‘పెయినింగ్’ సూపర్ జెయింట్స్

‘పెయినింగ్’ సూపర్ జెయింట్స్


 ఏ టోర్నీలో అయినా ఏ జట్టులో అయినా ఒకరో ఇద్దరో ఆటగాళ్లు గాయపడటం సాధారణం. దాదాపుగా అన్ని జట్లూ దీనికి సన్నద్ధమయ్యే ప్రణాళికలు రచించుకుంటాయి. కానీ ఈసారి ఐపీఎల్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ మాత్రం గాయాల ‘పెయిన్’ని తట్టుకోలేకపోతోంది. అసలే అంతంతమాత్రం ప్రదర్శనతో గందరగోళంలో ఉన్న ధోని సేనకు మరో షాక్ తగిలింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ కూడా గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యాడు.

 

 

 సాక్షి క్రీడావిభాగం
ఈ ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ధోని సారథ్యంలోని కొత్త జట్టు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ అద్భుతంగా ఆడి ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. దీంతో జట్టు యాజమాన్యం సంబరపడింది. ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం ఈ జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లుగా కెవిన్ పీటర్సన్, డు ప్లెసిస్, స్టీవ్ స్మిత్, మిషెల్ మార్ష్ బరిలోకి దిగారు. అందరూ బాగా ఆడటంతో జట్టు తొలి మ్యాచ్‌లోనే బోణీ చేసింది. కానీ సగం సీజన్ అయ్యేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.



ఈ నలుగురూ గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఇప్పటికి ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ధోని సేన కేవలం రెండే విజయాలు సాధించింది. దీంతో నాకౌట్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఈ దశలో స్మిత్‌లాంటి కీలక క్రికెటర్ కూడా దూరం కావడం జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపనుంది.





 ఒకరి వెనక ఒకరు...

 ముందుగా కెవిన్ పీటర్సన్ గాయంతో పుణేకు షాక్ తగిలింది. మోకాలి కింద వెనకభాగంలో గాయం కారణంగా ఈ ఇంగ్లండ్ మాజీ స్టార్ వైదొలిగాడు. అప్పటికి అతను కేవలం నాలుగు మ్యాచ్‌లే ఆడాడు. మరో రెండు మ్యాచ్‌ల తర్వాత డు ప్లెసిస్ వేలి గాయంతో సీజన్‌కు దూరమయ్యాడు. మిషెల్ మార్ష్ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత పక్కటెముకల గాయంతో తప్పుకున్నాడు. తాజాగా స్టీవ్ స్మిత్ మణికట్టు గాయం కారణంగా స్వదేశానికి పయనమయ్యాడు.



పీటర్సన్, డు ప్లెసిస్ వైదొలిగాక ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖాజాను జట్టులోకి తీసుకున్నారు. తాజాగా ఆస్ట్రేలియాకే చెందిన జార్జ్ బెయిలీని కూడా తీసుకున్నారు. మే 5న ఢిల్లీతో మ్యాచ్ సమయానికి వీరు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇక మార్ష్, స్మిత్‌ల కోసం ప్రత్యామ్నాయాన్ని చూసుకోలేదు.





 ప్రదర్శన కూడా అంతంతే

 ఈ సీజన్ ఆరంభంలో పుణే కూడా టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటి. ధోని సారథ్యం, స్టార్ బ్యాట్స్‌మెన్ కారణంగా రేసులో ఉంది. తొలి మ్యాచ్‌లో దీనికి తగ్గట్లే ఆడినా, ఆ తర్వాత జట్టు ప్రదర్శన ఏమాత్రం ఆశాజనకంగా లేదు. బౌలర్ల అద్భుత ప్రదర్శన కారణంగా సన్‌రైజర్స్‌పై గెలిచినా... గుజరాత్, ముంబైల చేతిలో ఓడి అవకాశాలను క్లిష్టం చేసుకుంది. బాగా ఆడుతున్న స్మిత్, డు ప్లెసిస్ టోర్నీకి దూరమవడం, రహానే మినహా మరో బ్యాట్స్‌మన్ ఫామ్‌లో లేకపోవడం ఈ జట్టును తీవ్ర ఆందోళనలో పడేసింది.



ఇక బౌలింగ్‌లోనూ ఈ జట్టు దారుణంగా విఫలమయింది. ఆర్పీ సింగ్, ఇషాంత్ శర్మ, అశోక్ దిండా ముగ్గురూ పెద్దగా ఆకట్టుకోలేకపోగా... ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటివరకూ దారుణంగా నిరాశపరిచాడు. గత నాలుగేళ్లుగా అన్ని రకాల ఫార్మాట్‌లలో, ఏ జట్టు తరఫున ఆడినా ధోనికి ప్రధాన అస్త్రంగా ఉన్న అశ్విన్... ఈసారి పూర్తి కోటా ఓవర్లు కూడా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. అసలే ఫామ్‌లో లేని ఆటగాళ్లతో తంటాలుపడుతున్న ధోని... ఫామ్‌లో ఉన్న ఆటగాళ్ల గాయాలతో మరింత ఇబ్బందుల్లో పడ్డాడు. ఇక ఈ సీజన్‌లో మళ్లీ పుణే పుంజుకుంటుందా అనేది సందేహమే. ప్రతిసారీ ఏదో ఒక ‘మాయ’ చేసే ధోని ఈ సీజన్‌లో ఏం చేస్తాడనేది ఆసక్తికరం.

 

 

 షాన్ మార్ష్ కూడా...


 పుణేతో పాటు ఇతర జట్లను కూడా గాయాలు బాధపెడుతూనే ఉన్నాయి. తాజాగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఆటగాడు షాన్‌మార్ష్ కూడా వెన్నునొప్పితో సీజన్‌కు దూరమయ్యాడు. ఆరు మ్యాచ్‌లాడిన తను పంజాబ్ తరఫున అత్యధికంగా 159 పరుగులు సాధించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top