వెనుకాడవచ్చు... జట్టుకు అతని అవసరం ఎంతవరకు ఉందన్నదే ముఖ్యం. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ఆడితే చాలు సుడి తిరుగుతుందనే కల కుర్రాళ్లది అయితే, డబ్బులు ఎన్ని వచ్చినా ఫర్వాలేదు, లీగ్‌లో భాగమైతే చాలని భావించే అంతర్జాతీయ క్రికెటర్లు కోకొల్లలు. ఐపీఎల్‌ మహిమ అలాంటిది మరి. ఈ నేపథ్యంలో కొత్త, పాత ఆటగాళ్లు మరోసారి ఐపీఎల్‌లో భాగమయ్యేందుకు సిద్ధమయ్యారు. 2017 సీజన్‌ కోసం సోమవారం జరిగే వేలంలో వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈసారి బంపర్‌ ఆఫర్‌ ఎవరికో... బ్యాడ్‌లక్‌ ఎవరిదో?



బెంగళూరు: క్రికెట్‌ అభిమానులకు తొమ్మిది సీజన్లుగా ఫుల్‌ వినోదాన్ని అందిస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) పదో ఏడాదిలోకి ప్రవేశించింది. 2017 సీజన్‌ కోసం తమ ఆటగాళ్లను ఎంచుకునేందుకు ఎనిమిది ఫ్రాంచైజీలు సన్నద్ధమయ్యాయి. పదేళ్ల ఐపీఎల్‌ అంకం ముగిసిన తర్వాత వచ్చే సంవత్సరం నుంచి ఫ్రాంచైజీలు, ఆటగాళ్లలో పూర్తి స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటాయి. అందువల్ల తమ జట్టులో మిగిలిన స్థానాల కోసం ఈ ఒక్క ఏడాదికే జట్లు క్రికెటర్లను సొంతం చేసుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌–10 కోసం నేడు (సోమవారం) జరిగే వేలం ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. రూ.10 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు కనీస ధరతో ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. రూ. 2 కోట్ల కనీస ధరతో ఏడుగురు ప్రధాన ఆటగాళ్లు  ఉన్నారు. వేలంలో తొలిసారి ఐదుగురు అఫ్ఘానిస్థాన్‌ ఆటగాళ్లు కూడా పోటీ పడుతుండటం ఈసారి విశేషం. ఐపీఎల్‌ ఫ్రాంచైజీలను కేవలం ఆటగాళ్ల ప్రదర్శన, స్ట్రైక్‌రేట్, ఎకానమీలాంటివే కాకుండా ఇతర అంశాలు కూడా ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో ఈసారి కూడా వేలంలో అనూహ్య ఎంపికలు ఉండవచ్చు.



జట్లు ఏం కోరుకుంటున్నాయి...

అందుబాటులో ఉన్న క్రికెటర్లు, ఫ్రాంచైజీల అవసరాన్ని బట్టి చూస్తే కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విదేశీ ఆల్‌రౌండర్లు, విదేశీ పేస్‌ బౌలర్ల కోసం  ఎక్కువగా బిడ్డింగ్‌ జరగవచ్చు. స్పిన్నర్లకు పెద్ద మొత్తం పలికే అవకాశం చాలా తక్కువ కాగా... బ్యాట్స్‌మెన్‌ కోసం కూడా యజమానులు వెచ్చించే మొత్తం తక్కువగా ఉండనుంది. ఎందుకంటే ఎనిమిది టీమ్‌లలో ఎవరికీ కూడా ఇప్పుడు బ్యాట్స్‌మన్‌ అవసరం పెద్దగా లేదు. చేతిలో ఉన్న మొత్తం, ఆటగాళ్ల అవసరం చూస్తే ఈసారి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చురుగ్గా వేలంలో పాల్గొనవచ్చని అంచనా. ఒక జట్టుకు అత్యధికంగా అనుమతించిన ఆటగాళ్ల సంఖ్య 27 కాగా, చాలా జట్లు 22 నుంచి 24కే పరిమితం చేసుకునే ఆలోచనతో ఉన్నాయి. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా క్రికెటర్లు లీగ్‌ మధ్యలోనే వెళ్లిపోయే అవకాశం ఉండటంతో టీమ్‌లు ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటాయి.



సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (అందుబాటులో రూ. 20.90 కోట్లు): డిఫెండింగ్‌ చాంపియన్‌గా ఈ జట్టు పెద్దగా మార్పులు కోరుకోవడం లేదు. గాయం నుంచి కోలుకుంటున్న ముస్తఫిజుర్‌కు ప్రత్యామ్నాయంగా ఒక విదేశీ ఫాస్ట్‌ బౌలర్‌ అవసరం ఉంది. జట్టులో స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ కూడా కావాలి.



రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (రూ. 17.82 కోట్లు): తరచుగా గాయపడుతున్న వాట్సన్‌కు ప్రత్యామ్నాయంగా మరో విదేశీ ఆల్‌రౌండర్‌ అవసరం ఉంది. మిషెల్‌ స్టార్క్‌ (ఆస్ట్రేలియా) దూరం కావడంతో ప్రధాన పేసర్‌ అవసరం ఉంది. రబడ (దక్షిణాఫ్రికా) సరైన బౌలర్‌ కాగలడు.

 

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (రూ. 19.75 కోట్లు): విదేశీ ఆటగాళ్ల అవసరం చాలా ఉంది. షకీబ్‌ మినహా మరో ఆల్‌రౌండర్‌ లేడు. అంతగా గుర్తింపు లేని లిన్‌ మినహా విదేశీ బ్యాట్స్‌మెన్‌ ఎవరూ లేకపోగా, ఒక్క విదేశీ పేసర్‌ కూడా జట్టులో లేడు. భారీ మొత్తం వెచ్చించేందుకు సిద్ధం.

 

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ (రూ. 23.10 కోట్లు): ఐపీఎల్‌ మధ్యలోనే వెళ్లిపోయే ముగ్గురు దక్షిణాఫ్రికా క్రికెటర్ల స్థానాల్లో ఆటగాళ్లు కావాలి. విదేశీ ఆల్‌రౌండర్, ఒక మంచి పేస్‌ బౌలర్‌తో పాటు అగ్రశ్రేణి మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ అవసరం కూడా చాలా ఉంది.



 కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ (రూ. 23.35 కోట్లు): గత ఏడాది ఆఖరి స్థానంలో నిలిచినా పంజాబ్‌ 19 మంది ఆటగాళ్లపై నమ్మకముంచి కొనసాగించడం విశేషం. విదేశీ ఆల్‌రౌండర్, విదేశీ ఫాస్ట్‌ బౌలర్‌ కావాలి. భారత్‌కు చెందిన ఒక బ్యాట్స్‌మన్‌ అవసరం ఉంది.



ముంబై ఇండియన్స్‌ (రూ.11.55 కోట్లు):  ఫ్రాంచైజీ వద్ద పెద్దగా డబ్బులు లేవు. కొత్తగా ఆటగాళ్ల అవసరం కూడా ఎక్కువగా లేదు. రిజర్వ్‌లలో కూడా మంచి భారత ఆటగాళ్లు ఇప్పటికే ఉన్నారు. ఒక విదేశీ ఓపెనర్, గాయపడితే పొలార్డ్‌కు ప్రత్యామ్నాయంగా ఒక విదేశీ ఆల్‌రౌండర్‌ చాలు.



రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌ (రూ. 17.50 కోట్లు): ఆరుగురు విదేశీ ఆటగాళ్లను విడుదల చేసింది. కాబట్టి ఇప్పుడు కనీసం ఇద్దరు విదేశీ ఆల్‌రౌండర్లు, ఒక విదేశీ పేసర్‌ అవసరం ఉంది. అశ్విన్‌కు అండగా మరో దేశవాళీ నాణ్యమైన స్పిన్నర్‌ కావాలి.



గుజరాత్‌ లయన్స్‌ (రూ.14.35 కోట్లు): ఇద్దరు భారత స్పిన్నర్లతో పాటు భారత పేసర్‌ అవసరం కూడా చాలా ఉంది. గాయాలతో కోలుకుంటున్న బ్రేవో, ఫాల్క్‌నర్‌లకు ప్రత్యామ్నాయంగా విదేశీ ఆల్‌రౌండర్‌ కావాలి. స్టెయిన్‌ను తప్పించడంతో విదేశీ పేసర్‌ కూడా అవసరం.



వీరిపైనే అందరి దృష్టీ...

బెన్‌స్టోక్స్‌: తాజా వేలంలో అందరికంటే ఎక్కువ మొత్తం పలికే అవకాశం ఉన్న ఆల్‌రౌండర్‌. 6 లేదా 7 స్థానాల్లో దూకుడుగా ఆడటంతో పాటు పేస్‌ బౌలర్‌గా సత్తా కలిగిన ఆటగాడు. భారత్‌తో సిరీస్‌లో అతని ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

 

గ్రాండ్‌హోమ్‌: బౌలింగ్, బ్యాటింగ్‌ రెండు విభాగాల్లోనూ ఈ న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. కనీస ధర రూ. 30 లక్షలే కావడం ఫ్రాంచైజీలకు కచ్చితంగా ఆకర్షించవచ్చు.

 

కగిసో రబడ: దక్షిణాఫ్రికా ప్రధాన పేసర్‌గా ఎదిగిన ఈ కుర్రాడు చెలరేగిపోతున్నాడు. స్టార్క్‌ను కోల్పోవడంతో ఎంత మొత్తమైనా వెచ్చించి ఇతని కోసం బెంగళూరు పోటీ పడవచ్చు.

 

టైమల్‌ మిల్స్‌: ప్రస్తుతం ఫాస్టెస్ట్‌ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు ఉంది. ఈ ఎడమ చేతి ఇంగ్లండ్‌ బౌలర్‌ను సొంతం చేసుకోవడం ఏ ఫ్రాంచైజీకైనా ప్రయోజనమే.



