రోజర్ ఫెదరర్ ఆందోళన

రోజర్ ఫెదరర్ ఆందోళన


న్యూయార్క్:యూఎస్ ఓపెన్ లో ఎండలు మండిపోవడంతో ఏడుసార్లు గ్రాండ్ స్లామ్ ఓపెన్ విజేత, స్విస్ దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అసలు ఇంత తీవ్రమైన వేడితో  ఆడాలంటే చాలా కష్టంగా ఉంటుందని తెలిపాడు. ప్రతిష్టాత్మకంగా భావించే యూఎస్ ఓపెన్ లో ప్రతీ ఒక్కరూ బాగా సన్నద్ధమైనా.. ఎండను తట్టుకోవడం మాత్రం సవాల్ గా మారిందని పేర్కొన్నాడు.యూఎస్ ఓపెన్ లో దాదాపు 33 శాతం ఉష్ణోగ్రతలు నమోదు కావడ ఆటగాళ్లకు శాపంగా మారిందని తెలిపాడు. ఈ వేడిలో పురుషుల విభాగంలో ఐదు సెట్లు ఆడటం అంత తేలిక ఏమీ కాదని అంటున్నాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు తొందరగా ముగిస్తే ఫర్వాలేదు కానీ.. రెండున్నర గంటల నుంచి మూడున్నర గంటలు సమయం తీసుకుంటే మాత్రం శరీరం పూర్తిగా అలసి పోతుందన్నాడు. శుక్రవారం జరిగిన రెండో రౌండ్ లో రోజర్ ఫెదరర్ 6-1, 6-2, 6-1 తేడాతో స్టీవ్  డార్కిస్ ను ఓడించి మూడో రౌండ్ లోకి ప్రవేశించాడు.





ఎండ తీవ్రత కారణంగా గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో అర్థాంతరంగా వైదొలిగిన ఆటగాళ్ల సంఖ్య 14 కు చేరింది. గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌ల చరిత్రలో పురుషుల సింగిల్స్‌లో విభాగంలో ఇంతమంది ఎండ కారణంగా వైదొలగడం ఇదే ప్రథమం.  గత కొన్నేళ్లలో నిలకడగా యూఎస్ ఓపెన్‌కు వర్షం, తుఫాన్ అంతరాయం కలిగించాయి. ఫలితంగా నిర్వాహకులు రెండు ప్రధాన స్టేడియాలకు పైకప్పు నిర్మించడం మొదలుపెట్టారు. అయితే ఈసారి మాత్రం ఎండలు మండుతున్నాయి.  33 డిగ్రీల వేడిలో... రూబెన్ బెమెల్‌మాన్స్ (బెల్జియం)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో 22 ఏళ్ల జాక్ సోక్ (అమెరికా) 6-4, 6-4, 3-6, 1-2తో ఆధిక్యంలో ఉన్న దశలో కండరాలు పట్టేయడంతో కోర్టులోనే కుప్పకూలిపోయాడు. వెంటనే నిర్వాహకులు జాక్ సోక్‌కు ప్రథమ చికిత్స చేసి కోర్టు పక్కకు నీడలోకి తీసుకెళ్లారు. నీరసించిన సోక్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)తో జరిగిన మ్యాచ్‌లో డెనిస్ ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్) 4-6, 4-6, 0-1తో వెనుకబడిన దశలో ఎండ వేడిమికి వైదొలిగాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top