సచిన్ 'రికార్డు' కు కొద్ది దూరంలో..

సచిన్ 'రికార్డు' కు కొద్ది దూరంలో..


లండన్:మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. పిన్న వయసులోనే టెస్టు క్రికెట్ ఆడిన క్రికెటర్ గా చరిత్రకెక్కడమే కాకుండా, అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ సాధించిన ఘనతల్లో ఒకటైన టెస్టుల్లో పదివేల పరుగుల రికార్డు త్వరలోనే తెరమరగయ్యే అవకాశం ఉంది.  టెస్టుల్లో సచిన్ పదివేల పరుగులను సాధించే నాటికి అతని వయసు 31సంవత్సరాల 10 నెలలు. వయసు పరంగా ఆ ఘనత ఇప్పటివరకూ సచిన్ పేరిటే పదిలంగానే ఉన్నా.  ఆ రికార్డు మరికొన్ని రోజుల్లో కుక్ ఖాతాలో చేరనుంది. ప్రస్తుతం పదివేల పరుగులు చేయడానికి కుక్ ఇంకా 36 పరుగుల మాత్రమే అవసరం. ప్రస్తుతం 32 ఒడిలో ఉన్న కుక్.. మరో రెండు వారాల్లో శ్రీలంక-ఇంగ్లండ్ ల మధ్య టెస్టు సిరీస్లో సచిన్ రికార్డును సవరించే అవకాశం ఉంది. ఇది కూడా తొలి టెస్టు ద్వారానే కుక్ ఆ రికార్డును సాధిస్తాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా.



2006లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన కుక్.. తన మొదటి టెస్టులోనే సెంచరీ సాధించి సత్తా చాటాడు. భారత్ తో నాగ్ పూర్ లో జరిగిన  టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో కుక్ అజేయంగా 104 పరుగులు సాధించి తనదైన ముద్రవేశాడు. ఇప్పటివరకూ 126 టెస్టు మ్యాచ్లాడిన కుక్ 46.56 సగటుతో 9, 964 పరుగులను  సాధించాడు.ఇందులో 28 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఇప్పటివరకూ 11 మంది ఆటగాళ్లు మాత్రమే పది వేల మార్కును చేరితే, ఇంగ్లండ్ తరపున ఒక్క ఆటగాడు కూడా ఆ మార్కును చేరలేదు. దీంతో కుక్ ఒకేసారి రెండు రికార్డులను నమోదు చేయడానికి అతి కొద్ది దూరంలో ఉన్నాడనేది కాదనలేని వాస్తవం.



ఇదిలా ఉండగా, గతేడాది అక్టోబర్  లో పాకిస్తాన్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో కుక్ సుదీర్ఘంగా క్రీజ్ లో ఉండి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  ఆ టెస్టులో డబుల్ సెంచరీతో విశేషంగా రాణించిన కుక్  (528 బంతుల్లో 263; 18 ఫోర్లు) ద్విశతకాన్ని నమోదు చేశాడు. ఈ స్కోరును చేసే క్రమంలో కుక్ సుదీర్ఘంగా 836 నిమిషాల పాటు క్రీజ్ లో ఉన్నాడు. దీంతో అత్యధిక సమయం క్రీజ్ లో ఉన్న మూడో క్రికెటర్ గా గుర్తింపు పొందాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top