‘సౌత్’ సమరం!


నేడు ఐపీఎల్ క్వాలిఫయర్-2

వరుస విజయాల జోరులో కోహ్లి సేన

రికార్డుపై నమ్మకంతో ధోని బృందం


 

 ఐపీఎల్ తొలి ఏడు సీజన్లలో గతేడాది మినహా ప్రతిసారీ కనీసం ఒక్క దక్షిణాది జట్టయినా ఫైనల్‌కు చేరింది. గత ఏడాది మాత్రం పంజాబ్, కోల్‌కతా తుది సమరానికి చేరాయి. ఈసారి కూడా సౌత్ జట్టు ఫైనల్‌కు చేరడం ఖాయం. నేడు చెన్నై, బెంగళూరు జట్ల మధ్య జరిగే క్వాలిఫయర్-2 విజేత... ఆదివారం ముంబైతో ఫైనల్లో తలపడుతుంది. వరుస విజయాలతో రాయల్ చాలెంజర్స్ మంచి జోరు మీదుంటే... లీగ్ దశలో బెంగళూరుపై రెండు మ్యాచ్‌లూ గెలిచిన సూపర్‌కింగ్స్ ఆత్మవిశ్వాసంతో ఉంది. మరి మిగిలేదెవరో?

 

 రాంచీ : భారత వన్డే జట్టు కెప్టెన్ ధోని, టెస్టు జట్టు కెప్టెన్ కోహ్లిల సారథ్యానికి పరీక్షగా అభివర్ణిస్తున్న ఐపీఎల్ రెండో క్వాలిఫయర్‌కు రంగం సిద్ధమైంది. జేఎస్‌సీఏ స్టేడియంలో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన చెన్నై... తొలి క్వాలిఫయర్‌లో ముంబై చేతిలో ఓడింది. మూడో స్థానంలో నిలిచిన బెంగళూరు ఎలిమినేటర్‌లో రాజస్తాన్‌ను చిత్తు చేసింది. అలాగే లీగ్ దశలో రెండు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో చెన్నై 27, 24 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ప్రస్తుతం బెంగళూరు జట్టు సూపర్ ఫామ్‌లో ఉంది. ధోని స్వస్థలం రాంచీలో ఈ మ్యాచ్ జరుగుతున్నందున చెన్నై జట్టుకు అభిమానుల నుంచి భారీగా మద్దతు లభించడం ఖాయం.



 మంచి ఆరంభం కావాలి

 లీగ్ దశలో సంచలన ఇన్నింగ్స్ ఆడిన మెకల్లమ్ వెళ్లిపోయిన లోటు చెన్నైకి అప్పుడే తెలిసొచ్చింది. తన స్థానంలో వచ్చిన వెటరన్ హస్సీ గత మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అయితే తన అనుభవాన్ని ఉపయోగించి డ్వేన్ స్మిత్‌తో కలిసి హస్సీ ఇచ్చే ఆరంభం చాలా కీలకం. అలాగే రైనా కూడా స్థాయికి తగ్గట్టుగా ఆడటం లేదు.



డు ప్లెసిస్ ఫామ్‌లోనే ఉన్నా... ధోని, జడేజా బ్యాటింగ్‌లో నిరాశపరుస్తున్నారు. నిజానికి చెన్నైలోని ఆటగాళ్లంతా తమ స్థాయికి తగ్గట్లుగా రాణిస్తే బెంగళూరు కంటే బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇక బౌలింగ్‌లో నెహ్రా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన డ్వేన్ బ్రేవో స్లాగ్ ఓవర్లలో ఎలాంటి ప్రత్యర్థినైనా కట్టడి చేయగల దిట్ట. గేల్, కోహ్లి, డి విలియర్స్ లాంటి బలమైన బ్యాటింగ్ లైనప్‌ను నియంత్రించాలి కాబట్టి అశ్విన్‌కు ధోని కొత్త బంతి ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఫామ్‌లో ఉన్న బెంగళూరు త్రయాన్ని నియంత్రించడానికి ధోని ఏదైనా మ్యాజిక్ చేయకపోతే మ్యాచ్‌లో నెగ్గడం కష్టం.



 టైటిల్ మీద గురితో...

