నేను క్రికెట్ ఆడేందుకు అనుమతించండి!

నేను క్రికెట్ ఆడేందుకు అనుమతించండి!


కరాచీ:ఐదేళ్ల క్రితం స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన ముగ్గురు పాకిస్థాన్ క్రికెటర్లలో ఒకడైన సల్మాన్ భట్ తన పునరాగమనంపై ఆసక్తిగా ఉన్నాడు. సల్మాన్ భట్‌ ఐదేళ్ల శిక్షా కాలం సెప్టెంబర్ 1న  ముగుస్తున్న నేపథ్యంలో.. అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్ భవిష్యత్తుపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. తనను తిరిగి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడేందుకు అనుమంతిచాలని క్రికెట్ బోర్డును అభ్యర్థించినట్లు పీసీబీ సీనియర్ అధికారి స్పష్టం చేశాడు.  దీనిలో భాగంగానే శుక్రవారం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక శాఖ అధికారులను, న్యాయనిపుణులను భట్ కలిశాడని.. కనీసం దేశంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లు ఆడేందుకైనా అనుమతి ఇవ్వాలని భట్ విన్నవించాడని సదరు అధికారి పేర్కొన్నాడు.



 

ఫిక్సింగ్ కు పాల్పడి నిషేధం ఎదుర్కొంటున్న ముగ్గురు పాకిస్తాన్ క్రికెటర్లు మొహమ్మద్ ఆమిర్, ఆసిఫ్, సల్మాన్ భట్‌లకు ఇటీవల ఉపశమనం లభించింది. వారి శిక్షా కాలం సెప్టెంబర్ 1న ముగుస్తుండడంతో పోటీ క్రికెట్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంది.  ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం అధికారికంగా ధ్రువీకరించింది.



వీరిలో ఆమిర్‌కు అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఆడేందుకు అనుమతి లభించింది. ‘యాంటీ కరప్షన్ ట్రిబ్యునల్ విధించిన కొన్ని షరతులకు లోబడి వారు పోటీ క్రికెట్‌లో అడుగు పెట్టవచ్చు. ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా పాల్గొనవచ్చు’ అని ఐసీసీ పేర్కొంది. ఆసిఫ్, భట్‌లకు ఏడు, పదేళ్ల చొప్పున శిక్ష విధించినా.. అందుకు సడలింపునిస్తూ దానిని ఐదేళ్లకే పరిమితం చేశారు. కాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాజాగా తీసుకునే నిర్ణయంపైనే వారి భవితవ్యం ఆధారపడి వుంటుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top