నేనున్నానని...

నేనున్నానని... - Sakshi


డకౌట్ అయిన తర్వాత డగౌట్ నుంచి విరాట్ కోహ్లి భావోద్వేగాలు... బంతి బంతికీ అతనిలో పెరుగుతున్న ఆవేశం... ఈ మ్యాచ్‌లో ఓడితే ఇక ఏమైపోతుందో అన్నట్లు జట్టు పరిస్థితి... కానీ మైదానంలో మాత్రం బ్యాట్స్‌మన్ ఇవేవీ పట్టించుకోలేదు. అంత ఒత్తిడిలోనూ తన విధ్వంసాన్ని కొనసాగిస్తూ పోయాడు. కెప్టెన్ నమ్మకాన్ని మరోసారి నిలబెడుతూ అబ్రహాం డివిలియర్స్ మళ్లీ అద్భుతం చేశాడు. అసాధ్యం అనుకున్న సమయంలో తనదైన శైలిలో మెరుపు బ్యాటింగ్ ప్రదర్శించి బెంగళూరును ఒంటి చేత్తో ఫైనల్‌కు చేర్చాడు.



159 లక్ష్యాన్ని మంచినీళ్లప్రాయంగా ఛేదిస్తారనుకుంటే... 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి అల్లాడుతున్న బెంగళూరు జట్టును నేనున్నానంటూ ఆదుకున్నాడు. ఆరంభం అదిరినా ఏబీని మాత్రం అవుట్ చేయలేక తలవంచిన గుజరాత్ శుక్రవారం రెండో క్వాలిఫయర్ ఆడుతుంది.


 

బెంగళూరును ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చిన డివిలియర్స్

క్లిష్ట సమయంలో అద్వితీయ ఇన్నింగ్స్

ఇక్బాల్ అబ్దుల్లా ఆల్‌రౌండ్ ప్రదర్శన

దవల్ కులకర్ణి శ్రమ వృథా  

క్వాలిఫయర్-1లో ఓడిన గుజరాత్ లయన్స్


 

బెంగళూరు: ఏబీ డివిలియర్స్ (47 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్-9 ఫైనల్లోకి దూసుకెళ్లింది. కోహ్లి అరుదైన వైఫల్యాన్ని మరచిపోయేలా చేస్తూ అతను భారీ షాట్లతో చెలరేగడంతో మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో బెంగళూరు 4 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌పై విజయం సాధించింది. 2009 అనంతరం ఆ జట్టు ఐపీఎల్ తుది పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటైంది.



డ్వేన్ స్మిత్ (41 బంతుల్లో 73; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా, వాట్సన్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం బెంగళూరు 18.2 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసింది. డివిలియర్స్, ఇక్బాల్ అబ్దుల్లా (25 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) ఏడో వికెట్‌కు 52 బంతుల్లోనే అభేద్యంగా 91 పరుగులు జోడించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ధవల్ కులకర్ణి (4/14) ఆకట్టుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఆటగాళ్ల వీర సంబరాలు ఆర్‌సీబీ అద్భుత విజయాన్ని ప్రతిబింబించాయి. 2009లో సరిగ్గా ఇదే రోజు ఆర్‌సీబీ, డెక్కన్ చార్జర్స్ చేతిలో ఫైనల్లో ఓడింది.

 

స్మిత్ దూకుడు...

లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇక్బాల్ అబ్దుల్లా ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే గుజరాత్‌కు షాక్ ఇచ్చాడు. తన తొలి బంతికే మెకల్లమ్ (1)ను అవుట్ చేసిన అతను నాలుగో బంతికి ఫించ్ (4)ను వెనక్కి పంపాడు. ఇద్దరు విధ్వంసకర ఓపెనర్లు విఫలమైన తర్వాత కెప్టెన్ రైనా (9 బంతుల్లో 1) కూడా నిలబడలేకపోవడంతో 9 పరుగులకే లయన్స్ 3 వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో స్మిత్, దినేశ్ కార్తీక్ (30 బంతుల్లో 26; 2 ఫోర్లు) భాగస్వామ్యం జట్టును ఆదుకుంది.



