కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం రాని వైనం

కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం రాని వైనం


 ఈ సీజన్ ఐపీఎల్‌కు ముందు జరిగిన వేలానికి డబ్బుల సంచులతో వచ్చిన ఫ్రాంచైజీలు కొంతమంది క్రికెటర్లపై రూ. కోట్ల వర్షం కురిపించాయి. తమను విజేతగా నిలబెడతారనే నమ్మకంతో ఊహించని స్థాయిలో డబ్బు ఖర్చు చేశాయి. కట్ చేస్తే... ఇప్పుడు అదే ఫ్రాంచైజీలు లబోదిబోమంటున్నాయి. ఆదుకుంటారనుకున్న వాళ్లు తెల్ల ఏనుగుల్లా మారినా మింగలేక కక్కలేక సతమతమవుతున్నాయి. ఈ సీజన్ ఐపీఎల్ కోసం జరిగిన వేలంలో అందరికంటే ఎక్కువ డబ్బు పొందిన క్రికెటర్లు యువరాజ్, దినేశ్ కార్తీక్, మ్యాథ్యూస్. అదేంటో... ముగ్గురిలో కనీసం ఒక్కరు కూడా ఆకట్టుకోలేకపోయారు.

 

 సాక్షి క్రీడా విభాగం

 అక్షరాలా 6 లక్షల 45 వేలు... ఐపీఎల్-8లో యువరాజ్ సింగ్ చేసిన ఒక్కో పరుగు విలువ. కానీ అతని జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు మాత్రం ఈ పరుగులు చెల్లని కాణీలుగానే మారిపోయాయి. యువీ ఒక్కడే కాదు, ఆ జట్టుకు శ్రీలంక జాతీయ జట్టు కెప్టెన్ ఏంజెలో మ్యాథ్యూస్ కూడా పెనుభారంగా మారిపోయాడు. దినేశ్ కార్తీక్‌ని కొనుకున్న బెంగళూరు, జడేజాను కొనసాగించిన చెన్నైదీ ఇదే బాధ. ఈ నలుగురూ కూడా తమ యజమానుల నమ్మకాన్ని నిలబెట్టలేకపోయారు.

 

 యువరాజ్ సింగ్ (రూ. 16 కోట్లు)   పరుగు విలువ రూ. 6 లక్షల 45 వేలు

 ఒక్క మ్యాచ్ అయినా ఆడకపోతాడా, ఈ సారైనా చెలరేగుతాడేమో అంటూ ప్రతీ మ్యాచ్‌కు ఆశగా ఎదురు చూసిన అభిమానులను యువరాజ్ ఏ మాత్రం సంతృప్తి పరచలేదు. 13 ఇన్నింగ్స్‌లలో 19.07 సగటుతో 248 పరుగులు మాత్రమే చేశాడు. 210 బంతులే ఎదుర్కొన్న అతని స్ట్రైక్ రేట్ 118 మాత్రమే కావడం యువీ బ్యాటింగ్ బలహీనతను సూచిస్తోంది. చేసిన రెండు అర్ధ సెంచరీలలో ఒక మ్యాచ్‌లో ఢిల్లీ గెలవగా, మరొకటి ఓడింది. బౌలింగ్‌లో ఒక వికెట్ మాత్రం తీయగలిగాడు. విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు ఉన్న యువీ దురదృష్టవశాత్తూ గత ఏడాది ఐపీఎల్ వైఫల్యాన్నే ఈ సారి కూడా కొనసాగించాడు. మైదానంలో ఏ మాత్రం చురుగ్గా కనిపించని యువీ, డేర్‌డెవిల్స్ ప్రచార కార్యక్రమాలకు మాత్రం పనికి రావడం ఆ జట్టుకు ఊరట. బ్రాండింగ్‌తో పాటు ఇతర చోట్ల టీమ్ విలువను పెంచేందుకు యువీ స్టార్ హోదా ఉపయోగపడింది. ‘యువీకి మేం ఇచ్చింది మార్కెట్ విలువ మాత్రమే. దానినేమీ అతను కోరుకోలేదు. పోటీ ఉండటం వల్లే విలువ పెరిగింది’ అని ఢిల్లీ యాజమాన్యం వెనకేసుకొచ్చినా అతని వైఫల్యం మాత్రం వారిని తీవ్రంగా నిరాశ పర్చింది.

