ధోని సేనకు షాక్

ధోని సేనకు షాక్ - Sakshi


పుణె: అంతా కొత్త కుర్రాళ్లు..అనుభవం తక్కువ అన్నారు. టీమిండియా ముందు తేలిపోతారనుకున్నారు. ఇది తొలి ట్వంటీ 20కి ముందు శ్రీలంక గురించి అనుకున్న మాట. కానీ సింహళీయులు సింహనాదం చేశారు. తొలుత పటిష్టమైన భారత్ బ్యాటింగ్ ను పేకపేడలా కూల్చేసి పైచేయి సాధించిన లంకేయులు.. ఆ తరువాత ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకున్నారు. సీనియర్ ఆటగాళ్ల లేకపోయినా సమష్టిగా పోరాడి ధోని సేనకు షాకిచ్చారు.  దీంతో మూడు టీ 20ల సిరీస్లో శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది.



భారత్ విసిరిన 102 పరుగుల లక్ష్యాన్ని 18.0 ఓవర్లలో సాధించిన శ్రీలంక... సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది. శ్రీలంక ఆదిలో డెక్ విల్లా(4), గుణతిలకా(9)వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. కాగా, కెప్టెన్ చండిమాల్ (35), కపుగదరె(25) మోస్తరుగా రాణించడంతో లంక గాడిలో పడింది. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుటైనా.. లక్ష్యం పెద్దదిగా లేకపోవడంతో సిరివర్దనే(21 నాటౌట్) జట్టును విజయతీర్చాలకు చేర్చాడు. భారత బౌలర్లలో ఆశిష్ నెహ్రా, అశ్విన్ లకు తలో రెండు వికెట్లు లభించగా, రైనాకు ఒక వికెట్ దక్కింది.





 టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ధోని సేన వరుస వికెట్లను కోల్పోయి 101 పరుగుల స్కోరును మాత్రమే నమోదు చేసింది. భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ(0), శిఖర్ ధావన్(9), అజింక్యా రహానే(4), సురేష్ రైనా(20), యువరాజ్ సింగ్(10), మహేంద్ర సింగ్ ధోని(2), హార్దిక్ పాండ్యా(2),  రవీంద్ర జడేజా(6)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఏ ఒక్క ఆటగాడు క్రీజ్ లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించకుండానే క్యూకట్టారు.

 

తొలి ఓవర్ లోనే రెండు వికెట్లను కోల్పోయిన భారత్.. ఐదో ఓవర్ చివరి బంతికి మూడో వికెట్ ను నష్టపోయింది. తరువాత తొమ్మిదో ఓవర్ రెండు బంతికి నాల్గో వికెట్,  తొమ్మిదో ఓవర్ ఐదో బంతికి ఐదో వికెట్ ను టీమిండియా నష్టపోయి కష్టాల్లో పడింది. ఓ దశలో 58 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన భారత్ ను అశ్విన్(31 నాటౌట్) ఆదుకున్నాడు. చివరి వరుస ఆటగాళ్లతో కలిసి స్కోరు బోర్డును ముందుకు కదిలించడంతో టీమిండియా వంద పరుగులను దాటకల్గింది. .శ్రీలంక బౌలర్లలో కాశున్ రజితా, షనాకా తలో మూడు వికెట్లు సాధించగా,చమీరాకు రెండు, సేననాయకేకు ఒక వికెట్ దక్కింది.



మ్యాచ్ విశేషాలు..





*ట్వంటీ20ల్లో పది ఓవర్లలో ఆరు వికెట్లను చేజార్చుకోవడం భారత్ కు ఇది మూడోసారి. అంతకుముందు 2008-09 న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో, ఆ తరువాత 2010లో బ్రిడ్జిటౌన్లో ఆసీస్ తో మ్యాచ్ లో భారత్ 10 ఓవర్లలో ఆరు వికెట్లను నష్టపోయింది.







*శ్రీలంక బౌలర్లలో కాసున్ రజితా, దాసున్ షనకాలు టీ20 కెరీర్ లో తమ తొలి ఓవర్ లో రెండేసి వికెట్లు తీయడం ఇదే తొలిసారి.





*టీ20ల్లో ఇది సురేష్ రైనాకు 50వ మ్యాచ్ కాగా, ధోనికి 56వ మ్యాచ్



*తొలి ఓవర్ లో రెండు వికెట్లను కోల్పోవడం భారత్ టీ20 చరిత్రలో ఇదే మొదటిసారి



* ఇది టీ 20ల్లో భారత్ మూడో అత్యల్ప స్కోరు. అంతకుముందు ఆస్ట్రేలియాపై 74, దక్షిణాఫ్రికాపై 92 పరుగులు అత్యల్ప స్కోర్లు నమోదు చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top