సెమీస్‌లో సైనా, శ్రీకాంత్

సెమీస్‌లో సైనా, శ్రీకాంత్


వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ

 దుబాయ్: అద్వితీయ ఆటతీరును కొనసాగిస్తూ సైనా నెహ్వాల్... చివరి లీగ్ మ్యాచ్‌లో పోరాడి ఓడిన కిడాంబి శ్రీకాంత్... బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ అజేయంగా నిలిచి గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

 

 శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సైనా 15-21, 21-7, 21-17తో యోన్ జూ బే (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. సైనాతోపాటు ఈ గ్రూప్ నుంచి సుంగ్ జీ హున్ (కొరియా)... గ్రూప్ ‘బి’ నుంచి అకానె యమగూచి (జపాన్), జు యింగ్ తాయ్ (చైనీస్ తైపీ) సెమీఫైనల్లోకి అడుగుపెట్టారు. చైనా స్టార్ ప్లేయర్స్ షిజియాన్ వాంగ్, యిహాన్ వాంగ్‌లు లీగ్ దశలోనే నిష్ర్కమించడం గమనార్హం. ఫలితంగా నాలుగేళ్ల తర్వాత తొలిసారి చైనాయేతర క్రీడాకారిణి ఈ టోర్నీలో టైటిల్ దక్కించుకోనుంది.

 మరోవైపు పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘బి’లో శ్రీకాంత్ రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు.

 

  చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 17-21, 21-12, 14-21తో  ప్రపంచ మూడో ర్యాంకర్ జాన్ జోర్గెన్‌సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. ఈ గ్రూప్‌లో శ్రీకాంత్, జోర్గెన్‌సన్, కెంటో మొమిటా (జపాన్) రెండేసి విజయాలతో సమఉజ్జీలుగా నిలిచారు. అయితే మూడు మ్యాచ్‌ల్లో కలిపి మొమిటా కంటే ఒక్కో గేమ్ ఎక్కువగా గెలిచిన జోర్గెన్‌సన్, శ్రీకాంత్ సెమీఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. పురుషుల సింగిల్స్‌లోనే గ్రూప్ ‘ఎ’ నుంచి చెన్ లాంగ్ (చైనా), విటిన్‌గస్ (డెన్మార్క్) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. శనివారం సెమీఫైనల్స్, ఆదివారం ఫైనల్స్ జరుగుతాయి.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top