అ‘ద్వితీయం’

అ‘ద్వితీయం’


నిరీక్షణ ఫలించింది. కల నిజమైంది. సంబరం రెట్టింపైంది. ‘మన రాకెట్’ మళ్లీ మెరిసింది. ఇంతకాలం విదేశీ గడ్డపై సత్తా చాటుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సొంత అభిమానుల సమక్షంలో అద్వితీయ ఆటతీరుతో అబ్బుర పరిచారు. గతేడాది చైనా ఓపెన్‌లో ఆవిష్కృతమైన అద్భుత దృశ్యాన్ని ఇండియా ఓపెన్‌లోనూ పునరావృతం చేశారు. ఏకకాలంలో ఒకే సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో మహిళల, పురుషుల సింగిల్స్ టైటిల్స్‌ను రెండోసారి సొంతం చేసుకొని సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ వారెవ్వా అనిపించారు.

 

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ ప్రారంభమై నాలుగేళ్లు గడిచాయి. సొంతగడ్డపై భారత క్రీడాకారులకు ఈ టోర్నీ చేదు ఫలితాలనే ఇచ్చింది. ఇన్నాళ్లూ ఏ విభాగంలోనూ మనోళ్లు సెమీఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయారు. అయితే ఐదో యేట అందరి అంచనాలు తారుమారయ్యాయి. అటు మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్... ఇటు పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్ చాంపియన్స్‌గా అవతరించి ‘ఔరా’ అనిపించారు.



ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో  ప్రపంచ నంబర్‌వన్ సైనా 21-16, 21-14తో ప్రపంచ మాజీ చాంపియన్, మూడో సీడ్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్)పై నెగ్గగా... ప్రపంచ నాలుగో ర్యాంకర్ శ్రీకాంత్ 18-21, 21-13, 21-12తో ప్రపంచ ఆరో ర్యాంకర్ విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్)ను ఓడించాడు. విజేతలుగా నిలిచిన సైనా, శ్రీకాంత్‌లకు 20,625 డాలర్ల చొప్పున (రూ. 12 లక్షల 89 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

 

గతంలో ఆడిన నాలుగు పర్యాయాల్లో క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించడంలో విఫలమైన సైనా ఈసారి ఏకంగా విజేతగా నిలిచింది. భుజం నొప్పితో బాధపడుతున్నా ఈ హైదరాబాద్ అమ్మాయి పట్టుదలగా పోరాడి తన ఖాతాలో తొమ్మిదో ‘సూపర్ సిరీస్’ టైటిల్‌ను జమచేసుకుంది. సెమీస్‌లో ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)ను ఓడించిన రత్చనోక్‌ను తక్కువ అంచనా వేయకుండా ఆరంభం నుంచే సైనా పక్కా ప్రణాళికతో ఆడింది. చురుకైన కదలికలు, నెట్ వద్ద అప్రమత్తత, పదునైన స్మాష్‌లు సంధిస్తూ నిలకడగా పాయింట్లు సాధించింది.



రత్చనోక్ అనవసర తప్పిదాలు, అభిమానుల మద్దతు కూడా లభించడంతో రెండు గేముల్లోనూ సైనా స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబరిచి 49 నిమిషాల్లో ఫైనల్‌ను ముగించింది. టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ సైనా నెహ్వాల్ ఈ టోర్నీలో తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా విజేతగా నిలువడం విశేషం.

 

రెండు వారాల క్రితం విక్టర్ అక్సెల్‌సన్‌ను ఓడించి స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గిన హైదరాబాద్ కుర్రాడు శ్రీకాంత్ మళ్లీ అలాంటి ఫలితాన్ని భారత్‌లోనూ పునరావృతం చేశాడు. తొలి గేమ్‌లో తడబడిన శ్రీకాంత్ రెండో గేమ్ నుంచి పుంజుకున్నాడు. అక్సెల్‌సన్ జోరుకు పగ్గాలు వేస్తూ నిలకడగా పాయింట్లు స్కోరు చేశాడు. అదే జోరులో గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్ ప్రారంభంలో శ్రీకాంత్ 3-7తో వెనుకబడ్డాడు.



