తొలి వన్డే భారత్‌దే

తొలి వన్డే భారత్‌దే


 17 పరుగులతో న్యూజిలాండ్‌పై గెలుపు

  రాణించిన జులన్ గోస్వామి    కల్పన అరంగేట్రం

 

 బెంగళూరు: బౌలింగ్‌లో పరాక్రమం చూపెట్టిన భారత మహిళల జట్టు... తొలి వన్డేలో పటిష్టమైన న్యూజిలాండ్‌ను అద్భుతంగా కట్టడి చేసింది. సమష్టి నైపుణ్యంతో తక్కువ స్కోరును కాపాడుకుంది. బ్యాటింగ్‌లో జులన్ గోస్వామి (67 బంతుల్లో 57; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో చెలరేగడం... బౌలింగ్‌లో స్నేహ రాణా (3/26), ఏక్తా బిస్త్ (2/18), హర్మన్‌ప్రీత్ కౌర్ (2/16) రాణించడంతో... ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ 17 పరుగుల ఆధిక్యంతో కివీస్‌పై విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, వికెట్ కీపర్ రావి కల్పన అరంగేట్రం చేసింది.

 

 చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 44.3 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలింగ్ ధాటికి టాప్ ఆర్డర్ మొత్తం విఫలమైంది. 52 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన జులన్ కీలక ఇన్నింగ్స్ ఆడింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (17), ఏక్తా బిస్త్ (12), స్మృతి మందన (13) ఓ మాదిరిగా ఆడారు. కివీస్ జట్టులో తాహు, నీల్సెన్, కాస్పెరెక్ తలా మూడు వికెట్లు తీశారు. తర్వాత న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. బేట్స్ (28) టాప్ స్కోరర్. డివైన్ (24), కాస్పెరెక్ (21 నాటౌట్) మినహా మిగతా వారు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. రెండో వన్డే బుధవారం (జులై 1) జరుగుతుంది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top