సానియా మీర్జాకు ఖేల్ రత్న ?

సానియా మీర్జాకు ఖేల్ రత్న ?


న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డుకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరును కేంద్ర క్రీడాశాఖ ప్రతిపాదించింది. అయితే ఈ అంశంలో తుది నిర్ణయం మాత్రం అవార్డుల కమిటీ తీసుకుంటుందని వెల్లడించింది. కెరీర్‌లో తొలిసారి వింబుల్డన్ డబుల్స్ టైటిల్ సాధించిన సానియా డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లోనూ నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. టెన్నిస్‌లో సానియా సాధించిన గొప్ప విజయాలకు గుర్తుగా క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ ఆమె పేరును సిఫారసు చేశారని క్రీడా శాఖ కార్యదర్శి అజిత్ శరణ్ తెలిపారు. ‘ఏఐటీఏ నుంచి మాకు కాస్త ఆలస్యంగా సమాచారం అందింది. అయితే దీన్ని మంత్రి ఆమోదించి అవార్డుల కమిటీకి పంపిం చారు. ఇక తుది నిర్ణయం వాళ్లే తీసుకుంటారు’ అని శరణ్ పేర్కొన్నారు. అవార్డు విషయంలో స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్, డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ నుంచి సానియాకు గట్టిపోటీ ఎదురుకానుంది.



‘సానియా పేరును ఖేల్ రత్న కోసం ప్రతిపాదించడం చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ఈ స్ఫూర్తితో తను దేశానికి మరింత గౌరవం తెస్తుంది’

-సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా



ఇప్పటి వరకు దేశంలో ఖేల్ రత్న అవార్డు అందుకున్న క్రీడాకారుల సంఖ్య 27. ఈ అవార్డును ప్రవేశపెట్టి 22 సంవత్సరాలయింది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top