కర్జాకిన్‌కు టైటిల్

కర్జాకిన్‌కు టైటిల్


ప్రపంచ కప్ చెస్ చాంపియన్‌షిప్

బాకు (అజర్‌బైజాన్): ప్రపంచ కప్ చెస్ చాంపియన్‌షిప్‌లో రష్యా గ్రాండ్‌మాస్టర్ సెర్గీ కర్జాకిన్ విజేతగా నిలిచాడు. తన దేశానికే చెందిన పీటర్ స్విద్లెర్‌తో జరిగిన ఫైనల్లో కర్జాకిన్ 6-4 స్కోరుతో విజయం సాధించాడు. నిర్ణీత నాలుగు క్లాసిక్ గేమ్‌ల తర్వాత ఇద్దరూ 2-2తో సమంగా నిలిచారు. ఆ తర్వాత ర్యాపిడ్ పద్ధతిలో నాలుగు గేమ్‌లు నిర్వహించగా ఇద్దరూ చెరో రెండింటిలో గెలుపొందడంతో స్కోరు 4-4తో సమమైంది. ఈసారి బ్లిట్జ్ పద్ధతిలో రెండు గేమ్‌లు నిర్వహించగా... రెండింటిలో కర్జాకిన్ నెగ్గి విజేతగా అవతరించాడు.



కర్జాకిన్‌కు లక్షా 20 వేల డాలర్లు (రూ. 78 లక్షల 46 వేలు), రన్నరప్ స్విద్లెర్‌కు 80 వేల డాలర్లు (రూ. 52 లక్షల 30 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ టోర్నీ ద్వారా కర్జాకిన్‌తోపాటు స్విద్లెర్ వచ్చే ఏడాది మార్చిలో జరిగే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌కు అర్హత సాధించారు. క్యాండిడేట్స్ టోర్నీకి ఇప్పటికే విశ్వనాథన్ ఆనంద్ (భారత్), వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా), ఫాబియానో, హికారు నకముర (అమెరికా) కూడా అర్హత పొందారు. ఈ ఏడాది ముగిసేలోపు అత్యుత్తమ రేటింగ్ ఉన్న మరో ఇద్దరు ఆటగాళ్లు క్యాండిడేట్స్ టోర్నీలో పాల్గొంటారు. క్యాండిడేట్స్ టోర్నీ విజేతతో వచ్చే ఏడాది జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) తలపడతాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top