మేమంతా... నీవెంటే

మేమంతా... నీవెంటే


న్యూఢిల్లీ: బాక్సర్ సరితాదేవి సస్పెన్షన్‌పై పునరాలోచించాలని అంతర్జాతీయ బాక్సింగ్ సంఘానికి (ఏఐబీఏ-ఐబా) భారత ప్రభుత్వం అప్పీల్ చేయనుంది. ఇటీవలి ఆసియా క్రీడల్లో తనకు లభించిన కాంస్య పతకాన్ని తీసుకోకుండా మరో బాక్సర్ మెడలో వేసినందుకు ఐబా ఆమెపై తాత్కాలికంగా వేటు వేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆమెపై జీవితకాల నిషేధం విధించే ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సరిత విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ పలువురు క్రీడాకారులు, అధికారులతో సమావేశమయ్యారు.



‘ఈ విషయంలో సరితకు ప్రభుత్వం అండగా ఉండడమే కాకుండా ఆమెకు కావల్సిన సహాయ సహకారాలు అందిస్తుంది. ఇప్పటిదాకా ఆమె తన విజయాలతో దేశం గర్వపడేలా చేసింది. అందుకే భారత ప్రభుత్వం తరఫున సస్పెన్షన్‌ను పునరాలోచించాలని ఐబాకు విజ్ఞప్తి చేస్తాం’ అని క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. ఈ సమావేశంలో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తేందూల్కర్, బాక్సర్లు మేరీకోమ్, విజేందర్ సింగ్, ఐఓఏ అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్, బాక్సింగ్ ఇండియా అధ్యక్షుడు సందీప్ జజోడియా, జాతీయ బాక్సింగ్ కోచ్ జీఎస్ సంధూ తదితరులు పాల్గొన్నారు.



 దేశం మొత్తం అండగా ఉండాలి: సచిన్

 బాక్సర్ సరితా దేవికి ఈ కష్ట కాలంలో దేశం మొత్తం అండగా నిలవాలని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తేందూల్కర్ కోరాడు. క్రీడల మంత్రితో సమావేశం అనంతరం సచిన్ విలేకరులతో మాట్లాడాడు. ‘సరితా దేవి ఉదంతం గురించే ఈ సమావేశం జరిగింది. ఆమె విషయంలో ఎలా ముందుకెళ్లాలి.. ఐబాతో ఏం చెప్పాలి.. అని మేం చర్చించాం.


ఓ క్రీడాకారుడిగా ఆమె బాధ నాకు తెలుసు. పరిస్థితులు అనుకూలించనప్పుడు ఒక్కో వ్యక్తి ఒక్కోలా స్పందిస్తుంటాడు. ఐబా కచ్చితంగా ఆమె కేసును మరోసారి పరిశీలించాలి. ఇప్పటికే తను క్షమాపణలు చెప్పింది. ఈ సమయంలో దేశం యావత్తూ ఆమెకు మద్దతుగా నిలవాలి’ అని సచిన్ కోరాడు. మరోవైపు ఇలాంటి వివాదాలు తలెత్తకుండా ఐబా తమ నిబంధనల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ అభిప్రాయపడ్డాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top