ఈ విజయంతో ఆగిపోవద్దు!

ఈ విజయంతో ఆగిపోవద్దు!


‘రియో’ స్టార్లకు సచిన్ సూచన

2020లో మరింత బాగా ఆడాలన్న మాస్టర్

సింధు, సాక్షి, దీప, గోపీచంద్‌లకు కార్లు బహుకరణ




హైదరాబాద్: భారత దేశం యావత్తూ కలిసి వేడుకను జరుపుకునేందుకు రియో విజేతలు అవకాశం ఇచ్చారని, మున్ముందు ఇలాంటి  రోజులు మరిన్ని రావాలని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆకాంక్షించారు. జాతి మొత్తం ఈ సమయంలో పట్టరాని సంతోషంతో ఉందని ఆయన అన్నారు. రియోలో పతకాలు గెల్చుకున్న సింధు, రెజ్లర్ సాక్షి మలిక్‌లతో పాటు జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, కోచ్ గోపీచంద్‌లను అభినందించేందుకు ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సచిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి. చాముండేశ్వరీనాథ్ తరఫున ఈ నలుగురికి బీఎండబ్ల్యూ కార్లను సచిన్ బహుకరించారు. ‘భారత క్రీడల్లో ఇదో సుదినం. మన అమ్మాయిలు గర్వపడే ప్రదర్శన ఇచ్చారు. ఇప్పుడే విజయాల ప్రయాణం ప్రారంభమైంది. ఇది ఇక్కడితో ఆగిపోవద్దు. మేమందరం మీ కోసం ప్రార్థిస్తాం.



మీకు అండగా నిలుస్తాం. మేం సంబరాలు జరుపుకునేందుకు మళ్లీ మీరు అవకాశం ఇవ్వాలి. భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు రానున్నాయని నేను నమ్ముతున్నా’ అని సచిన్ వ్యాఖ్యానించారు. పుల్లెల గోపీచంద్‌ను రియల్ హీరోగా, యువతరానికి రోల్‌మోడల్‌గా అభివర్ణించిన సచిన్... మరిన్ని పతకాలు సాధించేందుకు ఆయన మార్గదర్శనం కావాలని చెప్పారు. ఈ పతకాల సాధన వెనుక ఎంతో శ్రమ, పట్టుదల, త్యాగాలు ఉన్నాయని సింధు, సాక్షిలపై మాస్టర్ ప్రశంసలు కురిపించారు.


 

మరిన్ని విజయాలు సాధిస్తాం...


దశాబ్దం క్రితం బ్యాడ్మింటన్ ఒలింపిక్ పతకం తెస్తానని తాను చెబితే ఎవరూ నమ్మలేదని, సహకరించేందుకు ముందుకు రాలేదని గోపీచంద్ గుర్తు చేసుకున్నారు. అలాంటి సమయంలో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అండగా నిలవడంతో అకాడమీ నిర్మాణం సాధ్యమైందని, ఇప్పుడు వరుస ఒలింపిక్స్‌లలో పతకాలు గెలవగలిగామని ఆయన అన్నారు. ఒలింపిక్స్‌కు ముందు, ఒలింపిక్స్ సమయంలో కూడా సచిన్ మాటలు ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపాయని గోపీ చెప్పారు. ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి దేశంలో సంబరాలకు కారణం కావడం గతంలో ఎప్పుడూ లేదని ఆయన వ్యాఖ్యానించారు.


తాను ఒలింపిక్స్‌కు ఒంటరిగా వెళ్లానని, ఇప్పుడు దేశం మొత్తం తన వెంట ఉందని సాక్షి సంతోషం వ్యక్తం చేయగా... పతకం తీసుకురాకపోయినా దేశ ప్రజలు ఇంతటి ప్రేమ చూపించడం గర్వంగా అనిపిస్తోందని దీపా కర్మాకర్ చెప్పింది. చాన్నాళ్ల క్రితం బ్యాడ్మింటన్‌లో ప్రదర్శనకే తొలి కారు స్విఫ్ట్ డిజైర్ అందుకున్నానని, ఇప్పుడు కారు బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించడం పట్ల సింధు కృతజ్ఞతలు తెలిపింది.


 

సింధు, గోపీలకు బీఎండబ్ల్యూ 320డి మోడల్... సాక్షి, దీపలకు బీఎండబ్ల్యూ ఎక్స్1 మోడల్ కార్లను బహుమతిగా అందజేశారు. చాముండేశ్వరీనాథ్‌తో పాటు పారిశ్రామికవేత్తలు వై.నవీన్, టి. శ్రీనివాస్, ఎం.వెంకటరమణ, సి.అనిల్ వీటికి స్పాన్సర్లుగా వ్యవహరించారు. మరోవైపు గోపీచంద్ అకాడమీ తరఫున కూడా సింధు, సాక్షి, దీప లకు ప్రత్యేక బహుమతులు ఇచ్చారు.


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top