సైనా సులువుగా...

సైనా సులువుగా...


కౌలాలంపూర్: భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ మలేసియా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్ విభాగంలో సైనా అలవోక విజయం సాధించగా... పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని గట్టెక్కాడు. శ్రీకాంత్‌తోపాటు భారత్‌కే చెందిన పారుపల్లి కశ్యప్, ప్రణయ్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. 37 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్‌లో మూడో సీడ్ సైనా 21-13, 21-16తో మరియా ఫెబె కుసుమస్తుతి (ఇండోనేసియా)పై గెలిచింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో సైనా ఆరంభంలోనే 7-0తో... ఆ తర్వాత 11-2తో ఆధిక్యంలోకి వెళ్లింది.



అనంతరం ఇదే జోరును కనబరుస్తూ తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో ఐదుసార్లు ఇరువురి స్కోర్లు సమమైనా కీలకదశలో సైనా వరుస పాయింట్లు నెగ్గి విజయాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో నాలుగో సీడ్ శ్రీకాంత్ 21-10, 15-21, 24-22తో రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)ను ఓడించగా... కశ్యప్ 21-15, 11-21, 21-14తో లీ డాంగ్ కియున్ (దక్షిణ కొరియా)పై, ప్రణయ్ 22-20, 21-18తో స్కాట్ ఇవాన్స్ (ఐర్లాండ్)పై విజయం సాధించారు. రాజీవ్‌తో 56 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ గెలిచినప్పటికీ ఆటతీరులో మాత్రం నిలకడ కనిపించలేదు. తొలి గేమ్‌లో ఇద్దరి స్కోర్లు 7-7వద్ద సమంగా ఉన్నపుడు శ్రీకాంత్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా 10 పాయింట్లు సాధించి 17-7తో ఆధిక్యంలోకి వెళ్లాడు.



ఈ గేమ్‌ను దక్కించుకున్నాక రెండో గేమ్‌లో శ్రీకాంత్ 6-0తో ముందంజ వేశాడు. ఈ దశలో తడబాటుకు లోనైన శ్రీకాంత్ ఆధిక్యాన్ని కోల్పోవడమే కాకుండా గేమ్‌నూ చేజార్చుకున్నాడు. ఇక నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ ఒకదశలో 8-11తో వెనుకబడ్డాడు. అయితే పట్టుదల కోల్పోకుండా ఆడిన శ్రీకాంత్ వరుసగా మూడు పాయింట్లు సాధించి స్కోరును 11-11వద్ద సమం చేశాడు. అటునుంచి ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. చివరకు శ్రీకాంత్ రెండుసార్లు (19-20; 21-22) మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని విజయాన్ని దక్కించుకున్నాడు.

 

మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జంట 21-14, 18-21, 21-16తో హనాదియా-దేవిటికా (ఇండోనేసియా) ద్వయంపై గెలిచింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) జోడీ 11-21, 17-21తో ఆండ్రీ అడిస్టియా-హెంద్రా (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో హౌవి తియాన్ (చైనా)తో శ్రీకాంత్; లిన్ డాన్ (చైనా)తో ప్రణయ్; చెన్ లాంగ్ (చైనా)తో కశ్యప్; జుయ్ యావో (చైనా)తో సైనా తలపడతారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top