24 ఏళ్లకు టీమిండియా సిరీస్ కైవసం

24 ఏళ్లకు టీమిండియా సిరీస్ కైవసం


బర్మింగ్ హమ్: భారత క్రికెట్ అభిమాని కోరిక తీరింది. ఎంతోమంది దిగ్గజాలకు అందని ఫలితం ధోనీ సేనకు దక్కింది. టెస్టుల్లో ఘోరంగా ఓడిన  టీమిండియా.. వన్డేల్లో విశేషంగా రాణించి ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ ను కైవసం చేసుకుంది. దీంతో 24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా ఆటగాళ్లు సరికొత్త చరిత్రను లిఖించారు. మంగళవారం ఇంగ్లండ్ తో ఇక్కడ జరిగిన నాల్గో వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. గత రెండు వన్డేల్లో ప్రదర్శించిన ఊపునే కొనసాగించిన టీమిండియా ఆటగాళ్లు.. అదే విజయపరంపరను కొనసాగించి సిరీస్ 3-0 తేడాతో చేజిక్కించుకున్నారు. 207 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు ఓపెనర్లు రహానే, శిఖర్ థావన్ లు శుభారంభానిచ్చారు. రహానే (106), పరుగులు చేసి వన్డేల్లో తొలి సెంచరీ నమోదు చేయగా, మరో ఓపెనర్ శిఖర్ థావన్(97*) పరుగులతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆది నుంచి ఇంగ్లండ్ పై విరుచుకుపడిన భారత్.. కేవలం 30.3 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించింది. ఐదు వన్డేలకు గాను జరిగిన ఈ సిరీస్ లో ఇంకా ఒక మ్యాచ్ ఉండగానే టీమిండియా సిరీస్ దక్కించుకోవడం విశేషం.


 


ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ ను టీమిండియా బౌలర్లు మరోమారు స్వల్ప పరుగులకే కట్టడి చేశారు.  ఓపెనర్లు అలెస్టర్ కుక్(9),హేల్స్ (6)లను  భువనేశ్వర్ కుమార్ ఆదిలోనే పెవిలియన్ కు పంపి ఇంగ్లండ్ కు షాకిచ్చాడు. అనంతరం బ్యాలెన్స్ (7) పరుగులకే పెవిలియన్ కు చేరడంతో ఇంగ్లండ్ తేరుకోలేకపోయింది. మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు రూట్ (44), మహ్మద్ ఆలీ(67)పరుగులు చేయడంతో ఇంగ్లండ్ 49.3 ఓవర్లలో 206 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీకి మూడు వికెట్లు లభించగా, జడేజా, భువనేశ్వర్ కుమార్ లకు తలో రెండు, అశ్విన్, రైనాలకు చెరో వికెట్టు దక్కింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top