శ్రీలంక 3.. ఇంగ్లండ్ 3


వెల్లింగ్టన్: ప్రపంచ కప్లో శ్రీలంక విజయం, ఇంగ్లండ్ పరాజయం కొనసాగుతోంది. లంక మూడో విజయం నమోదు చేసి నాకౌట్ దశకు చేరువకాగా, ఇంగ్లండ్ మూడో ఓటమి మూటగట్టుకుని నాకౌట్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రపంచ కప్ గ్రూప్-ఎలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో లంకేయులు 9 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ మెన్ను చిత్తు చేశారు. లంక ఆటగాళ్లు తిరుమన్నె, సంగక్కర సెంచరీలతో చెలరేగి జట్టుకు విజయాన్నందించారు. 310 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లంక కేవలం వికెట్ కోల్పోయి మరో 16 బంతులు మిగిలుండగా విజయతీరాలకు చేరింది. వన్డేల్లో సంగా 23వ, తిరుమన్నె 3వ సెంచరీలు నమోదు చేశారు. దిల్షాన్ (44) రాణించాడు. తిరుమన్నె, దిల్షాన్ 100 పరుగుల శుభారంభం అందించి విజయానికి బాటలు వేశారు. ఆ తర్వాత తిరుమన్నె, సంగా రెండో వికెట్కు అజేయంగా 212 పరుగులు జోడించి విజయాన్ని పరిపూర్ణం చేశారు. ఇంగ్లండ్ బౌలర్లు దారుణంగా విఫలమవగా, ఫీల్డర్లు చెత్త ఫీల్డింగ్తో లంక విజయానికి దోహదపడ్డారు. సంగక్కరకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.



రూట్ సెంచరీ వృథా: అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్  నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 309 పరుగులు చేసింది. రూట్ (121) సెంచరీతో రాణించాడు. ఇయాన్ బెల్ (49) పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. చివర్లో బట్లర్ (39 నాటౌట్) వేగంగా పరుగులు రాబట్టాడు. లంక బౌలర్లు మలింగ, మాథ్యూస్, దిల్షాన్, హెరాత్, పెరెరా, లక్మల్ తలా వికెట్ తీశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top