పక్కకి వెళ్లి ఏడ్చేవాడిని!

పక్కకి వెళ్లి ఏడ్చేవాడిని! - Sakshi


పుణే: డకౌట్ అయినా... సెంచరీ చేజార్చుకున్నా... బౌలర్లు రెచ్చగొట్టినా... అంతగా స్పందించని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చిన్నారుల మాటలకు మాత్రం చలించిపోయేవాడట. పుణేలో ఒక చారిటీ సంస్థ కోసం ఆదివారం జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమం సందర్భంగా స్వయంగా సచిన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘జీవిత చరమాంకంలో ఉన్న చిన్నారుల ఆకాంక్ష తీర్చేందుకు పనిచేసే ‘మేక్ ఎ విష్ ఫౌండేషన్’ సంస్థ ద్వారా చిన్నారులను నా ఇంట్లో కలిసేవాణ్ని.


వాళ్లతో మాట్లాడాక... వారి బాధలు విన్నాక చాలా భావోద్వేగానికి లోనయ్యేవాణ్ని. కన్నీళ్లు ఆపుకోలేకపోయేవాడిని. ఒక్కోసారి వేరే గదిలోకి వెళ్లి ఏడ్చేవాడిని’ అని సచిన్ వివరించాడు. ఈ చారిటీ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్‌కు చెందిన మూడు వస్తువులను వేలం వేశారు. ఈ వేలం ద్వారా మొత్తం రూ. 58 లక్షలు వచ్చాయి. కెరీర్ ప్రారంభంలో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన సమయంలో సచిన్ ధరించిన ‘టై’కు రూ. 3 లక్షలు... 2010 దక్షిణాఫ్రికా పర్యటనలో వేసుకున్న జెర్సీకి రూ. 5 లక్షలు... కెరీర్‌లో వాడిన బ్యాట్‌కు అత్యధికంగా రూ. 50 లక్షల ధర పలికింది.





 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top