సెరెనాదే పైచేయి

సెరెనాదే పైచేయి


సోదరి వీనస్‌పై అలవోక విజయం

  క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశం  

  ఎదురులేని షరపోవా  

 వొజ్నియాకి, సఫరోవాలకు షాక్

 

 లండన్: ఎలాంటి సంచలనం నమోదు కాలేదు. ఊహించిన ఫలితమే వచ్చింది. ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్న సెరెనా విలియమ్స్ (అమెరికా) తన అక్క వీనస్ విలియమ్స్‌ను అలవోకగా ఓడించింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సెరెనా 6-4, 6-3తో 16వ సీడ్ వీనస్ విలియమ్స్‌ను ఓడించింది. తద్వారా వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో 2012 తర్వాత మళ్లీ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మూడో రౌండ్‌లో హీథెర్ వాట్సన్ (బ్రిటన్) చేతిలో ఓటమి అంచుల్లో నుంచి బయటపడిన సెరెనా ఈ మ్యాచ్‌లో తన సోదరిని తక్కువ అంచనా వేయకుండా ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. అనవసర తప్పిదాలు చేయకుండా, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న సెరెనా కేవలం 67 నిమిషాల్లో వీనస్ ఆట కట్టించింది. 10 ఏస్‌లు సంధించిన సెరెనా ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయకపోవడం విశేషం.

 

 నెట్ వద్దకు దూసుకొచ్చిన ఆరు పర్యాయాల్లో ఐదుసార్లు పాయింట్లు నెగ్గిన ఈ టాప్ సీడ్ ప్లేయర్, వీనస్ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ‘నేను చాలా బాగా ఆడాను. వీనస్‌తో ఇప్పటికే 25 సార్లు ఆడినందుకు ఆమె ఆటతీరుపై మంచి అవగాహన ఉంది. తక్కువ పొరపాట్లు చేసి, వచ్చిన అవకాశాలను అనుకూలంగా మల్చుకోవాలనే ప్రణాళికతో బరిలోకి దిగాను. అనుకున్న ఫలితం సాధించాను’ అని సెరెనా వ్యాఖ్యానించింది. ఈ గెలుపుతో ఓవరాల్ ముఖాముఖి రికార్డులో సెరెనా 15-11తో వీనస్‌పై ఆధిక్యంలోకి వెళ్లింది. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వీనస్‌పై సెరెనాకిది ఎనిమిదో విజయం కాగా... వింబుల్డన్‌లో నాలుగోది.

 

 మరోవైపు నాలుగో సీడ్ షరపోవా (రష్యా) తన విజయపరంపరను కొనసాగిస్తూ 2011 తర్వాత ఈ టోర్నీలో మరోసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. జరీనా దియాస్ (కజకిస్తాన్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో షరపోవా 6-4, 6-4తో గెలిచింది. 96 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ మాజీ చాంపియన్ అరడజను ఏస్‌లు సంధించడంతోపాటు ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది.  



 ముగురుజా సంచలనం

 ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. ఐదో సీడ్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్), ఆరో సీడ్ లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) ఇంటిముఖం పట్టారు. ముగురుజా (స్పెయిన్) 6-4, 7-5తో వొజ్నియాకిని బోల్తా కొట్టించగా... కోకో వాండెవెగె (అమెరికా) 7-6 (7/1), 7-6 (7/4)తో సఫరోవాను ఓడించింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో 13వ సీడ్ రద్వాన్‌స్కా (పోలండ్) 7-5, 6-4తో జంకోవిచ్ (సెర్బియా)పై, 23వ సీడ్ అజరెంకా (బెలారస్) 6-2, 6-3తో బెన్సిచ్ (స్విట్జర్లాండ్)పై, బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) 1-6, 7-5, 6-2తో నికెలెస్కు (రుమేనియా)పై, మాడిసన్ కీస్ (అమెరికా) 3-6, 6-4, 6-1తో గొవరోత్సోవా (బెలారస్)పై గెలిచారు.

 

 శ్రమించి నెగ్గిన ఆండీ ముర్రే

 పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ ముర్రే (బ్రిటన్) 7-6 (9/7), 6-4, 5-7, 6-4తో కార్లోవిచ్ (క్రొయేషియా)పై కష్టపడి గెలుపొందగా... నాలుగో సీడ్ వావ్రింకా 7-6 (7/3), 7-6 (9/7), 6-4తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై నెగ్గాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 7-5, 6-1, 6-7 (7/9), 7-6 (8/6)తో కిరియోస్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందగా... అన్‌సీడెడ్ పోస్పిసిల్ (కెనడా) 4-6, 6-7 (4/7), 6-4, 6-3, 6-3తో ట్రయెస్కీ (సెర్బియా)ను ఓడించి తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి చేరాడు.

 

 బెర్డిచ్ బోల్తా

 ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో 12వ సీడ్ గైల్స్ సిమోన్ 6-3, 6-3, 6-2తో ఆరో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)పై సంచలన విజయం సాధిం చగా... తొమ్మిదో సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 6-4, 4-6, 6-3, 7-5తో కుడ్లా (అమెరికా)ను ఓడించాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top