ఒకవైపు స్మిత్ చెలరేగిపోగా, కార్తీక్ అతనికి అండగా నిలిచాడు. అబ్దుల్లా ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి దూకుడు పెంచిన స్మిత్, అనంతరం చహల్ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్‌తో మరింత జోరు ప్రదర్శించాడు. అబ్దుల్లా తర్వాతి ఓవర్లో కూడా రెండు ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను... 31 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. అయితే తక్కువ వ్యవధిలో కార్తీక్, జడేజా (3), స్మిత్ అవుట్ కావడంతో లయన్స్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. చివర్లో ఏకలవ్య ద్వివేది (9 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో గుజరాత్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది.

 

కుప్పకూలిన బ్యాటింగ్...

సాధారణ లక్ష్య ఛేదనలో బెంగళూరు జట్టు ఎవరూ ఊహించని రీతిలో టపటపా వికెట్లు కోల్పోయింది. ధవల్ కులకర్ణి ఒక్కసారిగా చెలరేగిపోవడంతో ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్ పూర్తిగా పట్టు తప్పారు. మరో విధ్వంసానికి సిద్ధమయ్యాడని అనుకునే లోపే కోహ్లి (0) అరుదైన రీతిలో రెండో బంతికే డకౌట్ కావడంతో చిన్నస్వామి మైదానం చిన్నబోయింది.



ధవల్ తన రెండో ఓవర్లో వరుస బంతుల్లో గేల్ (9), లోకేశ్ రాహుల్ (0)లను అవుట్ చేసి మరో షాక్ ఇవ్వగా, తర్వాతి ఓవర్లో వాట్సన్ (1)ను జడేజా వెనక్కి పంపించాడు. మళ్లీ చెలరేగిన ధవల్... సచిన్ బేబీ (0) పని పట్టడంతో బెంగళూరు 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో స్టువర్ట్ బిన్నీ (15 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి డివిలియర్స్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 25 బంతుల్లో 39 పరుగులు జోడించారు. బిన్నీ అవుటైన తర్వాత అబ్దుల్లా అండతో డివిలియర్స్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే బెంగళూరుకు అద్భుత విజయాన్ని అందించాడు.

 

స్కోరు వివరాలు:-

గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: ఫించ్ (సి) గేల్ (బి) అబ్దుల్లా 4; మెకల్లమ్ (సి) డివిలియర్స్ (బి) అబ్దుల్లా 1; రైనా (సి) అరవింద్ (బి) వాట్సన్ 1; కార్తీక్ (బి) జోర్డాన్ 26; డ్వేన్ స్మిత్ (సి) కోహ్లి (బి) చహల్ 73; జడేజా (సి) గేల్ (బి) వాట్సన్ 3; బ్రేవో (బి) వాట్సన్ 8; ద్వివేది (సి) కోహ్లి (బి) వాట్సన్ 19; ప్రవీణ్ (బి) జోర్డాన్ 1; కులకర్ణి (రనౌట్) 10; జకాతి (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 158.

వికెట్ల పతనం: 1-2; 2-6; 3-9; 4-94; 5-107; 6-115; 7-145; 8-145; 9-156; 10-158.

బౌలింగ్: అరవింద్ 3-0-13-0; అబ్దుల్లా 4-0-38-2; వాట్సన్ 4-0-29-4; జోర్డాన్ 4-0-26-2; చహల్ 4-0-42-1; బిన్నీ 1-0-4-0.

 

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (బి) కులకర్ణి 9; కోహ్లి (బి) కులకర్ణి 0; డివిలియర్స్ (నాటౌట్) 79; రాహుల్ (సి) స్మిత్ (బి) కులకర్ణి 0; వాట్సన్ (సి) స్మిత్ (బి) జడేజా 1; సచిన్ బేబీ (సి) జకాతి (బి) కులకర్ణి 0; బిన్నీ (ఎల్బీ) (బి) జడేజా 21; అబ్దుల్లా (నాటౌట్) 33; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (18.2 ఓవర్లలో 6 వికెట్లకు) 159.

వికెట్ల పతనం: 1-12; 2-25; 3-25; 4-28; 5-29; 6-68.

బౌలింగ్: ప్రవీణ్ కుమార్ 3.2-0-32-0; ధవల్ కులకర్ణి 4-1-14-4; జడేజా 4-0-21-2; జకాతి 3-0-45-0; బ్రేవో 3-0-26-0; స్మిత్ 1-0-14-0.  

 

పరుగుల వీరుడు : కోహ్లి (919) (బెంగళూరు)

వికెట్ల ధీరుడు : వాట్సన్ (20)  (బెంగళూరు)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top