సఫరోవాకు షాక్

సఫరోవాకు షాక్ - Sakshi


♦  సెరెనా, నాదల్ శుభారంభం 

♦ యూఎస్ ఓపెన్ టెన్నిస్



 న్యూయార్క్ : యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రెండో రోజూ సంచలనం నమోదైంది. తొలి రోజున మహిళల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా), ఎనిమిదో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), పదో సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్)... పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్ కీ నిషికోరి (జపాన్) ఇంటిముఖం పట్టగా... వీరి సరసన తాజాగా ఆరో సీడ్ లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) చేరింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో లెసియా సురెంకో (ఉక్రెయిన్) 6-4, 6-1తో సఫరోవాను ఓడించింది. మరోవైపు ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ లక్ష్యంతో బరిలోకి దిగిన సెరెనా విలియమ్స్ (అమెరికా)... ఈ ఏడాది గ్రాండ్‌స్లామ్ టైటిల్ లోటును తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న రాఫెల్ నాదల్ (స్పెయిన్) శుభారంభం చేశారు.



తొలి రౌండ్‌లో టాప్ సీడ్ సెరెనా 6-0, 2-0తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి వితాలియా దియత్‌చెంకో (రష్యా) గాయం కారణంగా వైదొలిగింది. మరోవైపు పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఎనిమిదో సీడ్ నాదల్ 6-3, 6-2, 4-6, 6-4తో బోర్నా కోరిక్ (క్రొయేషియా)ను ఓడించాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-1, 6-1, 6-1తో జోవో సుజా (బ్రెజిల్)పై, డిఫెండింగ్ చాంపియన్, తొమ్మిదో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6-3, 7-6 (7/3), 7-6 (7/3)తో పెల్లా (అర్జెంటీనా)పై గెలిచారు. ఏడో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్), పదో సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా) కూడా రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు.



మహిళల సింగిల్స్ విభాగం తొలి రౌండ్‌లో అనా తాతిష్‌విలి (అమెరికా) 6-2, 6-1తో 8వ సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై, డెనిసా అలెర్టోవా (చెక్ రిపబ్లిక్) 6-1, 7-6 (7/5)తో 10వ సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్)పై, ఓసిన్ డోడిన్ (ఫ్రాన్స్) 2-6, 7-5, 6-3తో 21వ సీడ్ జంకోవిచ్ (సెర్బియా)పై, మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) 6-3, 7-5తో 30వ సీడ్ కుజ్‌నెత్సోవా (రష్యా)పై, కోకో వాండెవెగె (అమెరికా) 6-4, 6-3తో 29వ సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై సంచలన విజయాలు సాధించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top