ఇమ్రాన్‌ తాహిర్‌: ఢిల్లీ ఇతడిని విడుదల చేసేసింది కానీ వన్డే, టి20 ఫార్మాట్‌లలో ప్రస్తుత నంబర్‌వన్‌ బౌలర్‌గా తాజా ఫామ్‌ ఈ దక్షిణాఫ్రికా స్పిన్నర్‌కు మరో మంచి అవకాశం కల్పించవచ్చు.



 అసేలా గుణరత్నే: టైమ్‌ చూసి ఈ శ్రీలంక బ్యాట్స్‌మన్‌ పంచ్‌ కొట్టినట్లున్నాడు. వేలంకు ముందు ఆస్ట్రేలియాపై చెలరేగిన అతని వరుస రెండు మెరుపు ఇన్నింగ్స్‌లు ఫ్రాంచైజీల దృష్టిలో పడే ఉంటాయి.



ఇషాంత్‌ శర్మ: భారత జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా ఉండి వేలానికి వస్తున్న ఏకైక బౌలర్‌ ఇషాంత్‌. పుణే అతడిని ఒక్క ఏడాదికే పరిమితం చేసింది. టి20 ఫార్మాట్‌లో గొప్ప బౌలర్‌ కాకపోయినా, ఒక భారత ఆటగాడికి ఏమాత్రం దక్కుతుందనేది ఆసక్తికరం.







వీరే కాకుండా జేసన్‌ రాయ్, హేల్స్, ఎవిన్‌ లూయీస్, మొహమ్మద్‌ నబీ, షహజాద్, బౌల్ట్, బెయిర్‌స్టో, గప్టిల్, జేసన్‌ హోల్డర్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దాదాపు మూడేళ్ల క్రితం తన ఆఖరి అంతర్జాతీయ టి20 ఆడి, రిటైర్‌ కూడా అయిపోయి, గత ఏడాది అమ్ముడుపోని ఆసీస్‌ వికెట్‌ కీపర్‌ బ్రాడ్‌ హాడిన్‌ కూడా తన కనీస ధరను రూ. 1.5 కోట్లుగా నిర్ణయించుకోవడం ఈ వేలంలో అన్నింటికంటే ఆశ్చర్యపరిచే అంశం!



కుర్రాళ్లు కూడా...

భారత్‌కు ప్రాతినిధ్యం వహించకపోయినా... దేశవాళీ క్రికెట్‌లో ప్రదర్శనతో కొందరు యువ క్రికెటర్లు అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. తక్కువ మొత్తానికి లభించే అవకాశం ఉండటంతో ఫ్రాంచైజీలు వీరిని కూడా ఎంచుకునేందుకు ఆసక్తి చూపించవచ్చు. వీరిలో కొందరు టి20 స్పెషలిస్ట్‌లుగా ముందుకు వస్తే, మరికొందరు అన్ని ఫార్మాట్‌లలో నిలకడగా రాణిస్తున్నారు. ఆ జాబితాలో మొహమ్మద్‌ సిరాజ్,  టి. నటరాజ్, అశ్విన్‌ క్రిస్ట్, బాసిల్‌ తంపి, మురుగన్‌ అశ్విన్, పృథ్వీషా, తన్మయ్‌ అగర్వాల్, అంకిత్‌ బావ్నే, విష్ణు వినోద్, ఇషాంక్‌ జగ్గీ తదితరులు ఉన్నారు.



వేలంలో మన ఆటగాళ్లు

తన్మయ్‌ అగర్వాల్, మొహమ్మద్‌ సిరాజ్, ఎం.రవికిరణ్, ఆకాశ్‌ భండారి, ఆశిష్‌ రెడ్డి (హైదరాబాద్‌), సీవీ స్టీఫెన్, హనుమ విహారి, విజయ్‌ కుమార్‌ (ఆంధ్ర).



వేలంలో అందుబాటులో ఉన్న మొత్తం ఆటగాళ్లు    : 357

భారత ఆటగాళ్లు    : 227

విదేశీ ఆటగాళ్లు    : 130

అన్‌క్యాప్డ్‌         : 227

బ్యాట్స్‌మెన్‌        : 62

బౌలర్లు        : 117

వికెట్‌ కీపర్లు    : 30

ఆల్‌రౌండర్లు    : 148

ఎంపికయ్యే ఆటగాళ్లు    : 76



మార్క్యూ ప్లేయర్లు (రూ. 2 కోట్ల కనీస ధర): ఇయాన్‌ మోర్గాన్, క్రిస్‌ వోక్స్, బెన్‌ స్టోక్స్‌ (ఇంగ్లండ్‌), ప్యాట్‌ కమిన్స్, మిషెల్‌ జాన్సన్‌ (ఆస్ట్రేలియా), ఇషాంత్‌ శర్మ (భారత్‌), ఏంజెలో మ్యాథ్యూస్‌ (శ్రీలంక).

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top