కరీబియన్లను కుమ్మేసి.. కూల్చేశారు


సిడ్నీ: ఇటీవల భారత్ చేతిలో దక్షిణాఫ్రికాకు ఘోరపరాభవం ఎదురైతే.. జింబాబ్వేపై వెస్టిండీస్ రికార్డుల మోత మోగించి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు అవే దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తలపడగా వాటి రాత తారుమారైంది.  సఫారీలు కరీబియన్లను చిత్తుచిత్తుగా ఓడించారు. ప్రపంచ కప్ గ్రూప్-బిలో భాగంగా శుక్రవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 257 పరుగుల భారీ తేడాతో విండీస్పై ఘనవిజయం సాధించింది.  409 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కరీబియన్లు 33.1 ఓవర్లలో 151 పరుగులకు చాపచుట్టేశారు.  విండీస్ కెప్టెన్ హోల్డర్ (56) హాఫ్ సెంచరీ చేయడం మినహా ఇతర బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. రెండో ఓవర్లో క్రిస్ గేల్ (3)  ఓటమితో విండీస్ పతనం ఆరంభమైంది. అబాట్ వరుస ఓవర్లలో గేల్, శామ్యూల్స్ను అవుట్ చేయడంతో విండీస్కు కష్టాలు ఆరంభమయ్యాయి. ఇక దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (5 వికెట్లు) విండీస్ బ్యాటింగ్ లైనప్ను పేకమేడలా కూల్చేశాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సఫారీలు  నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 408  పరుగులు చేసింది. డివిల్లీర్స్ (66 బంతుల్లో 17 ఫోర్లు, 8 సిక్సర్లతో 162 నాటౌట్) మెరుపు సెంచరీతో రెచ్చిపోగా, ఆమ్లా (65), డుప్లెసిస్ (62), రోసౌ (61) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వన్డేల్లో డివిల్లీర్స్ కిది 20వ సెంచరీ. గేల్, రసెల్ రెండేసి వికెట్లు తీశారు. సఫారీల ఇన్నింగ్స్ జడివానతో మొదలై భారీ వర్షంగా మారి చివరకు వరదలా తీవ్రరూపం దాల్చి  కరీబియన్లను ముంచెత్తింది. డివిల్లీర్స్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.





మెరిసిన గేల్: సఫారీలకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డికాక్ 12 పరుగులకే అవుటయ్యాడు. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద హోల్డర్ బౌలింగ్లో క్యాచవుటయ్యాడు.  ఆ తర్వాత ఆమ్లా, డుప్లెసిస్ ఆచితూచి ఆడారు. దీంతో 15 ఓవర్లలో సౌతాఫ్రికా 56/1 స్కోరు మాత్రమే చేసింది. ఆ తర్వాత దూకుడు పెంచారు. ఆమ్లా, డుప్లెసిస్ రెండో వికెట్కు 127 పరుగులు జోడించారు. 29 ఓవర్లలో సఫారీలు వికెట్ నష్టానికి 145 పరుగులు చేశారు. ఈ దశలో  వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్మన్ క్రిస్ గేల్ బంతితో మెరిశాడు. గేల్ ఒకే ఓవర్లో ఆమ్లా, డుప్లెసిస్ జోడీని పెవిలియన్ చేర్చాడు. గేల్ బౌలింగ్లో డుప్లెసిస్ క్యాచ్ అవుటవగా, ఆమ్లా వికెట్ల ముందు దొరికిపోయాడు.



డివిల్లీర్స్ మెరుపులు: 30 ఓవర్లలో దక్షిణాఫ్రికా స్కోరు 147/3. ఆమ్లా, డుప్లెసిస్ జోడీని పరుగు తేడాతో పెవిలియన్ చేర్చామన్న సంతోషం విండీస్ శిబిరంలో ఎక్కువసేపు ఉండలేదు సరికదా ఆందోళన మొదలైంది. డివిల్లీర్స్, రోసౌ వచ్చీరావడంతోనే విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరద్దరూ పరస్పరం పోటీపడుతూ ఫోర్లు, సిక్సర్లు బాదారు. దీంతో స్కోరు అమాంతం పెరుగుతూపోయింది. ఈ క్రమంలో రోసౌ 31 బంతుల్లో, డివిల్లీర్స్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేశారు. 40 ఓవర్లయ్యేసరికి స్కోరు 258/3కు చేరుకుంది. కాసేపటికి రోసౌ అవుటయినా డివిల్లీర్స్ మెరుపు ఇన్నింగ్స్తో రెచ్చిపోయాడు. 52 బంతుల్లో సెంచరీ.. 64 బంతుల్లో 150 పరుగులు చేశాడు. డివిల్లీర్స్కు కాసేపు మిల్లర్, బెహర్డియెన్ అండగా నిలిచారు.



3 ఓవర్లలో 78: చివరి 3 ఓవర్లలో డివిల్లీర్స్ ఆకాశమే హద్దుగా విజృంభించాడు. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ 48వ ఓవర్లో డివిల్లీర్స్ 4, 6, 2, 4, 4, 4 2, 6 బాదాడు. హోల్డర్ రెండు నోబాల్స్ వేశాడు. ఈ ఓవర్లో ఏకంగా 34 పరుగులు వచ్చాయి. ఆ తర్వాతి ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. హోల్డర్ వేసిన చివరి ఓవర్లో డివిల్లీర్స్ వరుసగా 2, 6, 6, 4, 6, 6తో అలరించాడు. ఈ ఓవర్లో 30 పరుగులు వచ్చాయి. దీంతో దక్షిణాఫ్రికా స్కోరు 400 మార్క్ దాటింది.


విండీస్ విలవిల..

సఫారీలు నిర్దేశించిన 409 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కరీబియన్లు ఆది నుంచి తడబడ్డారు. కెప్టెన్ హోల్డర్ (56)  ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు.



కార్టర్ (10), స్మిత్ (31), రామ్దిన్ (22)  టేలర్ (15 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.

క్రిస్ గేల్ (3), సామీ (5), శామ్యూల్స్ (0),  సిమ్మన్స్ (0), రస్సెల్ (0), బెన్ (1) ఇలా వచ్చి అలా వెళ్లారు.



మొత్తం మీద సఫారీ బౌలర్ల దెబ్బకు విండీస్ బ్యాట్స్ మెన్ పెవిలియన్కు నువ్వు ముందా ? నేను ముందా ? అన్నట్టుగా క్యూ కట్టారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top