 బెంగళూరు జట్టు ఈ సీజన్‌లో చాలావరకు నిలకడగా ఆడింది. దీనికి కారణం టాప్-3లో కనీసం ఇద్దరు ఆటగాళ్లు ఏదో ఒక ఇద్దరు ప్రతి మ్యాచ్‌లోనూ రాణిస్తున్నారు. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించగల గేల్, కోహ్లి, డి విలియర్స్ ముగ్గురూ సూపర్ ఫామ్‌లో ఉండటం ఈ జట్టుకు పెద్ద సానుకూలాంశం. ఇక యువ సంచలనం మన్‌దీప్ సింగ్ కూడా బాగా ఆడుతున్నాడు. దినేశ్ కార్తీక్ ఒక్కడే ఈ లైనప్‌లో ఫామ్‌లోలేని క్రికెటర్. ఇక కుర్రాడు సర్ఫరాజ్ కూడా తనకు లభించిన చిన్న చిన్న అవకాశాలను ఉపయోగించుకుంటున్నాడు.



అయితే బ్యాటింగ్‌తో పాటు బెంగళూరు బౌలింగ్ కూడా సమతూకంతో ఉంది. స్టార్క్ నేతృత్వంలో శ్రీనాథ్ అరవింద్, వీస్, హర్షల్ పటేల్ అద్భుతాలు చేస్తున్నారు. ఇక లెగ్ స్పిన్నర్ చాహల్ ఒక్కడే స్పిన్ బాధ్యత మోస్తూ అవసరమైన సమయంలో వికెట్లతో జట్టును ఆదుకుంటున్నాడు. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవని బెంగళూరు ప్రస్తుతం ఉన్న ఫామ్‌తో ఈసారి గెలవగలమనే నమ్మకంతో ఉంది. ఆ కోరిక తీరాలంటే ముందు చెన్నై సవాల్‌ని అధిగమించాలి.

 జట్లు (అంచనా)

 చెన్నై సూపర్ కింగ్స్

 ధోని (కెప్టెన్), డ్వేన్ స్మిత్, మైక్ హస్సీ, రైనా, డు ప్లెసిస్, జడేజా, డ్వేన్ బ్రేవో, పవన్ నేగి, అశ్విన్, నెహ్రా, మోహిత్ శర్మ.

 బెంగళూరు రాయల్ చాలెంజర్స్

 కోహ్లి (కెప్టెన్), గేల్, డి విలియర్స్, మన్‌దీప్, దినేశ్ కార్తీక్, సర్ఫరాజ్, వీస్, స్టార్క్, శ్రీనాథ్ అరవింద్, చాహల్, హర్షల్.

 

 5 ఐపీఎల్ లో చెన్నై మరే జట్టుకు సాధ్యం కాని విధంగా ఇప్పటికే ఐదుసార్లు (2008, 2010, 2011, 2012, 2013) ఫైనల్ ఆడింది. ఇందులో రెండు సార్లు టైటిల్ గెలిచింది.

 

 2 బెంగళూరు గతంలో రెండు సార్లు (2009, 2011) ఫైనల్‌కు చేరింది. ఈ రెండు సార్లు రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.

 

 ‘చెన్నైతో మ్యాచ్ పెద్ద సవాల్. ఆ జట్టు బలమైంది. వారిని ఓడించటం అంత సులువు కాదు. ఈ మ్యాచ్‌లో గెలవడమే కాదు, తర్వాత టైటిల్ కూడా అందుకోవాలనేదే మా లక్ష్యం. ప్రస్తుతం రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌పైనే దృష్టి పెట్టాం’

 - డివిలియర్స్, బెంగళూరు బ్యాట్స్‌మన్

 

 ‘ఈ దశలో మా ఆటగాళ్లు బాగా అలసిపోయి ఉన్నారు. అయితే విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేదు. గత మ్యాచ్ ఓడినా మరోసారి మా సత్తా చాటే అవకాశం ఉండటం అదృష్టం. రాంచీలో మ్యాచ్ ఫలితం మాకు అనుకూలంగా ఉంటుందనే ఆశిస్తున్నా’

 - ఫ్లెమింగ్, చెన్నై కోచ్

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top