శ్రీలంకను కూల్చేశారు!

శ్రీలంకను కూల్చేశారు! - Sakshi


విశాఖ: మూడు ట్వంటీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ డా. వైఎస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆదివారం టీమిండియాతో జరుగుతున్న చివరి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక విలవిల్లాడింది. భారత బౌలింగ్ ను ఎదుర్కొలేక 18.0 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది.  టాస్ ఓడి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. ప్రత్యర్థి శ్రీలంకను ఏదశలోనూ కోలుకోనీయకుండా చేసి పైచేయి సాధించింది. తొలి ఓవర్ లోనే రవి చంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీసి లంకేయులు షాకిచ్చాడు. దీంతో తీవ్ర ఒత్తిడిలో పడిన శ్రీలంక సగం ఓవర్లు అవ్వకుండానే సగం వికెట్లను నష్టపోయింది. లంకేయులు 21 పరుగులకే ఐదు వికెట్లను నష్టపోగా, మరో 61 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఐదు వికెట్లను చేజార్చుకున్నారు. శ్రీలంక ఆటగాళ్లలో డిక్ వెల్(1), దిల్షాన్(1), చండిమాల్(8), గుణరత్నే(4), సిరివర్ధనే(4),షనాకా(19), ప్రసన్నా(9),పెరీరా(12),సేననాయకే(8),ఫెర్రాండో(1)లు వరుసగా పెవిలియన్ కు చేరి నిరాశపరిచారు.భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు సాధించగా, రైనా రెండు వికెట్లు,నెహ్రా, జడేజా, బూమ్రాలకు తలో ఒక వికెట్ దక్కింది.





తొలి నాలుగు వికెట్లు అశ్విన్కే



టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తనకు అత్యంత నమ్మకస్తుడైన అశ్విన్ కు తొలి ఓవర్ ను అప్పగించాడు. దీంతో బంతిని అందుకున్న అశ్విన్ మొదటి నుంచే లంకపై ఆధిక్యం ప్రదర్శించాడు. సాధారణంగా స్పిన్ ను బాగా ఆడే లంకేయులు మాత్రం అశ్విన్ బౌలింగ్ ఎదుర్కొవడానికి నానా తంటాలు పడ్డారు.  తొలి ఓవర్ మూడో బంతికి డిక్ వెల్ ను పెవిలియన్ కు పంపిన అశ్విన్.. చివరి బంతికి దిల్షాన్ ఎల్బీడబ్యూగా అవుట్ చేశాడు. దీంతో లంక మూడు పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. ఆ తరువాత మూడో ఓవర్ మొదటి బంతికి చండిమాల్ను, ఐదో ఓవర్ రెండో బంతికి గుణరత్నేను అశ్విన్ అవుట్ చేశాడు. దీంతో శ్రీలంక 20 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక ఆ తరువాత తేరుకోని శ్రీలంక స్వల్ప వ్యవధిలో వికెట్లను చేజార్చుకుని భారత్ కు 83 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.


 


మ్యాచ్ విశేషాలు..



ఇదే టీ 20ల్లో శ్రీలంకకు అత్యల్ప స్కోరు. అంతకుముందు 2010లో ఆస్ట్రేలియాపై వరల్డ్ టీ 20లో లంకేయులు 87 పరుగులు నమోదు చేశారు.



శ్రీలంక తొలి 10 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోవడం ఇది రెండోసారి. 2007 వరల్డ్ టీ 20లో ఆసీస్పై శ్రీలంక మొదటి పది ఓవర్లలో ఆరు వికెట్లను చేజార్చుకుంది.



ఒక ఇన్నింగ్స్ తొలి ఆరు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసిన రెండో స్పిన్నర్ అశ్విన్.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top