హ్యూస్ పరిస్థితి విషమం!

హ్యూస్ పరిస్థితి విషమం!


సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్‌లో మంగళవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. దేశవాళీ టోర్నీలో ఆడుతున్న టెస్టు క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మైదానంలో తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. దక్షిణ ఆస్ట్రేలియా-న్యూసౌత్‌వేల్స్ మధ్య ప్రారంభమైన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. ప్రత్యర్థి జట్టు బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌ను ఆడబోయి హ్యూస్ విఫలమయ్యాడు. ఒక్క సారిగా దూసుకొచ్చిన బంతి అతని తలను బలంగా తాకింది. దాంతో అతను వెంటనే బాధతో మైదానంలో కుప్ప కూలిపోయాడు. హెల్మెట్ పెట్టుకొని ఉన్నా కూడా హ్యూస్‌కు తీవ్ర గాయం కావడం గమనార్హం.



 మెదడుకు ఆపరేషన్: స్ట్రెచర్‌పై హ్యూస్‌ను మైదానం బయటికి తీసుకెళ్లి న్యూసౌత్‌వేల్స్ జట్టు డాక్టర్లు తాత్కాలికంగా చికిత్స అందించారు. అయినా తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో వారు నోటి ద్వారా శ్వాసను అందించే ప్రయత్నం చేశారు. అయితే కొద్ది సేపటికే ఎయిర్ అంబులెన్స్‌తో పాటు మరో రెండు అంబులెన్స్‌లు రావడంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం హ్యూస్‌కు శస్త్ర చికిత్స నిర్వహించారు. అయితే ఇప్పటికీ అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న అతను కోమాలోకి వెళ్లకుండా డాక్టర్లు శ్రమిస్తున్నారు. గాయం సంగతి తెలిసిన వెంటనే మైకేల్ క్లార్క్‌తో పాటు పలువురు క్రికెటర్లు, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారులు హాస్పిటల్‌కు చేరుకున్నారు.



 టెస్టు రేసులో...: ఈ ఆదివారం 26వ పుట్టిన రోజు జరుపుకోనున్న హ్యూస్ భారత్‌తో సిరీస్ కోసం ఆస్ట్రేలియా టెస్టు జట్టులో స్థానం సాధించే ప్రయత్నంలో ఉన్నాడు. తొలి టెస్టులో స్థానం లభించకపోయినా... షెఫీల్డ్ షీల్డ్ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. కెప్టెన్ క్లార్క్ గాయం కారణంగా హ్యూస్‌కు అవకాశాలు కూడా మెరుగయ్యాయి. గాయపడే సమయానికి అతని జట్టు సౌత్ ఆస్ట్రేలియా స్కోరు 136/2 కాగా... హ్యూస్ 63 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంతలో ఈ దురదృష్టకర ఘటన జరిగింది. ఆసీస్ తరఫున 26 టెస్టులు ఆడిన హ్యూస్, ఆఖరిసారి గత ఏడాది జులైలో బరిలోకి దిగాడు.

 

 త్వరగా కోలుకోవాలి: భారత జట్టు ఆకాంక్ష

 ఫిల్ హ్యూస్ త్వరగా కోలుకోవాలని భారత క్రికెట్ జట్టు ఆకాంక్షించింది. ‘హ్యూస్ గాయం దురదృష్టకరం. అతను తొందరగా కోలుకోవాలని మేం కోరుకుంటున్నాం. ఫిల్ కుటుంబ సభ్యులకు అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉంది. క్రికెట్ సమాజంతో పాటు ఆస్ట్రేలియాలోని మా భారత మిత్రులు కూడా హ్యూస్ ఆరోగ్యం కోసం ప్రార్థించాలని కోరుతున్నాం’ అని భారత టీమ్ మేనేజ్‌మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top