 

 దినేశ్ కార్తీక్ (రూ. 10.5 కోట్లు)    పరుగు విలువ రూ. 7 లక్షల 45 వేలు

 గత ఏడాది ఢిల్లీ వేదన ఈ సారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో వినిపించింది. ఐపీఎల్-7లో రూ. 12.5 కోట్లు పలికిన దినేశ్ కార్తీక్‌ను ఈ సారి బెంగళూరు అంతకంటే కాస్త తక్కువే అయినా భారీ మొత్తానికే తీసుకుంది. జట్టులోని స్టార్ విదేశీ ఆటగాళ్ల కారణంగా ఈ జట్టుకు దేశవాళీ వికెట్ కీపర్ అవసరమయ్యాడు. ఫలితంగా కార్తీక్‌కు అన్ని మ్యాచ్‌లలో ఆడే అవకాశం దక్కింది. కానీ అతను ఫ్రాంచైజీ నమ్మకాన్ని ఏ దశలోనూ నిలబెట్టలేకపోయాడు. ఈ కీపర్ బ్యాట్స్‌మన్ 11 ఇన్నింగ్స్‌లలో కలిపి 141 పరుగులే చేశాడు. 28 అత్యధిక స్కోరు కాగా, సగటు 12.81 మాత్రమే! కార్తీక్ చేసిన ఒక్కో పరుగు విలువ దాదాపు రూ. 7 లక్షల 45 వేలు అవుతుంది. కీపర్‌గా కూడా అద్భుతాలేమీ చేయని కార్తీక్, చెన్నైతో జరిగిన కీలక మ్యాచ్ (ఎలిమినేటర్)లో అయితే అతను కీపర్‌గానూ ఘోరంగా విఫలమయ్యాడు. పైగా హైదరాబాద్‌తో వర్షం బారిన పడిన మ్యాచ్‌లో అంపైర్లతో వాగ్వాదానికి దిగి వివాదానికి కారణమయ్యాడు.

 

 ఏంజెలో మ్యాథ్యూస్ (రూ. 7.5 కోట్లు)   పరుగు విలువ రూ. 5 లక్షల 21 వేలు

 ఈ టోర్నీకి ముందు మ్యాథ్యూస్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. వన్డేలు, టి20ల్లో పర్‌ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపుతో పాటు లంక కెప్టెన్‌గా కూడా అతనికి మంచి విలువ ఉంది. గత రెండేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్‌లలో నిలకడగా రాణించిన ఏకైక ఆటగాడు అతను. బహుశా ఇదే ఢిల్లీ అతనికి భారీ ఆఫర్ ఇచ్చేలా పురిగొల్పినట్లుంది. కానీ ఐపీఎల్‌లో మాత్రం అతని ఆట చూస్తే ‘అయ్యో’ అనిపించింది. 10 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను చేసింది 144 పరుగులు మాత్రమే. అంటే ఒక్కో పరుగు విలువ రూ. 5 లక్షల 21 వేలు! ఒక్క మ్యాచ్‌లోనూ అతని స్కోరు కనీసం 30 దాటలేదు. బౌలింగ్‌లో 7 వికెట్లు తీసినా అవి జట్టుకు ఉపయోగపడలేదు. అటు బ్యాటింగ్ గానీ ఇటు బౌలింగ్ కానీ  ఏ దశలోనూ మ్యాథ్యూస్ జట్టులో ఉన్నాడనే ముద్ర కనిపించలేదు. ఒక్క మ్యాచ్‌లోనూ స్థాయికి తగినట్లుగా ఆడలేదు. ఇంత భారీ మొత్తం దక్కని గత సీజన్‌లలో మ్యాథ్యూస్ ప్రదర్శన సంతృప్తికరంగా ఉండటం విశేషం.

 

 రవీంద్ర జడేజా (రిటెయిన్)

 చెన్నై జట్టు కీలక ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు ఉండి జట్టు కొనసాగించుకున్న ఆటగాడు జడేజా. రిటైన్ చేసుకోవడం వల్ల ఎంత మొత్తమే ఖచ్చితంగా తెలియకపోయినా, భారీ విలువే ఉంటుంది. కానీ జడేజా 12 ఇన్నింగ్స్‌లలో 132 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా ఫ్లాప్ అయ్యాడు. అతని స్ట్రైక్ రేట్ కేవలం 104 మాత్రమే ఉండగా, అత్యధిక స్కోరు 24! బౌలింగ్‌లో 11 వికెట్లు తీసినా...అవన్నీ టెయిలెండర్లవి, అప్పటికే మ్యాచ్ ఫలితం నిర్ధారణ అయ్యాక తీసినవే. అపార నమ్ముకముంచి ప్రతీ మ్యాచ్‌లో ధోని అవకాశం ఇచ్చినా జడేజా ఆటతీరు మారలేదు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top