సుశీల్ చేసిన తప్పేంటి?

సుశీల్ చేసిన తప్పేంటి?


రెజ్లింగ్‌లో ఒలింపిక్ పతకం కోసం58 ఏళ్ల ఎదురు చూపులకు తెరదించడం అతను చేసిన నేరమా?  వరుసగా రెండు ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించడం అతను చేసిన తప్పా?  ఏం చేశాడని ఈ వివక్ష...? ఎందుకు సుశీల్ కుమార్‌ను ఇంత దారుణంగా అవమానించారు? దేశానికి బెర్త్ తెచ్చింది నర్సింగ్ యాదవ్ కాబట్టి... అతడినే రియో ఒలింపిక్స్‌కు పంపిస్తామంటే... సహజ న్యాయాన్ని పాటిస్తున్నారులే అని సరిపెట్టుకున్నాం... కానీ నర్సింగ్ డోపింగ్‌లో దొరికన తర్వాత అతని స్థానంలో మరో ఆటగాడిని పంపించే అవకాశం ఉన్నా... సుశీల్‌ను కాదన్నారంటే దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లలో మువ్వన్నెలను రెపరెపలాడించి, దేశానికి కీర్తి తెచ్చిన ఆటగాడిని ఇంత దారుణంగా అవమానిస్తారా? దేశ ప్రయోజనాల కంటే తమ స్వార్థానికే పెద్దపీట వేసే పెద్దలు ఆటను నడుపుతారా? ఒలింపిక్స్‌కు ముందు దేశంలో రె జ్లింగ్‌లో జరిగిన పరిణామాలు క్రీడారంగానికి ఏ మాత్రం మేలు చేసేవి కావు.

 

 

 సాక్షి క్రీడావిభాగం  ‘లండన్‌లో దక్కని స్వర్ణాన్ని రియోలో సాధిస్తా... ‘పసిడి’ ప్రయత్నాలకు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెడతా’ నాలుగేళ్ల క్రితం లండన్ ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకున్న వెంటనే భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలివి. అయితే రెజ్లింగ్‌ను 2020 టోక్యో ఒలింపిక్స్ నుంచి తొలగిస్తున్నామంటూ 2013 ఫిబ్రవరిలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. అయితే రెజ్లింగ్ ఒలింపిక్స్‌లో కొనసాగించాలనే పట్టుదలతో యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ కొత్త తరహా ఆలోచనలతో ముందుకు వచ్చింది. వెయిట్ కేటగిరీలను మార్చడం, ఈ క్రీడను సులభంగా అర్ధం చేసుకొనేలా నిబంధనలను రూపొందిం చడం, ఒలింపిక్స్‌లో పురుషులతోపాటు మహిళా రెజ్లర్లకు కూడా సమానంగా స్వర్ణాలు లభించేలా చేయడం లాంటివి ఇందులో భాగమే. ఈ మార్పులను 2016 రియో ఒలింపిక్స్ నుంచే అమలు చేయాలని నిర్ణయించారు. దాంతో సుశీల్ పోటీపడే 66 కేజీల విభాగం, యోగేశ్వర్ దత్ పాల్గొనే 60 కేజీల విభాగం ఒలింపిక్స్‌లో లేకుండా పోయాయి. వీటి స్థానంలో కొత్తగా 65 కేజీల విభాగం వచ్చింది. లండన్ ఒలింపిక్స్‌లో 60 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గిన యోగేశ్వర్ దత్ అవకాశాలు దెబ్బ తినకూడదనే ఉద్దేశంతో సుశీల్ 74 కేజీల విభాగానికి మారిపోయాడు.





యోగేశ్వర్ 65 కేజీల విభాగంలో పోటీపడాలని నిర్ణయించుకున్నారు. 2013 సెప్టెంబరులో నిర్వహించిన ఓటింగ్‌లో రెజ్లింగ్‌కు అత్యధిక ఓట్లు రావడంతో 2020, 2024 ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ఐఓసీ ప్రకటించింది.  రెండో అవకాశం లేకుండా: సుశీల్ కొత్తగా మారిన 74 కేజీల విభాగంలో నర్సింగ్ యాదవ్ అప్పటికే నిలకడగా రాణిస్తున్నాడు. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో సుశీల్ 74 కేజీల విభాగంలో పోటీపడి స్వర్ణాన్ని సాధించాడు. అదే ఏడాది ఇంచియాన్ ఆసియా క్రీడలకు సుశీల్ దూరంగా ఉండటంతో... అతని స్థానంలో బరిలోకి దిగిన నర్సింగ్ కాంస్య పతకాన్ని నెగ్గాడు. ఆ తర్వాత సుశీల్ భుజం గాయం కారణంగా మరే అంతర్జాతీయ టోర్నీలో పాల్గొనకున్నా ఒలింపిక్స్ సన్నాహాలను మాత్రం కొనసాగించాడు. 2015 సెప్టెంబరులో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల సమయానికి సుశీల్ కోలుకోకపోవడంతో నర్సింగ్ 74 కేజీల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిం చాడు. కాంస్యాన్ని సాధించడంతోపాటు భారత్‌కు ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు. ఒకసారి ఒక వెయిట్ కేటగిరీలో ఒలింపిక్ బెర్త్ ఖాయమైతే ఆ కేటగిరీలో ఆ దేశానికి మరోసారి పోటీపడే అవకాశం ఉండ దు. నర్సింగ్ ఒలింపిక్ బెర్త్ సంపాదించడంతో 74 కిలోల విభాగంలో సుశీల్‌కు ఒలింపిక్ బెర్త్ సాధించే అవకాశం లేకుండా పోయింది.



