సన్ ‘స్వింగ్’ చేసింది

సన్ ‘స్వింగ్’ చేసింది


హైదరాబాద్ ఘన విజయం

20 పరుగులతో పంజాబ్ చిత్తు

చెలరేగిన వార్నర్

రాణించిన బౌల్ట్, భువనేశ్వర్


 

రెండేళ్ల క్రితం ఇదే మైదానంలో తాము ఆడిన ఏకైక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ సరిగ్గా 150 పరుగులే చేసింది. నాడు బౌలర్ల సత్తాతో 30 పరుగులతో మ్యాచ్‌ను నిలబెట్టుకుంది. ఈసారి కూడా ప్రత్యర్థి అదే. పరుగులు కూడా అవే. చూస్తే భారీ స్కోరేమీ కాదు. కానీ పరుగుల తేడానే మారింది తప్ప ఫలితం కాదు. సన్ నమ్ముకున్న బౌలింగ్ బలగం మరోసారి విజయాన్నందించింది. బౌల్ట్, భువనేశ్వర్‌ల ‘స్వింగ్’కు పంజాబ్ సొంతగడ్డపై తలవంచింది. బ్యాటింగ్‌లో మళ్లీ నాయకుడు వార్నర్ ముందుండి నడిపించగా హైదరాబాద్ గెలుపు సొంతం చేసుకుంది.

 

మొహాలీ: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కీలక విజయం దక్కింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో రైజర్స్ 20 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. వార్నర్ (41 బంతుల్లో 58; 10 ఫోర్లు, 1 సిక్స్) మళ్లీ చెలరేగి టోర్నీలో నాలుగో అర్ధ సెంచరీ సాధించడం విశేషం. అక్షర్ పటేల్, జాన్సన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. వృద్ధిమాన్ సాహా (33 బంతుల్లో 42; 2 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేయగా, ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. బౌల్ట్ (3/19), భువనేశ్వర్ (2/23) తమ స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బ తీశారు.



వార్నర్ మెరుపులు...



టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ను తప్పించిన కింగ్స్ ఎలెవన్ ఈ సారి అనూహ్యంగా వీరేంద్ర సెహ్వాగ్‌ను పక్కన పెట్టగా... రైజర్స్ తుది జట్టులో మరోసారి స్టెయిన్‌కు చోటు దక్కలేదు. సందీప్ శర్మ చక్కటి బౌలింగ్‌తో వార్నర్‌ను కట్టిపడేయడంతో తొలి ఓవర్ మెయిడిన్ అయింది. మరుసటి ఓవర్లో శిఖర్ ధావన్ (1)ను వెనక్కి పంపి జాన్సన్ దెబ్బ తీశాడు. అయితే కెప్టెన్ వార్నర్ జూలు విదిల్చి వరుస బౌండరీలతో చెలరేగాడు. జాన్సన్ తొలి ఓవర్లో రెండు ఫోర్లు బాదిన వార్నర్, అతని రెండో ఓవర్లో మరో రెండు ఫోర్లు, సిక్సర్‌తో 15 పరుగులు రాబట్టాడు. ఆ వెంటనే సందీప్ వేసిన తర్వాతి ఓవర్లో ఏకంగా నాలుగు ఫోర్లు కొట్టి వార్నర్ మెయిడిన్ ఓవర్‌కు ప్రతీకారం తీర్చుకున్నాడు. కానీ మూడో స్థానంలో వచ్చిన విహారి (9) అవకాశం ఉపయోగించుకోలేకపోయాడు. అనురీత్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను అదే జోరులో అవుటయ్యాడు. మరోవైపు 35 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్, మరో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ వద్ద చిక్కాడు.



నమన్ ఓజా (26 బంతుల్లో 28; 3 ఫోర్లు), హెన్రిక్స్ (32 బంతుల్లో 30; 1 ఫోర్) కలిసి నాలుగో వికెట్‌కు 45 పరుగులు జోడించినా ధాటిగా ఆడలేకపోయారు. పార్ట్ టైమ్ స్పిన్నర్ మురళీ విజయ్ కూడా పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయగలిగాడు. బొపారా (0) మరోసారి విఫలం కాగా... చివర్లో ఆశిష్ రెడ్డి (8 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) చెలరేగడంతో రైజర్స్ స్కోరు 150కు చేరింది. తొలి 10 ఓవర్లలో 76 పరుగులు చేసిన హైదరాబాద్ తర్వాతి 10 ఓవర్లలో 74 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టు ఇన్నింగ్స్‌లో కనీసం బౌండరీ లేని ఓవర్లు 9 ఉండగా...పంజాబ్ ఒక్క వైడ్ గానీ నోబాల్ గానీ వేయకపోవడం విశేషం.



సాహా మినహా...



సన్‌రైజర్స్ బౌలర్లు బౌల్ట్, భువనేశ్వర్ ఆరంభంలో అదరగొట్టడంతో పంజాబ్ తడబడింది. మూడో ఓవర్లో వోహ్రా (5)ను బౌల్ట్ బౌల్డ్ చేయగా, తర్వాతి ఓవర్లో మార్ష్ (1) స్టంప్‌ను భువీ ఎగరగొట్టాడు. ప్రవీణ్ వేసిన ఆరో ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేసిన బెయిలీ (16 బంతుల్లో 22; 3 ఫోర్లు) కొద్ది సేపటికే వెనుదిరిగాడు. మరుసటి ఓవర్లోనే రెండో పరుగు కోసం ప్రయత్నించి విజయ్ (12) రనౌట్ కాగా...కరణ్ స్పిన్ ఉచ్చులో మిల్లర్ (15) చిక్కాడు. రైజర్స్ బౌలర్లు  ఒకరితో ఒకరు పోటీ పడి మరీ పరుగులు ఇవ్వకుండా పొదుపు పాటించారు. తొలి 10 ఓవర్లలో కేవలం 5 ఫోర్లు మాత్రమే కొట్టగలిగిన పంజాబ్... ఒక దశలో వరుసగా 40 బంతుల పాటు కనీసం బౌండరీ బాదలేకపోవడం సన్ బౌలర్ల సమర్థతకు నిదర్శనం. చివర్లో అక్షర్ (17)తో కలిసి సాహా కొద్ది సేపు పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top