ఆ తలపోటు నాకొద్దు.. నాన్నకే వదిలేస్తా!

ఆ తలపోటు నాకొద్దు.. నాన్నకే వదిలేస్తా!


బెంగళూరు:ఇప్పటికే చాలామంది క్రీడాకారులు తమ సంపాదనను పెట్టుబడి రూపంలోకి మార్చి ఆదాయ వనరులను మరింత పెంచుకుంటున్నారు. ఈ కోవలో చేరేందుకు వరల్డ్ నంబర్ వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఆసక్తి కనబరుస్తోంది. తాను కూడా వివిధ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నట్లు సైనా తాజాగా స్పష్టం చేసింది. కాగా, ఈ ఆర్థికవ్యవహారాలు గురించి తనకు పెద్దగా తెలీదని సైనా తెలిపింది.


 


'నేను పలురకాలైన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా. ఏ వ్యాపారం చేయాలి.. ఎక్కడ చేయాలి అనేవి నాకు తెలియదు. నా ఆర్థికపరమైన లావాదేవాలన్నీ నాన్నకు అప్పచెప్పాలనుకుంటున్నా. ఆ తలపోటును తండ్రికే వదిలేస్తా' అని సైనా  పేర్కొంది. ఇటీవల బెంగళూరులోని ఓ ప్రముఖ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబడ్డ సైనా.. శుక్రవారం ఇక్కడకు హాజరైన అనంతరం మీడియాతో  మాట్లాడుతూ పై విధంగా స్పందించింది.



ఈమధ్య కాలంలో సైనా నెహ్వాల్ సాధించిన విజయాలతో తన బ్రాండ్ విలువ పెరిగింది. సైనా పేరుతో రెండేళ్ల కాలంలో రూ.25 కోట్ల వ్యాపారం చేయొచ్చని ప్రముఖ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంస్థ ఐఓఎస్ భావిస్తోంది. భారత బ్యాడ్మింటన్ స్టార్‌తో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సైనాకు ఎంత మొత్తం చెల్లిస్తారనేది వెల్లడికాలేదు. ఇకనుంచి సైనా ఎండార్స్‌మెంట్, పేటెంట్స్, డిజిటల్ రైట్స్, చిత్రాలు, సామాజిక మాధ్యమాల్లో కనిపించే విషయాలన్నింటినీ ఐఓఎస్ స్పోర్ట్స్ పర్యవేక్షించనుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top