సన్‌‘రైజ్’ కాలేదు

సన్‌‘రైజ్’ కాలేదు


మలింగ ధాటికి చేతులెత్తేసిన హైదరాబాద్

►  ముంబై ఇండియన్స్‌కు రెండో విజయం


ఆరంభంలో మంచి భాగస్వామ్యం లభించినా... మిడిల్ ఆర్డర్ తడబడితే  తేరుకోవడం కష్టమేనని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరోసారి అనుభవమైంది. కష్టసాధ్యంకాని లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ బ్యాట్స్‌మెన్ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చకపోవడంతో హైదరాబాద్‌కు నాలుగో ఓటమి ఎదురైంది. మరోవైపు కీలకదశలో మలింగ పేస్ ప్రతాపంతో మూడు వికెట్లు పడగొట్టి ముంబై ఇండియన్స్ ఖాతాలో రెండో విజయాన్ని చేర్చాడు.

 

ముంబై : హైదరాబాద్ విజయ లక్ష్యం 20 ఓవర్లలో 158 పరుగులు. ఓ దశలో జట్టు స్కోరు 17 ఓవర్లలో 124/4. ఇక గెలవాలంటే చివరి 18 బంతుల్లో 34 పరుగులు చేయాలి. జోరుమీదున్న రవి బొపారా (27 బంతుల్లో 23; 1 ఫోర్)తో పాటు తెలుగు కుర్రాడు హనుమ విహారి (10 బంతుల్లో 16; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఇక సన్‌రైజర్స్ గెలుపు ఖాయమే అనుకుంటున్న తరుణంలో ముంబై పేసర్ మలింగ (4/23) మాయ చేశాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో బొపారాను మెక్లీంగన్ అవుట్ చేస్తే... తర్వాతి ఓవర్‌లో మలింగ నాలుగు బంతుల తేడాలో విహారి, ప్రవీణ్ (0), స్టెయిన్ (0)ల వికెట్లు కూల్చేశాడు. అంతే 19 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 128/8గా మారింది.



ఇక విజయం దక్కాలంటే ఆఖరి ఓవర్‌లో 30 పరుగులు చేయాల్సిన దశలో హైదరాబాద్ చేతులెత్తేసింది. దీంతో వాంఖడే స్టేడియంలో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. సిమ్మన్స్ (42 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్), పొలార్డ్ (24 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి ఆడారు. తర్వాత హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులకే పరిమితమైంది. ధావన్ (29 బంతుల్లో 42; 7 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. మలింగకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.



విజృంభించిన పేస్ త్రయం



పవర్‌ప్లేలో కాస్త ఎక్కువ పరుగులు సమర్పించుకున్న సన్‌రైజర్స్ పేస్ త్రయం మ్యాచ్ చివర్లో మాత్రం ముంబైని బాగా కట్టడి చేసింది. ఓపెనర్లలో సిమ్మన్స్ జోరు కనబర్చినా... 9 బంతుల తేడాలో పార్థీవ్ (17 బంతుల్లో 17; 3 ఫోర్లు), ఉన్ముక్త్ (5) అవుట్‌కావడంతో ముంబై 49 పరుగులకు 2 వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో రోహిత్ శర్మ (15 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) సింగిల్స్‌తో సిమ్మన్స్‌కు ఎక్కువగా స్ట్రయికింగ్ ఇచ్చాడు. దీన్ని బాగా సద్వినియోగం చేసుకున్న సిమ్మన్స్.. కరణ్ శర్మ, ప్రవీణ్ బౌలింగ్‌లో భారీ సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో 41 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు.



అయితే రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించిన తర్వాత వరుస ఓవర్లలో ఈ ఇద్దరు అవుటయ్యారు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి ముంబై 4 వికెట్లకు 112 పరుగులు చేసింది. తర్వాత ఓ ఎండ్‌లో పొలార్డ్ వేగంగా ఆడాడు. రెండో ఎండ్‌లో రాయుడు (7 బంతుల్లో 7; 1 ఫోర్), హర్భజన్ (0)లు తక్కువ స్కోరుకే పరిమితమైనా.... సుచిత్ (5 బంతుల్లో 9 నాటౌట్)తో కలిసి ఏడో వికెట్‌కు 10 బంతుల్లోనే 21 పరుగులు జోడించాడు. అయితే చివరి ఓవర్ తొలి రెండు బంతులకు భువనేశ్వర్... పొలార్డ్, వినయ్ (0)లను పెవిలియన్‌కు పంపి ముంబై భారీ స్కోరును అడ్డుకున్నాడు. భువనేశ్వర్ 3, స్టెయిన్, ప్రవీణ్ చెరో రెండు వికెట్లు తీశారు.



