బాబోయ్..!


రెండో టి20లోనూ భారత్ చిత్తు

92 పరుగులకే ఆలౌట్

6 వికెట్లతో దక్షిణాఫ్రికా ఘన విజయం

2-0తో సిరీస్ సొంతం


 

 క్రీజులో ఉంటే ముళ్లకంచె మీద నిలుచున్నట్లు అనిపిస్తోంది..! బంతి బాంబులా   కనిపిస్తోంది..! స్పిన్నర్ వేసే బంతి ఆడటానికే బ్యాట్ చేతిలోంచి జారిపోతోంది..! ఆవలి క్రీజు సుదూరంగా కనిపిస్తూ పరుగు చేతకావడం లేదు..! సొంతగడ్డపై సాధారణ పిచ్ మీద టన్నుల కొద్దీ టి20 అనుభవం ఉన్న భారత క్రికెటర్లు కటక్‌లో ఇదే అనుభూతితో కనిపించారు. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టిలా... గత మ్యాచ్‌లో వీరబాదుడుతో 199 పరుగులు చేసిన ‘హీరోలు’... రెండో టి20లో వందలోపే చాప చుట్టేశారు. ఫలితం...    దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాభవం. హోరాహోరీగా సాగుతుందనుకున్న సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే సఫారీలు తమ ఖాతాలో చేర్చుకున్నారు.



 కటక్: గాంధీ-మండేలా సిరీస్ తొలి అంచె దక్షిణాఫ్రికా వశమైంది. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఆ జట్టు 2-0తో చేజిక్కించుకుంది. భారత్ పేలవ బ్యాటింగ్ అనంతరం ప్రేక్షకుల ఆగ్రహం కారణంగా అంతరాయాలతో సాగిన రెండో టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఇక్కడి బారాబతి స్టేడియంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 17.2 ఓవర్లలో 92 పరుగులకే ఆలౌటైంది. రైనా (22), రోహిత్ (22) మాత్రమే ఓ మోస్తరుగా ఆడారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆల్బీ మోర్కెల్ (3/12) రాణించగా, మోరిస్, తాహిర్ చెరో 2 వికెట్లు తీశారు.

 

 అనంతరం దక్షిణాఫ్రికా 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 96 పరుగులు చేసింది. మరోసారి డుమిని (39 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు) నిలబడటంతో మరో 17 బంతులు మిగిలి ఉండగానే ఆ జట్టు విజయం అందుకుంది. మూడో టి20 గురువారం కోల్‌కతాలో జరుగుతుంది. టపటపా..: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టులో అరవింద్ స్థానంలో హర్భజన్ రాగా...దక్షిణాఫ్రికా డి లాంజ్‌కు బదులుగా ఆల్బీ మోర్కెల్‌కు తుది జట్టులో చోటిచ్చింది. గత మ్యాచ్‌తో పోలిస్తే భారత ఇన్నింగ్స్ నెమ్మదిగా, తడబడుతూ మొదలైంది.

 

 నాలుగో ఓవర్లో మోరిస్ బౌలింగ్‌లో ధావన్ (11) పెవిలియన్ చేరగా, మరో రెండు బంతులకే రెండో పరుగు కోసం ప్రయత్నించి కోహ్లి (1) రనౌటయ్యాడు. పవర్ ప్లేలో జట్టు 35 పరుగులు మాత్రమే చేయగలిగింది. దక్షిణాఫ్రికా అద్భుతమైన ఫీల్డింగ్ కారణంగా భారత్ ఒక్కో పరుగు కోసం తీవ్రంగా శ్రమించింది.  ఇదే ఒత్తిడిలో రోహిత్ (24 బంతుల్లో 22; 2 ఫోర్లు) కూడా రనౌట్ కాగా... అంబటి రాయుడు (0) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ధోని (5) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. తర్వాతి ఓవర్లోనే రైనా (24 బంతుల్లో 22; 3 ఫోర్లు), హర్భజన్ (0)లను తాహిర్ వరుస బంతుల్లో అవుట్ చేయడంతో జట్టు  కుప్పకూలింది. ఒక దశలో 31 బంతులపాటు, ఆ తర్వాత చివర్లో 26 బంతుల పాటు భారత్ ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది.

 

 అశ్విన్‌కు 3 వికెట్లు..: దక్షిణాఫ్రికా కూడా ఆరంభంలోనే ఆమ్లా (2) వికెట్ కోల్పోయింది. కొద్దిసేపటికే అశ్విన్ ఓవర్లో మూడు బంతుల్లో 13 పరుగులు తీసి జోరు ప్రదర్శించిన డు ప్లెసిస్ (16) తర్వాతి బంతికే వెనుదిరిగాడు. అశ్విన్ తన స్పెల్ చివరి బంతికి డివిలియర్స్ (19)ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో దక్షిణాఫ్రికా కాస్త ఒత్తిడిలో పడింది. అయితే డుమిని, బెహర్దీన్ కలిసి జట్టును విజయం దిశగా నడిపిస్తున్న దశలో ప్రేక్షకుల దురుసు ప్రవర్తనతో మ్యాచ్ ఆగింది. ఆ తర్వాత బెహర్దీన్ (11) అవుట్ అయినా డుమిని తీరం చేర్చాడు.

 

 టి20ల్లో ఇర్ఫాన్ పఠాన్ (28)ను అధిగమించి అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అశ్విన్ (29) నిలిచాడు.

 

 టి20ల్లో భారత్‌కు ఇది రెండో అత్యల్ప స్కోరు. గతంలో ఆస్ట్రేలియాపై 74 పరుగులకే కుప్పకూలింది.

 

 స్కోరు వివరాలు

 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (రనౌట్) 22; ధావన్ (ఎల్బీ) (బి) మోరిస్ 11; కోహ్లి (రనౌట్) 1; రైనా (సి) ఆమ్లా (బి) తాహిర్ 22; రాయుడు (బి) రబడ 0; ధోని (సి) డివిలియర్స్ (బి) మోర్కెల్ 5; అక్షర్ (సి) డు ప్లెసిస్ (బి) మోర్కెల్ 9; హర్భజన్ (బి) తాహిర్ 0; అశ్విన్ (బి) మోరిస్ 11; భువనేశ్వర్ (బి) మోర్కెల్ 0; మోహిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (17.2 ఓవర్లలో ఆలౌట్) 92.

 

 వికెట్ల పతనం: 1-28; 2-30; 3-43; 4-45; 5-67; 6-69; 7-69; 8-85; 9-85; 10-92.

 బౌలింగ్: అబాట్ 3-0-21-0; తాహిర్ 4-0-24-2; రబడ 4-0-18-1; మోరిస్ 2.2-0-16-2; మోర్కెల్ 4-0-12-3.  

 

 దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డివిలియర్స్ (బి) అశ్విన్ 19; ఆమ్లా (సి) రోహిత్ (బి) అశ్విన్ 2; డు ప్లెసిస్ (సి) మోహిత్ (బి) అశ్విన్ 16; డుమిని (నాటౌట్) 30; బెహర్దీన్ (ఎల్బీ) (బి) అక్షర్ 11; మిల్లర్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (17.1 ఓవర్లలో 4 వికెట్లకు) 96.

 

 వికెట్ల పతనం: 1-13; 2-38; 3-49; 4-76.

 బౌలింగ్: భువనేశ్వర్ 2-0-13-0; అశ్విన్ 4-0-24-3; హర్భజన్ 4-0-20-0; మోహిత్ 1-0-7-0; రైనా 3.1-0-12-0; అక్షర్ 3-0-17-1.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top