ఈ దశలో ఏమాత్రం కంగారు పడకుండా ఆడిన శ్రీకాంత్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి ఆధిక్యాన్ని ఒక పాయింట్‌కు తగ్గించాడు. 10-12తో వెనుకబడిన దశలో శ్రీకాంత్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. కసితీరా ఆడుతూ ఎవ్వరూ ఊహించని విధంగా వరుసగా 11 పాయింట్లు నెగ్గి అక్సెల్‌సన్‌ను నిశ్చేష్టుడిని చేశాడు. 55 నిమిషాల్లో ఫైనల్‌ను ముగించి తన ఖాతాలో రెండో సూపర్ సిరీస్ టైటిల్‌ను జమచేసుకున్నాడు.

 

‘బాయ్’ నజరానా

గురువారం విడుదలయ్యే తాజా ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ అందుకోనున్న సైనా నెహ్వాల్‌కు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించింది. ఇండియా ఓపెన్ నెగ్గినందుకు శ్రీకాంత్‌కు రూ. 5 లక్షలు అందజేస్తామని ‘బాయ్’ అధ్యక్షుడు అఖిలేశ్ దాస్‌గుప్తా తెలిపారు.

 

కల నిజమైంది...

‘‘ఇండియా ఓపెన్ టైటిల్ నెగ్గడంతో గత నాలుగేళ్ల నుంచి నాపై ఉన్న భారం తొలగిపోయింది. గత నాలుగేళ్లుగా విఫలమవుతున్న టోర్నీలో తొలిసారి ఫైనల్‌కు చేరడమే కాకుండా విజేతగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. సొంతగడ్డపై నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకోవడం... ఇండియా ఓపెన్ గెలవడంతో నా కల నిజమైంది. నా ఆటతీరుపట్ల గర్వంగా ఉన్నాను. ఎంతో కష్టపడ్డాక నేనీ స్థాయికి చేరుకున్నాను.



నా జీవితంలో ఇవి మధుర క్షణాలు. ఈ గెలుపు నాలోని విజయకాంక్షను రెట్టింపు చేస్తుంది. మరిన్ని టైటిల్స్ నెగ్గేందుకు ప్రేరణలా నిలుస్తుంది. ఈ విజయాన్ని ఎంతగానో ఆస్వాదిస్తాను. ఐస్‌క్రీమ్ తింటాను. మిల్క్ షేక్ తాగుతాను. చాక్లెట్ తింటాను. సోమవారం విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత ప్రాక్టీస్ మొదలుపెడతాను. తదుపరి టోర్నీలో ఆడేందుకు మలేసియాకు బయలుదేరుతాను.’’                                                 -సైనా నెహ్వాల్



నంబర్‌వన్ సాధిస్తా....

‘‘ప్రతిసారీ గెలుస్తానని అనుకోను. ఓడిపోతే భయపడను. బరిలోకి దిగిన ప్రతిసారీ నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేందుకు కృషి చేస్తాను. ఈ తరహా దృక్పథమే నాకు విజయాలు అందిస్తోంది. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ సాధించాలనే లక్ష్యం నా మదిలో ఉంది. నిలకడగా మంచి ఫలితాలు సాధిస్తే భవిష్యత్‌లో ఈ ఘనత సాధిస్తాననే నమ్మకం ఉంది. ఇలాంటి విజయాలు నాలో కొత్త ఉత్సాహాన్నిస్తాయి. మున్ముందు మరిన్ని టోర్నమెంట్లలో మెరుగ్గా ఆడేందుకు స్ఫూర్తిగా నిలుస్తాయి.’’                      

-శ్రీకాంత్

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top