ప్రపంచ చాంపియన్‌షిప్‌పైనే దృష్టి!

ప్రపంచ చాంపియన్‌షిప్‌పైనే దృష్టి!


కొత్త వ్యూహాలకు ఆనంద్ పదును

 చెన్నై: క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో టైటిల్ సాధించిన విశ్వనాథన్ ఆనంద్ తదుపరి లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాడు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లు... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తనపై గెలిచిన మాగ్నస్ కార్ల్‌సెన్ (నార్వే)ను ఓడించే అన్వేషణలో పడ్డాడు. ఈ ఏడాది జరిగే చాంపియన్‌షిప్‌లో తిరిగి టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఆనంద్ ఉన్నాడు. ‘నా ఆలోచననలకు పదునుపెట్టే పని ఇప్పటికే మొదలైంది. ఏం చేయాలి... ఎలా ముందడుగు వేయాలనే ప్రాథమిక అంశాలపై ఇది వరకే కసరత్తు చేశాను. రాబోయే నెలల్లో వీటిపైనే నా దృష్టి ఉంటుంది. ఈ నెల కాస్త విరామం ఇచ్చినా, ఆలోచనలకు మాత్రం విశ్రాంతి లేదు’ అని అన్నాడు. ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన భారత సూపర్ గ్రాండ్‌మాస్టర్ ఆనంద్ తిరిగి కిరీటం చేజిక్కించుకునే వ్యూహాలు పన్నుతున్నాడు. ‘నన్ను కంగుతినిపించిన కార్ల్‌సెన్‌తో పోరు ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లాలో కూడా తెలుసు... కానీ అవన్నీ ఇప్పుడే బహిర్గతం చేయలేను. అనుకున్నది సాధించేందుకు ఆశావహ దృక్పథంతో ముందడుగు వేస్తాను’ అని 44 ఏళ్ల ఆనంద్ చెప్పాడు. టోర్నీలో కావాల్సిందల్లా ఉత్సాహపరిచే విజయాలేనన్నాడు.

 

 అది ఆరంభ రౌండ్లలో లభిస్తే తిరుగు ఉండదని అతను అభిప్రాయపడ్డాడు. ఇప్పటి తన జోరు ప్రత్యర్థుల్ని ఒత్తిడిలోకి నెడుతుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ... ‘ఇప్పుడే ఎలా చెబుతాం. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు జరిగే టోర్నీల్లో ముందు గాడిన పడాలి. ప్రత్యర్థుల్ని ఓడించాలి. అప్పుడే ఒత్తిడిని పెంచగలం’ అని ఆనంద్ అన్నాడు. సందీపన్ చందాతో తిరిగి జతకడతానని చెప్పాడు. నార్వేలో అతనితో పనిచేశానని... చక్కని వ్యూహాలను రూపొందించడంలో చందా సిద్ధహస్తుడని చెప్పాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top