అదిరిన గురి

అదిరిన గురి


25 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో భారత మహిళలకు కాంస్యం




 ఇంచియాన్: మిగతా విభాగాల్లో ఎలా ఉన్నా... ఏషియాడ్‌లో భారత షూటర్ల గురి మాత్రం అదురుతోంది. సోమవారం జరిగిన మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్స్‌లో రాహీ సార్నోబాత్, అనిసా సయ్యద్, హీనా సిద్ధూల బృందం ఓవరాల్‌గా 1729 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ర్యాపిడ్‌లో సూపర్ షాట్స్‌తో అలరించిన అనిసా 294/300 పాయింట్లు సాధించింది. ప్రిసిషన్ రౌండ్‌లో 283 పాయింట్లు రావడంతో ఓవరాల్‌గా 577 పాయింట్లు సాధించింది. సార్నోబాత్ ర్యాపిడ్ 298, ప్రిసిషన్‌లో 291 పాయింట్లతో 580 పాయింట్లు గెలిచింది. హీనా ర్యాపిడ్‌లో 281, ప్రిసిషన్‌లో 291 పాయింట్లతో 572 పాయింట్లు సాధించింది. ఈ విభాగంలో కొరియా (1748 పాయింట్లు), చైనా (1747 పాయింట్లు) స్వర్ణం, రజతం గెలుచుకున్నాయి. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రాహీ సార్నోబాత్ సెమీస్‌లో 15 పాయింట్లు సాధించి ఏడో స్థానంతో ఫైనల్స్‌కు దూరమైంది. అనిసా, హీనాలు నిరాశపర్చారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అయోనికా పాల్ (417.7), అపూర్వి చండిలా (413.8), రాజ్ చౌదురీ (407.6)లు ఓవరాల్‌గా 1239.1 పాయింట్లు సాధించి ఆరోస్థానంతో సంతృప్తిపడ్డారు. చైనా (1253.8 పాయింట్లు), ఇరాన్ (1245.9 పాయింట్లు) స్వర్ణం, రజతాలను దక్కించుకున్నాయి. వ్యక్తిగత విభాగంలో అపూర్వి, రాజ్ చౌదురీ నిరాశపర్చినా అయోనిక ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ తుది పోరులో ఆమె  101.9 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది.





 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top