ధావన్‌.. ఇప్పటికైనా ఆడు బాబూ!

ధావన్‌.. ఇప్పటికైనా ఆడు బాబూ!


ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లోనూ టీమిండియా క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌కు ఒడిదుడుకులు తప్పడం లేదు. హైదరాబాద్ సన్‌రైజర్స్‌ జట్టు ఓపెనర్‌గా ఆడుతున్న ఈ క్రికెటర్‌ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 16 మ్యాచ్‌లు ఆడి.. 39.41 సగటుతో 473 పరుగులు చేశాడు. ధావన్‌ స్థాయి ఆటగాడికి ఇది తక్కువ స్కోరే అని చెప్పాలి.



గత ఐసీసీ టీ20 వరల్‌ కప్‌ నుంచి ధావన్‌ ఫామ్‌తో తంటాలు పడుతున్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి 43 పరుగులు చేసిన ఈ ధనాధన్‌ బ్యాట్స్‌మన్‌ ఇటు ఐపీఎల్‌లోనూ వరుసగా విఫలమవుతూ హైదరాబాద్ జట్టు సారథి డేవిడ్ వార్నర్‌ పై ఒత్తిడి పెంచుతున్నాడు. తాజాగా గుజరాత్‌ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్‌ డకౌట్‌ అయి ఘోరంగా విఫలమయ్యాడు. మరో ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్‌ వార్నర్‌ కడదాక నిలబడి 93 పరుగులు చేయడంతో సరిపోయిందిగానీ లేకపోతే ధావన్‌ వికెట్‌ ఎఫెక్ట్‌ చాలా తీవ్రంగానే ఉండేది. ఈ నేపథ్యంలో పడుతూ లేస్తూ.. తడబడుతున్న ధావన్‌ ఆటతీరుపై టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ స్పందించాడు.



'ఈ సీజన్‌లో హైదరాబాద్‌ జట్టు అద్భుతమైన ఆటతీరు కనబరుస్తోంది. పలువురు ఇండియన్ క్రికెటర్లను తీసుకోవడం జట్టుకు కలిసి వచ్చింది. ఆశిష్ నెహ్రా గాయంతో వైదొలిగాడు కానీ అతను ఉండి ఉంటే జట్టు బౌలింగ్ అటాక్‌ ఇంకా మెరుగ్గా ఉండేది. ఇక శిఖర్ ధావన్‌ జట్టు కోసం పరుగులు చేయాల్సిన అవసరముంది. ఇప్పటికైనా అతను ఆడాల్సిన సమయం ఆసన్నమైంది. భారత్‌కు ధావన్‌ కీలక బ్యాట్స్‌మన్‌. అదేవిధంగా ఈ టోర్నమెంటులోనూ అతను కీలకం. ఫస్ట్ క్వాలిఫైయర్‌లోనూ, సెకండ్‌ క్వాలిఫైయర్‌లోనూ అతను అంచనాలకు తగ్గట్టు ఆడలేదు. కనీసం ఫైనల్లోనైనా ఆడి డేవిడ్‌ వార్నర్‌, జట్టుకు అండగా నిలుస్తాడని ఆశిస్తున్నా' అని గంగూలీ ఓ టీవీ చానెల్‌తో పేర్కొన్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌ చాలామంది తక్కువ స్కోర్లకు వెనుదిగిరినా డేవిడ్ వార్నర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌కు ఆడాడని, అతడికి చివరిలో బిపుల్‌ శర్మ నుంచి తగిన మద్దతు లభించడంతో ఒత్తిడిలోనూ హైదరాబాద్‌ మధురమైన విజయాన్ని అందుకుందని గంగూలీ కొనియాడాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top