 తేడా ఎక్కడ వచ్చిదంటే: నర్సింగ్ ఒలింపిక్ బెర్త్ తెచ్చినా రెండు ఒలింపిక్ పతకాలు నెగ్గిన సుశీల్ కూడా ఇదే విభాగంలో పోటీ పడుతుండటంతో రియోకు ఎవరు వెళ్తారనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ విషయాన్ని సుశీల్ కుమార్ వర్గం భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ దృష్టికి తెచ్చింది. అప్పటికి ఒలింపిక్స్‌కు ఏడాది సమయం ఉండటంతో... రియోకు ఎవరిని పంపించాలి అనే విషయం ట్రయల్స్ ద్వారా నిర్ణయిస్తామని సుశీల్ వర్గానికి బ్రిజ్‌భూషణ్ హామీ ఇచ్చారు. దాంతో ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారు. అయితే 2015 డిసెంబరులో భారత్‌లో తొలిసారి ప్రొ రెజ్లింగ్ లీగ్‌ను నిర్వహించారు. సుశీల్‌ను ఉత్తర్‌ప్రదేశ్ వారియర్స్ ఫ్రాంచైజీ రూ. 38.20 లక్షలకు కొనుగోలు చేసింది. మరోవైపు యోగేశ్వర్ దత్, ఇద్దరు విదేశీ మహిళా రెజ్లర్లకు సుశీల్ కంటే ఎక్కువ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేయడం ఆశ్చర్యపరచింది. ప్రొ రెజ్లింగ్ లీగ్ ప్రారంభానికి ఒక్క రోజు ముందు సుశీల్ గాయం కారణంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించడం తో లీగ్ నిర్వాహకులు షాక్ తిన్నారు. సుశీల్ గైర్హాజరీలో లీగ్ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. సుశీల్ కారణంగానే లీగ్‌కు దెబ్బ పడిందని నిర్వాహకులతోపాటు బ్రిజ్‌భూషణ్ భావించారు.



అసలు విలన్ ఆయనే: లీగ్ ముగిశాక జరిగిన ఒలింపిక్ అర్హత టోర్నీల ద్వారా భారత్‌కు ఎనిమిది బెర్త్‌లు ఖాయమయ్యాయి. మరోవైపు ఒలింపిక్స్ గడువు సమీపిస్తుండటంతో ట్రయల్స్ గురించి బ్రిజ్‌భూషణ్‌ను సుశీల్ వర్గం వాకబు చేసింది. అయితే ప్రొ రెజ్లింగ్ లీగ్ సమయంలో సుశీల్ చివరి నిమిషంలో వైదొలిగిన  విషయాన్ని మనసులో పెట్టుకున్న డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు ఒలింపిక్ బెర్త్ సంపాదించిన నర్సింగ్ యాదవే 74 కేజీల విభాగంలో పాల్గొంటాడని, గతంలోనూ బెర్త్ సాధించినవారే ఒలింపిక్స్‌కు వెళ్లారని, ట్రయల్స్ నిర్వహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ట్రయల్స్ నిర్వహిస్తామని గతంలో హామీ ఇచ్చిన విషయాన్ని సుశీల్  వర్గం గుర్తు చేసినా ఫలితం లేకపోయింది. సుశీల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం, అక్కడా అతనికి నిరాశ ఎదురుకావడంతో ఈ స్టార్ రెజ్లర్ రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే ఆశలను వదులుకున్నాడు.

 

ప్రత్యామ్నాయ అవకాశం ఉన్నా...

అనుకోకుండా నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో దొరికిపోవడం... అతనిపై తాత్కాలిక నిషేధం పడటంతో 74 కేజీల విభాగంలో బెర్త్ ఖాళీ అయింది. నర్సింగ్ స్థానంలో వేరే రెజ్లర్‌ను పంపించే వెసులుబాటు ఉందని యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ భారత సమాఖ్యకు, ఒలింపిక్ సంఘానికి సమాచారం అందించింది. అయితే సుశీల్‌ను పంపించే అవకాశం ఉన్నా... రెజ్లింగ్ సమాఖ్య ఈ స్టార్ రెజ్లర్‌ను విస్మరించి అంతగా అనుభవం లేని ప్రవీణ్ రాణా పేరును ఖాయం చేసింది. తద్వారా సుశీల్‌ను రియోకు పంపించకూడదనే తన మాట ను బ్రిజ్‌భూషణ్ నెగ్గించుకున్నారు. నర్సింగ్‌పై నిజంగానే కుట్ర జరి గిందా లేదా అనే విషయంపై రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశమున్నా... రెజ్లింగ్ సమాఖ్య రాజకీయాలకు సుశీల్ భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చింది. పంతానికి పోకుండా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సమాఖ్య  ట్రయల్స్ నిర్వహించి ఉంటే ఈ వివాదం ఇక్కడి వరకు వచ్చేదే కాదు. మరో పతకం గెలిచే సత్తా ఉన్న సుశీల్‌ను కాదని ఒక జూనియర్‌ను పంపిస్తున్న భారత్ పతకంపై ఆశలు పెట్టుకునే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top