బీసీసీఐకి రూ. 190 కోట్ల నష్టం!

బీసీసీఐకి రూ. 190 కోట్ల నష్టం!


టి20 ప్రపంచ కప్‌ నిర్వహణా భారం  



ముంబై: టి20 మ్యాచ్‌లు అంటేనే ప్రపంచ క్రికెట్‌లో అదో రకం క్రేజ్‌... ఇక ప్రపంచ కప్‌ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. భారత్‌లో ప్రపంచ కప్‌ అంటే ప్రేక్షకుల వీరాభిమానం, ప్రకటనల జోరు కలగలిసి బీసీసీకి భారీ ఆదాయం తెచ్చి పెట్టాలి. కానీ క్రికెట్‌ ప్రేమికుల దేశంలో తొలిసారి నిర్వహించిన టి20 ప్రపంచ కప్‌ బోర్డుకు ఆర్థికంగా నష్టాలే తెచ్చి పెట్టిందట! 2016 మార్చి, ఏప్రిల్‌లో దేశంలోని వేర్వేరు వేదికలపై టి20 వరల్డ్‌ కప్‌ జరిగింది. ఈ టోర్నీ వల్ల బీసీసీఐ రూ. 190 కోట్లు నష్టపోయిందని ఇటీవలి ఒక నివేదిక బయట పెట్టింది. దీనిపై కొద్ది రోజుల బీసీసీఐ–సీఓఏ మధ్య జరిగిన ప్రత్యేక సమావేశంలో చర్చ కూడా జరిగింది కానీ పరువు పోతుందనే ఆలోచనతో బోర్డు ఈ అంశాన్ని దాచి పెట్టినట్లు సమాచారం.



తొలిసారి సర్వీస్‌ ట్యాక్స్‌ రూపంలో భారత ప్రభుత్వానికి బోర్డు రూ. 150 కోట్లు చెల్లించాల్సి రావడమే ఇందుకు ప్రధాన కారణం. పైగా భద్రత పేరుతో మ్యాచ్‌ జరిగిన వేదికలకు ఒక్కోదానికి రూ. 40 లక్షల చొప్పున కూడా అందజేశారు. సాధారణంగా మన దేశంలో పోలీసులకు భద్రత కోసం రూ. 7–10 లక్షల మధ్య చెల్లిస్తూనే ఉంటారు. అయితే ఈ 40 లక్షల కోసం బోర్డు కనీసం ఐసీసీ నుంచి అనుమతి కూడా తీసుకోలేదు. దాంతో ఈ మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు ఐసీసీ అంగీకరించలేదు.  



జోహ్రి విహారం...: మరోవైపు బీసీసీఐ సీఈఓ హోదాలో రాహుల్‌ జోహ్రి చేస్తున్న ఖర్చులపై బోర్డు ఆఫీస్‌ బేరర్లు గుర్రుగా ఉన్నారు. బోర్డు కార్యదర్శి, కోశాధికారి ఖర్చుల గురించి సీఓఏ ఫిర్యాదు చేయడంతో ఆగ్రహంతో ఉన్న వారు, కలిసి కట్టుగా జోహ్రిపై విమర్శలు ఎక్కు పెట్టారు. గత ఏడాది జూన్‌లో జోహ్రి సీఈఓగా ఎంపికయ్యారు. ఈ 14 నెలల కాలంలో ఆయన ప్రయాణ ఖర్చులే రూ. 70 లక్షలు ఉన్నాయి. అధికారిక కార్యక్రమాల పేరు చెప్పి 125 రోజులు ఆయన విదేశాల్లోనే ఉన్నారు. దీనికి రోజుకు 500 డాలర్ల అలవెన్స్‌తో రూ. 41 లక్షలు ఖర్చు చేశారు. రోజుకు కనీసం రూ. 20 వేల అద్దె ఉండే ఖరీదైన హోటళ్లలో ఉంటూ వసతి కోసమే రూ. 16 లక్షలు చెల్లించారు. భారత్‌లో పర్యటించిన సమయంలో డీఏ, ఇతర ఖర్చులు కలిపి ఆయన ఖాతాకు ఏకంగా రూ. 38 లక్షలు వెళ్లాయి. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్న ఆఫీస్‌ బేరర్లు ఎదురుదాడికి సిద్ధమవుతున్నారు. వీటికి తోడు ముంబైలో జోహ్రి ఇంటి అద్దె నెలకు రూ. 5 లక్షలు కూడా బీసీసీఐనే చెల్లిస్తుండటాన్ని వారు తీవ్రంగా తప్పు పడుతున్నారు.   

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top