దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్

దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్


జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్

బులవాయో: జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. గురువారం క్వీన్‌స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన చివరిదైన మూడో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో సఫారీ జట్టు ఘనవిజయం సాధించింది. ఓపెనర్ డి కాక్ (75 బంతుల్లో 84; 7 ఫోర్లు; 2 సిక్సర్లు) దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో మరోసారి కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 39.5 ఓవర్లలో 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ చిగుంబురా (122 బంతుల్లో 90; 10 ఫోర్లు; 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు.



15 పరుగుల వ్యవధిలోనే ఐదు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే కోలుకోలేకపోయింది. చివరి బ్యాట్స్‌మన్ పన్యాంగరా (0 నాటౌట్)ను అండగా చేసుకుని చిగుంబురా 34 బంతుల్లో 46 పరుగులు సాధించి తుది వికెట్‌గా అవుటయ్యాడు. డి లాంజ్‌కు మూడు వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ 27.2 ఓవర్లలో మూడు వికెట్లకు 171 పరుగులు చేసి నెగ్గింది. డి కాక్ మెరుపులకు డుప్లెసిస్ (33 బంతుల్లో 40; 8 ఫోర్లు) తోడవడంతో మ్యాచ్ తొందరగా పూర్తయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు సిరీస్ కూడా డి కాక్‌కు దక్కింది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top