సేమ్ టూ సేమ్.. విండీస్‌లాగే ఐర్లాండ్నూ..
కాన్ బెర్రా: సేమ్ టూ సేమ్. దక్షిణాఫ్రికా.. వెస్టిండీస్‌తో మ్యాచ్ మాదిరి ఐర్లాండ్‌ను ఓడించింది. మొన్నటికి మొన్న కరీబియన్లపై 400 పైచిలుకు పరుగులు పండగ చేసుకున్న సఫారీలు.. తాజాగా ఐర్లాండ్‌పైనా 400 మార్క్ దాటించారు. ఆ తర్వాత విండీస్‌ను కూల్చినట్టే ఐర్లాండ్నూ అదే పనిచేశారు. ప్రపంచ కప్‌లో సంచలన శుభారంభంతో రెండు విజయాలు సాధించిన ఐర్లాండ్‌కు తొలి ఓటమి ఎదురైంది. మంగళవారం ఏకపక్షంగా జరిగిన ప్రపంచ కప్ గ్రూప్-బి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 201 పరుగులతో ఐర్లాండ్‌పై గెలుపొందింది. 412 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఐర్లాండ్ 45 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బౌలర్లు అబాట్, స్టెయిన్ ఐర్లాండ్‌ను చావుదెబ్బ తీశారు. అబాట్ 4, స్టెయిన్ 2 వికెట్లు తీశారు. ఐర్లాండ్ ఆరంభంలోనే 48 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో దాపుగా ఓటమి ఖాయమైంది. బాల్బిర్నె(58), కెవిన్ ఒబ్రెయిన్ (48) మినహా ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఐర్లాండ్ ఓటమి కాస్త ఆలస్యమైంది. విండీస్‌తో పోలిస్తే ఐర్లాండే కాస్త గట్టిపోటీనిచ్చింది. 48/5తో పీకల్లోతు కష్టాల్లోపడ్డ ఐర్లాండ్ భీకరమైన సఫారీ బౌలర్లను ఎదుర్కొని నుంచి 200 పరుగుల మార్క్ దాటించడం విశేషం. ఆమ్లాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఆమ్లా, డుప్లెసిస్ శతకాల మోత: హషిమ్ ఆమ్లా, డుప్లెసిస్ శతకాలకు తోడు రోసో, మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్ జతకావడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 411 పరుగులు చేసింది. 12 పరుగులకే తొలి వికెట్ నష్టపోయిన సఫారీ టీమ్ ను ఆమ్లా, డుప్లెసిస్ శతకాలతో భారీ స్కోరు బాట పట్టించారు. సౌతాఫ్రికా జట్టు తరపున ప్రపంచకప్ లో రెండో వికెట్ కు వీరిద్దరూ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. డుప్లెసిస్ 109 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ తో 109 పరుగులు చేశాడు. ఆమ్లా 128 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లతో 159 పరుగులు చేశాడు. చివర్లో రోసో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 30 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేశారు. మిల్లర్(46, 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అతడికి తోడుగా నిలిచాడు.