పైచేయి ఎవరిదో?

పైచేయి ఎవరిదో?


రాంచీ:ఐపీఎల్-8లో మరో అసలు సిసలు సమరానికి తెరలేవనుంది. క్వాలిఫయర్-2లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్-చెన్నై సూపర్ కింగ్స్ లు ఆమి-తూమీకి సన్నద్ధమయ్యాయి. ఈ టోర్నీలో ఆద్యంతం ఆకట్టుకున్న ఇరు జట్లు తమ బలాబలాలను పూర్తి స్థాయిలో ప్రదర్శించడానికి సిద్ధమయ్యాయి. లీగ్ దశలో ఫలితాన్నే మరోసారి పునరావృతం చేయాలని చెన్నై భావిస్తుండగా, బ్రెండన్ మెకల్లమ్ లేని లోటును తమకు అనుకూలంగా మార్చుకోవాలని బెంగళూరు యోచిస్తోంది.





లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన చెన్నై... తొలి క్వాలిఫయర్‌లో ముంబై చేతిలో ఓడి బెంగళూరుతో పోరుకు రెఢీ అయ్యింది. ప్రస్తుతం బెంగళూరు జట్టు సూపర్ ఫామ్‌లో ఉండగా, చెన్నై కాస్త ఆత్మవిశ్వాసం సన్నగిల్లినట్లు కనబడుతోంది. అయితే ధోని స్వస్థలం రాంచీలో ఈ మ్యాచ్ జరుగుతున్నందున చెన్నైకు పూర్తి స్థాయిలో మద్దతు లభించనుంది. తొలి క్వాలిఫయర్ సాదా సీదాగా సాగినా..  ఐపీఎల్ రెండో క్వాలిఫయర్ మాత్రం భారత వన్డే జట్టు కెప్టెన్ ధోని, టెస్టు జట్టు కెప్టెన్ కోహ్లిల సారథ్యానికి పరీక్షగా నిలవనుంది.





చెన్నై సూపర్ కింగ్స్..



లీగ్ దశలో సంచలన ఇన్నింగ్స్ ఆడిన మెకల్లమ్ వెళ్లిపోవడంతో చెన్నై డీలా పడిపోయింది. అతని స్థానంలో వచ్చిన వెటరన్ హస్సీ వరుస మ్యాచ్ ల్లో విఫలమైయ్యాడు. నేటి మ్యాచ్ లో డ్వేన్ స్మిత్‌తో కలిసి హస్సీ ఇచ్చే ఆరంభం చాలా కీలకం. అలాగే ఒంటిచేత్తో మ్యాచ్ లను గెలిపించే సురేష్ రైనా కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడం లేదు. చెన్నై జట్టులో డు ప్లెసిస్ ఒక్కడే ఫామ్ లో కనిపిస్తున్నాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజాలు పేలవమైన బ్యాటింగ్ చెన్నైకు ఆందోళన కలిగిస్తోంది. బౌలింగ్ విభాగంలో ఆశిష్ నెహ్రా, డ్వేన్ బ్రేవోలు ఆకట్టుకుంటున్నారు. అశ్విన్ కూడా సమయం చిక్కినప్పుడల్లా కీలక వికెట్లు తీసి చెన్నైకు అండగా నిలుస్తున్నా.. పెద్దగా ప్రభావం చూపడం లేదు.





బెంగళూరు జట్టు ..


 


గత ఐపీఎల్ లో కూడా ఆకట్టుకున్న బెంగుళూరుకు దురదృష్టం పాళ్లు కాస్త ఎక్కువగానే కనబడుతున్నాయి. కీలక మ్యాచ్ ల్లో ఆజట్టు చతికిలబడటం పరిపాటిగానే మారిపోయింది. అయితే టైటిల్ ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న బెంగళూరు ఈ సీజన్‌లో చాలావరకు నిలకడగా ఆడింది. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించగల గేల్, కోహ్లి, డి విలియర్స్ ముగ్గురూ రాణిస్త్తే మాత్రం బెంగళూరు టైటిల్ వేటలో తొలి అడ్డంకిని దిగ్విజయంగా అధిగమించే అవకాశం ఉంది. ఇక యువ సంచలనం మన్‌దీప్ సింగ్, సర్ఫరాజ్ కూడా బాగా ఆడుతున్నారు. ఐపీఎల్ -8లో స్పెషలిస్టు కీపర్ ఉండాలనే ఉద్దేశంతో దినేశ్ కార్తీక్ కు అత్యధిక ధర చెల్లించి మరీ బెంగళూరు కొనుగోలు చేసింది. కాగా, దినేష్ ఫామ్ మాత్రం బెంగళూరు కలవరపరుస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మాత్రం చెన్నై కంటే బెంగళూరు మెరుగ్గా ఉందనే చెప్పాలి. పటిష్టమైన బెంగళూరును మట్టికరిపించేదుకు ధోనీ ఏమైనా వ్యూహాలు సిద్ధం చేశాడో?లేదో మరి కొద్ది గంటల్లో తేలిపోతుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top