‘సిల్వర్' సౌరవ్

‘సిల్వర్' సౌరవ్


కుదిరితే కనకం సాధిస్తానని ఆసియా క్రీడలకు ముందు వ్యాఖ్యానించిన భారత స్క్వాష్ స్టార్ సౌరవ్ ఘోషాల్ తుది మెట్టుపై తడబడ్డాడు. విజయం అంచుల నుంచి ఓటమి బాటలో పయనించాడు. అంతిమ ఫలితం నిరాశ కలిగించినా... ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో రజతం నెగ్గిన తొలి భారతీయ స్క్వాష్ క్రీడాకారుడిగా కొత్త చరిత్ర లిఖించాడు.

 

 ఇంచియాన్: అంతిమ సమరంలో అదరగొట్టి భారత శిబిరంలో పసిడి కాంతులు విరజిమ్ముతాడని ఆశించిన భారత స్క్వాష్ స్టార్ సౌరవ్ ఘోషాల్ రజత పతకంతో సంతృప్తి పడ్డాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్‌సీడ్, ప్రపంచ 16వ ర్యాంకర్ సౌరవ్ 12-10, 11-2, 12-14, 8-11, 9-11తో ప్రపంచ 46వ ర్యాంకర్ అబ్దుల్లా అల్ ముజాయిన్ (కువైట్) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఈ పరాజయంతో రెండో స్థానంలో నిలిచిన సౌరవ్ సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆసియా క్రీడల స్క్వాష్ పోటీల్లో భారత్‌కు రజతం దక్కడం ఇదే తొలిసారి. 87 నిమిషాల పాటు జరిగిన ఫైనల్లో ఆరంభంలో అదరగొట్టిన సౌరవ్ వరుసగా రెండు గేమ్‌లను నెగ్గి విజయం దిశగా పయనించాడు. 21 నిమిషాల పాటు జరిగిన తొలి గేమ్‌లో సౌరవ్ కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు. బ్యాక్‌లైన్ నుంచి అద్భుతమైన ర్యాలీలను సంధిం చాడు. అయితే అబ్దుల్లా కాస్త పోరాడే ప్రయత్నం చేసినా బ్యాక్‌లైన్ తప్పిదాలతో వెనుకబడిపోయాడు. కేవలం 6 నిమిషాలు జరిగిన రెండో గేమ్‌లో సౌరవ్ దూకుడుకు ఎదురే లేకుండా పోయింది.

 మ్యాచ్ పాయింట్ వదులుకొని...

 మూడో గేమ్‌లో అబ్దుల్లా కళ్లు చెదిరే రీతిలో షాట్లు కొట్టడంతో సౌరవ్ 4-8తో వెనుకబడ్డాడు. అయితే క్రమంగా పుంజుకుంటూ ఒక్కో పాయింట్‌తో 11-11తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత 12-11తో ఆధిక్యంలో వెళ్లాడు. ఈ సమయంలో సౌరవ్ మరో పాయింట్ సాధించిఉంటే విజేతగా నిలిచేవాడు. కానీ బ్యాక్‌లైన్ నుంచి అబ్దుల్లా సంధించిన బంతికి ఎక్స్‌ట్రా పాయింట్లు రావడంతో గేమ్ అతని సొంతమైంది. నాలుగో గేమ్‌లో కువైట్ ఆటగాడి ఆధిక్యమే కొనసాగింది. కనీసం నాలుగైదు పాయింట్ల ఆధిక్యంలో నిలుస్తూ దూసుకుపోయాడు. నిర్ణయాత్మక ఐదో గేమ్‌లో 7-10తో వెనుకబడ్డ సౌరవ్ పట్టు విడవకుండా పోరాడాడు. ఫోర్ కోర్టు విన్నర్లు కొట్టి 9-10తో దగ్గరకు వచ్చాడు. అయితే తర్వాతి షాట్‌కు సౌరవ్‌ను అబ్దుల్లా అడ్డుకునే ప్రయత్నం చేసినా రిఫరీలు పట్టించుకోలేదు. తర్వాతి బంతికి ఒక్క పాయింట్‌కు నెగ్గిన కువైట్ ప్లేయర్ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకోగా... సౌరవ్ కన్నీళ్ల పర్యంతమయ్యాడు.







 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top