సూపర్ సౌరవ్

సూపర్ సౌరవ్


అంచనాలకు అనుగుణంగా రాణించిన స్క్వాష్ మేటి ఆటగాడు సౌరవ్ ఘోషాల్ ఆసియా క్రీడల్లో కొత్త చరిత్ర సృష్టించాడు. అద్భుతమైన ఆటతీరుతో చెలరేగిన ఈ కోల్‌కతా కుర్రాడు ఫైనల్‌కు చేరిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. స్టార్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ కాంస్యంతో సరిపెట్టుకోగా... షూటింగ్‌లో భారత్‌కు మరో కాంస్యం లభించింది.

 

 ఇంచియాన్: ఆసియా క్రీడల మూడో రోజు భారత అథ్లెట్లు కాస్త నిరాశపర్చినా స్క్వాష్‌లో మాత్రం ఎన్నడూ లేని ఘనతను సాధించారు. గ్లాస్ కోర్టులో బెబ్బులిలా దూకుతూ ఆద్యంతం ఆకట్టుకున్న టాప్‌సీడ్ ప్లేయర్ సౌరవ్ ఘోషాల్ ఫైనల్‌కు చేరి కొత్త చరిత్రను లిఖించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ప్రపంచ 16వ ర్యాంకర్ సౌరవ్ 11-9, 11-4, 11-5తో ప్రపంచ 35వ ర్యాంకర్ బెంగ్ హీ (మలేసియా)పై గెలిచాడు. 45 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో భారత కుర్రాడు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఆసియా క్రీడల్లో ప్రత్యర్థి రికార్డు  (2002, 06లో స్వర్ణం, 2010లో కాంస్యం) బాగున్నా ఏమాత్రం తడబడలేదు. పీఎస్‌ఏ ప్రొఫెషనల్ టూర్లలో రెండు సార్లు తలపడిన ఇద్దరు చెరో మ్యాచ్‌లో గెలిచారు. కానీ జూన్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో బెంగ్ చేతిలో ఓడిన సౌరవ్ ఈ మ్యాచ్ ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాడు.

 సెమీస్‌లో దీపికకు నిరాశ

 మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ దీపికా పల్లికల్ కాంస్యంతో సరిపెట్టుకుంది. సెమీస్‌లో ఆమె 4-11, 4-11, 5-11తో టాప్‌సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నికోల్ డేవిడ్ (మలేసియా) చేతిలో పరాజయం చవిచూసింది. ఫేవరెట్‌గా దిగిన నికోల్ కేవలం 25 నిమిషాల్లోనే భారత క్రీడాకారిణి ఆట కట్టించింది. 1998 బ్యాంకాక్ గేమ్స్ నుంచి ఇప్పటి వరకు నాలుగుసార్లు టైటిల్స్ గెలిచిన నికోల్ అద్భుతమైన ఫామ్‌ను కనబర్చింది. కనీసం పల్లికల్‌కు కోలుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. కాంస్య పతకం సాధించిన దీపికకు తమిళనాడు ప్రభుత్వం రూ. 20 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించింది.

 

 ‘డ్రాలో జరిగిన అవకతవకలపై పోరాడుతా. క్వార్టర్స్‌లో జోష్నపై గెలవడం నాకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఆమెను ఎదుర్కోలేనని చాలా మంది భావించారు. అయితే డ్రాలో జరిగిన పొరపాటు వల్ల భారత్‌కు మరో పతకం చేజారింది. డ్రాపై మాట్లాడిన తర్వాత కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి. వాటి నుంచి గట్టెక్కడానికి నా ట్రెయినర్ బసు శంకర్, నా కాబోయే భర్త దినేశ్ కార్తీక్ చాలా సహాయం చేశారు.’           - దీపిక







 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top