Alexa
YSR
‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పాడిపంటలతో పులకించాలి’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం క్రీడలుకథ

సెరెనా మళ్లీ ఆడుతుందా!

Sakshi | Updated: April 21, 2017 01:05 (IST)
సెరెనా మళ్లీ ఆడుతుందా!

తల్లి కాబోతున్న టెన్నిస్‌ స్టార్‌
2017 సీజన్‌కు దూరం 
వచ్చే ఏడాది వస్తానని ప్రకటన


లాస్‌ ఏంజెల్స్‌: ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో సోదరి వీనస్‌ను ఓడించి అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ (23)ల విజేతగా  సెరెనా విలియమ్స్‌ నిలిచిన  క్షణాన్ని టెన్నిస్‌ ప్రపంచం ఎప్పటికీ మరచిపోదు. కానీ ఆ సమయంలో సెరెనా రెండు నెలల గర్భవతి అంటే ఆశ్చర్యం కలుగుతుంది! తాను గర్భవతినని తెలిసీ బరిలోకి దిగిన సెరెనా... టైటిల్‌ గెలిచే క్రమంలో ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా కనబర్చిన ఆట, పట్టుదల అద్భుతం. ఈ చిరస్మరణీయ విజయం తర్వాత మోకాలి గాయం అంటూ ఆమె రెండు ప్రధాన టోర్నీలనుంచి తప్పుకుంది.

అయితే ఇప్పుడు తాను 20 వారాల గర్భవతినంటూ సెరెనా స్వయంగా ప్రకటించడం ఒక్కసారిగా హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. రెడ్‌ఇట్‌  సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఒహానియన్‌తో గత డిసెంబర్‌లో సెరెనాకు నిశ్చితార్థం జరిగింది. ‘సెరెనా తల్లి కాబోతుందని ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. ఈ సీజన్‌ మొత్తం ఆమె ఆటకు దూరం కానుంది. అయితే 2018లో మళ్లీ తిరిగి కోర్టులోకి అడుగు పెడుతుంది’ అని సెరెనా తరఫున ఆమె ప్రతినిధి బుష్‌ నోవాక్‌ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు.

అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలుచుకోవడంతో పాటు సుదీర్ఘ కాలం పాటు వరల్డ్‌ నంబర్‌వన్‌గా నిలిచిన సెరెనాకు ఈ ఏడాది సెప్టెంబరుతో 36 ఏళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో ఆమె ఇక తన కెరీర్‌ను ముగించే అవకాశం ఉందని కొందరు విశ్లేషిస్తుండగా... పునరాగమనం చేసి మళ్లీ చెలరేగిపోయే సత్తా సెరెనాలో ఉందని మరికొందరు చెబుతున్నారు. వచ్చే వారం ప్రకటించే తాజా డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో ఆమె మరోసారి నంబర్‌వన్‌గా నిలవనుంది.

అసాధ్యం కాదు...
తల్లిగా మారి గతంలో పునరాగమనం చేసిన సంచలన క్రీడాకారిణులు టెన్నిస్‌లో చాలా మంది ఉన్నారు. అయితే వారిలో ముగ్గురు మాత్రం మళ్లీ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలవగలిగారు. దిగ్గజం మార్గరెట్‌ కోర్ట్‌ మొదటి పాపకు జన్మనిచ్చిన తర్వాత మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించడం విశేషం. ఎవాన్‌ గులగాంగ్‌ తల్లిగా మారిన తర్వాత కేవలం ఏడు నెలల్లోనే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలవడంతో పాటు వింబుల్డన్‌ కూడా సొంతం చేసుకుంది. ఈతరం క్రీడాకారిణుల్లో కిమ్‌ క్లియ్‌స్టర్స్‌ కూడా అమ్మతనం అడ్డంకి కాదంటూ మూడు గ్రాండ్‌స్లామ్‌లను అందుకోవడం పెద్ద ఘనతగా చెప్పవచ్చు. అయితే సెరెనా విషయంలో వయసు మాత్రమే ప్రతిబంధకం కావచ్చనేది మాజీ ఆటగాళ్ల అభిప్రాయం. గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గకపోయినా... సర్క్యూట్‌లో కొనసాగుతూ పలు పెద్ద టోర్నీలు గెలిచినవారు ఎంతో మంది ఉన్నారు. తాజాగా విక్టోరియా అజరెంకా కూడా గత ఏడాది కొడుకు పుట్టిన తర్వాత త్వరలోనే తిరిగి రానున్నట్లు ప్రకటించింది.

డబ్బు కూడా వెంటే...
మరో వైపు సెరెనా మాతృత్వంపై అప్పుడే వ్యాపార వర్గాల దృష్టి పడినట్లు సమాచారం. గర్భిణులు ధరించే ప్రత్యేక దుస్తులు, ఆ సమయంలో వాడే పోషక పదార్థాలు, పిల్లల సంరక్షణకు సంబంధించిన అనేక ఉత్పత్తుల విషయంలో సెరెనా బ్రాండ్‌ బ్రహ్మాండంగా పని చేస్తుందని ఈ రంగంలోని నిపుణులు చెబుతుండటం విశేషం. ప్రస్తుతం మ్యాచ్‌ ఫీజులు, బ్రాండింగ్‌ల ద్వారా సెరెనా ఆర్జన దాదాపు 29 మిలియన్‌ డాలర్లుగా ఉంది.


వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

జల్దీ జాబ్స్‌కు దారేది?

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC