భారత్ అలవోకగా...

భారత్ అలవోకగా... - Sakshi


 ఫైనల్‌కు చేరిన సానియా బృందం  

 నేడు ఫిలిప్పీన్స్‌తో తుది పోరు

  ఫెడ్ కప్ టోర్నీ


 

 సాక్షి, హైదరాబాద్:
ఫెడ్ కప్ (ఆసియా/ఓషియానియా గ్రూప్ 2)లో భారత జట్టు ఫైనల్‌కు అర్హత సాధించింది. శుక్రవారం ఇక్కడి ఎల్బీ స్టేడియం సెంటర్ కోర్టులో జరిగిన ప్లే ఆఫ్ పోరులో భారత్ 2-0తో తుర్క్‌మెనిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. భారత క్రీడాకారిణుల జోరు ముందు తుర్క్‌మెనిస్తాన్ అమ్మాయిలు ఏ మాత్రం ప్రతిఘటన కనబర్చకుండా తలవంచారు. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో ప్రార్థనా తోంబరే 6-0, 6-2తో జహానా బెరమోవాను చిత్తుగా ఓడించింది.


ఈ మ్యాచ్ 51 నిమిషాల్లో ముగిసింది. రెండో సింగిల్స్‌లో కూడా అంకితా రైనా చెలరేగింది. ఈ మ్యాచ్‌లో అంకితా 6-1, 6-2తో అనస్తసియ ప్రెంకోను ఓడించింది. ఈ మ్యాచ్ ముగిసేందుకు 52 నిమిషాలు పట్టింది. సెమీస్ ఫలితం రెండు మ్యాచ్‌లకే తేలిపోవడంతో డబుల్స్ నిర్వహించాల్సిన అవసరం రాలేదు.


మరో ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఫిలిప్పీన్స్ 2-1 తేడాతో ఇండోనేసియాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగే ఫైనల్లో ఫిలిప్పీన్స్‌తో  భారత్ తలపడుతుంది. శుక్రవారం జరిగిన ఇతర వర్గీకరణ మ్యాచ్‌లలో మలేసియా 2-0తో ఇరాన్‌పై... పసిఫిక్ ఓషియానియా 3-0తో సింగపూర్‌పై గెలుపొందాయి.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top