ధావన్ మినహా...



భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్‌కు ధావన్ మెరుపు ఆరంభాన్నిచ్చినా... మిగతా వారు ఒత్తిడిని జయించలేకపోయారు. లోకేశ్ రాహుల్ (27 బంతుల్లో 25; 1 సిక్స్), బొపారా ఓ మోస్తరుగా ఆడారు. తొలి వికెట్‌కు 45 పరుగులు జోడించాక వార్నర్ (7 బంతుల్లో 9; 2 ఫోర్లు).. కొద్దిసేపటికి నమన్ ఓజా (9) అవుట్ కావడంతో హైదరాబాద్ తొలి 10 ఓవర్లలో 3 వికెట్లకు 74 పరుగులు చేసింది. తర్వాత బొపారా, రాహుల్ నాలుగో వికెట్‌కు 36 పరుగులు జోడించి రన్‌రేట్ తగ్గకుండా చూశారు.



అయితే 15వ ఓవర్‌లో మెక్లీంగన్.. రాహుల్‌ను అవుట్ చేయడంతో హైదరాబాద్ వికెట్ల పతనం మొదలైంది.  తర్వాత విహారి ఒకటి, రెండు బౌండరీలు బాదినా... రెండో ఎండ్‌లో మలింగ వరుస విరామాల్లో వికెట్లు తీశాడు. దీంతో ఓవరాల్‌గా 33 పరుగుల తేడాతో ఐదు వికెట్లు కోల్పోవడం హైదరాబాద్‌ను దెబ్బతీసింది. మెక్లీంగన్ 3, సుచిత్ ఒక వికెట్ తీశారు.

 

స్కోరు వివరాలు



ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : సిమ్మన్స్ (బి) స్టెయిన్ 51; పార్థీవ్ (సి) విహారి (బి) స్టెయిన్ 17; ఉన్ముక్త్ (సి) ధావన్ (బి) ప్రవీణ్ 5; రోహిత్ (సి) భువనేశ్వర్ (బి) కరణ్ శర్మ 24; పొలార్డ్ (బి) భువనేశ్వర్ 33; రాయుడు (సి) బౌల్ట్ (బి) భువనేశ్వర్ 7; హర్భజన్ (సి) భువనేశ్వర్ (బి) ప్రవీణ్ 0; సుచిత్ నాటౌట్ 9; వినయ్ (సి) నమన్ ఓజా (బి) భువనేశ్వర్ 0; మెక్లీంగన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 157.

వికెట్ల పతనం : 1-42; 2-49; 3-100; 4-108; 5-126; 6-128; 7-149; 8-149.

బౌలింగ్ : బౌల్ట్ 4-0-27-0; భువనేశ్వర్ 4-0-26-3; స్టెయిన్ 4-0-38-2; ప్రవీణ్ 4-0-35-2; కరణ్ శర్మ 4-0-30-1.



సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : ధావన్ (సి) మలింగ (బి) మెక్లీంగన్ 42; వార్నర్ (సి) రాయుడు (బి) మలింగ 9; లోకేశ్ రాహుల్ (సి) రాయుడు (బి) మెక్లీంగన్ 25; నమన్ ఓజా (సి) పొలార్డ్ (బి) సుచిత్ 9; బొపారా (సి) (సబ్) పాండే (బి) మెక్లీంగన్ 23; విహారి (సి) పార్థీవ్ (బి) మలింగ 16; కరణ్ శర్మ నాటౌట్ 2; ప్రవీణ్ (బి) మలింగ 0; స్టెయిన్ (సి) పొలార్డ్ (బి) మలింగ 0; భువనేశ్వర్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 137.

వికెట్ల పతనం : 1-45; 2-52; 3-68; 4-104; 5-126; 6-127; 7-127; 8-127.

బౌలింగ్ : హర్భజన్ 4-0-36-0; మెక్లీంగన్ 4-0-20-3; మలింగ 4-1-23-4; సుచిత్ 4-0-25-1; వినయ్ 4-0-31-0.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top