క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌

క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌


నంబర్‌వన్‌పై మళ్లీ విజయం

ఆస్ట్రేలియా ఓపెన్‌ టోర్నీ




సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. హైదరాబాద్‌ ప్లేయర్లంతా క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సైనా నెహ్వాల్, ప్రపంచ మూడో ర్యాంకర్‌ పీవీ సింధు గెలుపొందారు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ మళ్లీ నంబర్‌వన్‌ ఆటగాడు సన్‌ వాన్‌ హోను కంగుతినిపించాడు. సాయిప్రణీత్‌ కూడా ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో విజయం సాధించాడు. అయితే మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి జంటకు, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ షెట్టి జోడీకి చుక్కెదురైంది. క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌తో సాయిప్రణీత్‌ తలపడతాడు.



శ్రీకాంత్‌ జోరు: ఐదు రోజుల వ్యవధిలో శ్రీకాంత్‌ సంచలన విజయాన్ని మళ్లీ రిపీట్‌ చేశాడు. దక్షిణ కొరియాకు చెందిన టాప్‌ సీడ్‌ సన్‌ వాన్‌ హోను మరోసారి చిత్తుచేశాడు. ఇటీవలే ముగిసిన ఇండోనేసియా ఓపెన్‌లో భారత స్టార్‌ ధాటికి అతను సెమీస్‌లో ఇంటిదారి పడితే... ఈ సారి అనూహ్యంగా ప్రిక్వార్టర్స్‌లోనే చేతులెత్తేయడం విశేషం. 57 నిమిషాల పాటు సాగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ 15–21, 21–13, 21–13తో నంబర్‌వన్‌ సన్‌ వాన్‌ హోను చిత్తుగా ఓడించాడు. తొలి గేమ్‌ను కోల్పోయిన హైదరాబాదీ సంచలనం తర్వాతి రెండు గేమ్‌లలో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో  సాయి ప్రణీత్‌ 21–15, 18–21, 21–13తో చైనా ఆటగాడు హుయంగ్‌ యుగ్జియంగ్‌పై గెలుపొందాడు.



సింధు అలవోకగా...

మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్, ఐదో సీడ్‌ సింధు  21–13, 21–18తో చెన్‌ జియావోజిన్‌ (చైనా)పై అలవోక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సింధు అద్భుతంగా ఆడింది. 46 నిమిషా ల్లోనే వరుస గేముల్లో చైనా గోడను దాటింది. డిఫెం డింగ్‌ చాంపియన్‌ సైనా 21–15, 20–22, 21–14తో సోనియా చెహ్‌ (మలేసియా)పై నెగ్గింది. మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో అశ్విని–సిక్కిరెడ్డి జోడి 21–18, 18–21, 13–21తో షిహో తనక– కొహరు యొనెమొటో (జపాన్‌) చేతిలో ఓడింది. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 16–21, 18–21తో చెన్‌ హంగ్‌ లింగ్‌– వాంగ్‌ చిన్‌ లిన్‌ (చైనీస్‌ తైపీ) జంట చేతిలో పరాజయం చవిచూసింది.



11వ ర్యాంకులో శ్రీకాంత్‌

భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌ ర్యాంకు మెరుగైంది. ఇండోనేసియా ఓపెన్‌ టైటిల్‌ విజయంతో అతను తాజా బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 11 స్థానాల్ని మెరుగుపర్చుకుని 11వ ర్యాంకుకు ఎగబాకాడు. అదే టోర్నీలోఆకట్టుకున్న ప్రణయ్‌ నాలుగు స్థానాల్ని మెరుగుపర్చుకొని 21వ ర్యాంకుకు చేరాడు. అజయ్‌ జయరామ్‌ (15), సాయిప్రణీత్‌ (16) ఒక్కో స్థానాన్ని కోల్పోయారు. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ 15 నుంచి 16వ ర్యాంకుకు, పీవీ సింధు మూడు నుంచి 4వ ర్యాంకుకు దిగజారారు.



నేటి క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు

ఉదయం 11.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్షప్రసారం

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top