షోయబ్ మాలిక్ సెంచరీ

షోయబ్ మాలిక్ సెంచరీ


పాక్ తొలి ఇన్నింగ్స్ 286/4  

   ఇంగ్లండ్‌తో తొలి టెస్టు

 అబుదాబి: ఫార్మాట్ ఏదైనా అదరగొడుతున్న పాకిస్తాన్ సీనియర్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ మరోసారి బ్యాట్ ఝుళిపించాడు. కెరీర్‌లోనే అత్యున్నత ఫామ్‌లో ఉన్న తను ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శతకం (230 బంతుల్లో 124 బ్యాటింగ్; 14 ఫోర్లు) బాది జట్టు భారీ స్కోరుకు దోహదపడ్డాడు. తొలి రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో నాలుగు వికెట్లకు 286 పరుగులు చేసింది. షోయబ్‌కు జతగా క్రీజులో అసద్ షఫీఖ్ (43 బంతుల్లో 11 బ్యాటింగ్; 2 ఫోర్లు) ఉన్నాడు. అండర్సన్‌కు రెండు వికెట్లు దక్కాయి. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన పాక్ ఐదు పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అయితే హఫీజ్ (98), షోయబ్ కలిసి రెండో వికెట్‌కు 168 పరుగులు జోడిం చారు.  యూనిస్ ఖాన్ (57 బంతుల్లో 38; 3 ఫోర్లు; 1 సిక్స్) పాక్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు (8,852) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

 

 సానియా స్ఫూర్తితోనే...

 ‘సానియా మీర్జా ఇటీవలి అద్భుత ప్రదర్శనతో ఒక క్రీడాకారుడిగా నేను కూడా ఆమెకు పోటీగా బాగా ఆడాల్సిన ఒత్తిడిని ఎదుర్కొన్నాను. ప్రతీ రోజు మేం మాట్లాడుకున్నప్పుడల్లా ఆమె టైటిల్స్ గురించి, నా ఇటీవలి ప్రదర్శన గురించి పరస్పర అభినందనలే ఉంటున్నాయి. నాలో ఈ మార్పునకు, జట్టులో పునరాగమనానికి సానియానే స్ఫూర్తి’  - షోయబ్ మాలిక్

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top