‘బెంగ’ తీరేలా...

‘బెంగ’ తీరేలా...


ఐపీఎల్‌లో ఎట్టకేలకు బెంగళూరు బెంగ తీరింది. బౌలింగ్ బలహీనమని ఇన్నాళ్లూ బాధపడిన కోహ్లి బృందాన్ని వరుసగా రెండో మ్యాచ్‌లోనూ బౌలర్లే గెలిపించారు. ఢిల్లీ జట్టులో నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉన్నా.. తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. బ్యాటింగ్‌లో గేల్, కోహ్లి చెలరేగడంతో స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు అలవోకగా ఛేదించింది. మరోవైపు లీగ్‌లోనే అత్యంత విలువైన ఆటగాడు యువరాజ్ సింగ్ పేలవ ప్రదర్శన ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది.

 

ఢిల్లీపై బెంగళూరు ఘనవిజయం     

హడలెత్తించిన స్టార్క్, ఆరోన్, వీస్    

చెలరేగిన గేల్, కోహ్లి


న్యూఢిల్లీ: జట్టులో ఎంత మంది స్టార్లున్నా... మైదానంలో మాత్రం ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటతీరు మారడం లేదు. తమదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించే ఆటగాళ్లూ ఒత్తిడిని జయించలేకపోతున్నారు. దీంతో ఐపీఎల్‌లో మరోసారి నిరాశజనకమైన ప్రదర్శనను కనబర్చిన డుమిని బృందం... బెంగళూరు పేస్ త్రయం ముందు బెంబేలెత్తింది. ఫలితంగా తక్కువ స్కోరుకే పరిమితమై మరో ఓటమిని మూటగట్టుకుంది. క్రిస్ గేల్ (40 బంతుల్లో 62 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లి (23 బంతుల్లో 35 నాటౌట్; 6 ఫోర్లు) చెలరేగడంతో... ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు 10 వికెట్ల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది.



ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 18.2 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. కేదార్ జాదవ్ (29 బంతుల్లో 33; 4 ఫోర్లు), మయాంక్ (34 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత బెంగళూరు 10.3 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 99 పరుగులు చేసి నెగ్గింది. వరుణ్ ఆరోన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

 

సూపర్ బౌలింగ్...

రాజస్తాన్‌తో మ్యాచ్‌లో మాదిరిగానే ఈసారి కూడా బెంగళూరు బౌలర్లు తమ ప్రతాపాన్ని చూపెట్టారు. ఓ ఎండ్‌లో మయాంక్ నిలకడగా ఆడినా... రెండో ఎండ్‌లో శ్రేయస్ అయ్యర్ (0), డుమిని (14 బంతుల్లో 13; 2 ఫోర్లు) స్వల్ప విరామాల్లో అవుటయ్యారు. డుమిని, మయాంక్‌లు రెండో వికెట్‌కు 34 పరుగులు జోడించారు. అయితే ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో ఆరోన్.. వరుస బంతుల్లో యువరాజ్ (2), మ్యాథ్యూస్ (0)లను అవుట్ చేసి కోలుకోలేని షాకిచ్చాడు. దీంతో ఢిల్లీ 39 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది.



ఈ దశలో మయాంక్, జాదవ్‌లు సింగిల్స్‌కు పరిమితం కావడంతో రన్‌రేట్ పూర్తిగా మందగించింది. అయితే ఐదో వికెట్‌కు 28 పరుగులు జోడించాక మయాంక్ వెనుదిరిగాడు. ఈ స్థితిలో స్టార్క్, వీస్, హర్షల్ పటేల్ మరింత రెచ్చిపోయారు. వరుస ఓవర్లలో కోల్టర్‌నీల్ (4), మిశ్రా (2), నదీమ్ (2), జాదవ్‌లను అవుట్ చేయగా, చివర్లో ముత్తుస్వామి (1) రనౌటయ్యాడు. దీంతో తొలి 10 ఓవర్లలో 54 పరుగులు చేసిన ఢిల్లీ... చివరి 8.2 ఓవర్లలో 41 పరుగులు జోడించి ఆరు వికెట్లు కోల్పోయింది. స్టార్క్ 3, ఆరోన్, వీస్ చెరో రెండు వికెట్లు తీశారు.

 

గేల్ జోరు...

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గేల్, కోహ్లి ఆరంభం నుంచే బ్యాట్ ఝుళిపించారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో గేల్ ఓ సిక్స్, మూడు ఫోర్లు బాది 14 పరుగులు రాబట్టాడు. కోహ్లి కంటే ఎక్కువగా స్ట్రయికింగ్ తీసుకున్న ఈ కరీబియన్ ప్లేయర్... ఓవర్‌కు బౌండరీతో పాటు వీలైనప్పుడల్లా సిక్సర్ బాదడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఆర్‌సీబీ స్కోరు 50 పరుగులకు చేరింది.



మిశ్రా వేసిన ఏడో ఓవర్‌లో కోహ్లి రెండు ఫోర్లు బాది టచ్‌లోకి వచ్చాడు. తర్వాతి ఓవర్‌లో భారీ సిక్సర్‌తో కేవలం 29 బంతుల్లోనే గేల్ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. తర్వాత కూడా ఈ జోడి జోరు తగ్గించకపోవడంతో ఢిల్లీ బౌలర్లు చేష్టలుడిగిపోయారు. ఇక 11 ఓవర్లలో 9 పరుగులు చేయాల్సిన దశలో కోహ్లి వరుసగా రెండు ఫోర్లు కొట్టి 57 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించాడు. ఈ ఇద్దరు ఓవర్‌కు తొమ్మిదికి పైగా రన్‌రేట్‌ను సాధించారు.

 

స్కోరు వివరాలు:--

ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: మయాంక్ (స్టంప్డ్) కార్తీక్ (బి) అబ్దుల్లా 27; శ్రేయస్ ఎల్బీడబ్ల్యూ (బి) స్టార్క్ 0; డుమిని (సి) కార్తీక్ (బి) వీస్ 13; యువరాజ్ (సి) కార్తీక్ (బి) ఆరోన్ 2; మ్యాథ్యూస్ (సి) డివిలియర్స్ (బి) ఆరోన్ 0; జాదవ్ (సి) స్టార్క్ (బి) హర్షల్ 33; కోల్టర్‌నీల్ ఎల్బీడబ్ల్యు (బి) వీస్ 4; మిశ్రా (బి) స్టార్క్ 2; నదీమ్ (బి) స్టార్క్ 2; తాహిర్ నాటౌట్ 3; ముత్తుస్వామి రనౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (18.2 ఓవర్లలో ఆలౌట్) 95.

వికెట్ల పతనం: 1-2; 2-36; 3-39; 4-39; 5-67; 6-72; 7-85; 8-90; 9-92; 10-95.

బౌలింగ్: స్టార్క్ 4-0-20-3; ఆరోన్ 4-0-24-2; హర్షల్ పటేల్ 3-0-14-1; వీస్ 3.2-0-18-2; ఇక్బాల్ అబ్దుల్లా 4-1-17-1.

 

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ నాటౌట్ 62; కోహ్లి నాటౌట్ 35; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం: (10.3 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా) 99.

బౌలింగ్: కోల్టర్‌నీల్ 3.3-0-30-0; ముత్తుస్వామి 1-0-14-0; తాహిర్ 2-0-20-0; డుమిని 1-0-7-0; మిశ్రా 2-0-25-0; మ్యాథ్యూస్ 1-0-3-0.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top