'అష్ట' చమక్‌...

'అష్ట' చమక్‌...


ఎనిమిదోసారి వింబుల్డన్‌ టైటిల్‌ గెలిచిన ఫెడరర్‌

ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారుడిగా రికార్డు

ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో సిలిచ్‌పై ఘనవిజయం

♦  రూ. 18 కోట్ల 53 లక్షల ప్రైజ్‌మనీ సొంతం




ఎలాంటి అద్భుతం జరగలేదు. ఊహించిన ఫలితమే వచ్చింది. తనకెంతో కలిసొచ్చిన వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ఎనిమిదోసారి విజయగర్జన చేశాడు. 140 ఏళ్ల ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ చరిత్రలో పురుషుల సింగిల్స్‌ విభాగంలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన క్రీడాకారుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో పీట్‌ సంప్రాస్‌ (అమెరికా), విలియమ్‌ రెన్‌షా (బ్రిటన్‌) ఏడుసార్లు చొప్పున ఈ టైటిల్‌ను సాధించగా... తాజా విజయంతో ఫెడరర్‌ ఈ ఇద్దరినీ అధిగమించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.



లండన్‌: ఏ లక్ష్యం కోసమైతే క్లే కోర్టు సీజన్‌ మొత్తానికి దూరంగా ఉండాలని ఫెడరర్‌ నిర్ణయం తీసుకున్నాడో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. తనకెంతో ప్రియమైన వింబుల్డన్‌ టోర్నమెంట్‌లో ఎనిమిదోసారి చాంపియన్‌గా నిలవాలని ఆశించిన అతను అనుకున్నది చేశాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో మూడో సీడ్‌ ఫెడరర్‌ 6–3, 6–1, 6–4తో ఏడో సీడ్‌ మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)పై గెలిచాడు. తద్వారా వింబుల్డన్‌ టోర్నమెంట్‌ చరిత్రలో పురుషుల సింగిల్స్‌ విభాగంలో రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి విజేతగా నిలిచి రికార్డు పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు. టైటిల్‌ నెగ్గిన ఫెడరర్‌కు 22 లక్షల పౌండ్లు (రూ. 18 కోట్ల 53 లక్షలు)... రన్నరప్‌ సిలిచ్‌కు 11 లక్షల పౌండ్లు (రూ. 9 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.



ఆరంభం నుంచే...

గంటా 41 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ఫెడరర్‌కు తన ప్రత్యర్థి నుంచి ఏమాత్రం పోటీ ఎదురుకాలేదు. అందరి అంచనాలను తారుమారు చేసి ఫైనల్‌కు దూసుకొచ్చిన సిలిచ్‌ అంతిమ సమరంలో మాత్రం 35 ఏళ్ల  ఫెడరర్‌ జోరు ముందు నిలువలేకపోయాడు. తొలి సెట్‌ రెండో గేమ్‌లోనే ఫెడరర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసే అవకాశం వచ్చినా సిలిచ్‌ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకున్న ఫెడరర్‌... ఐదో గేమ్‌లో సిలిచ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు. ఆ తర్వాత తొమ్మిదో గేమ్‌లో మరోసారి సిలిచ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి ఫెడరర్‌ తొలి సెట్‌ను దక్కించుకున్నాడు.



సిలిచ్‌ కంట కన్నీరు...

రెండో సెట్‌లో ఫెడరర్‌ మరింత చెలరేగిపోయాడు. ఈ స్విస్‌ దిగ్గజాన్ని ఎలా నిలువరించాలో సిలిచ్‌కు అర్థం కాలేదు. 0–3తో వెనుకబడిన దశలో సిలిచ్‌ తన విజయావకాశాలు చేజారిపోతున్నాయనే బాధను తట్టుకోలేక కోర్టులోనే కన్నీరు పెట్టుకున్నాడు. వెంటనే తన ముఖాన్ని టవల్‌లో దాచుకున్నాడు. రెండో సెట్‌లో ఒక్క గేమ్‌ మాత్రమే కోల్పోయిన ఫెడరర్‌ మూడో సెట్‌లోనూ తన దూకుడును కొనసాగించాడు. ఎనిమిదో గేమ్‌లో సిలిచ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఫెడరర్‌ ఆ తర్వాత పదో గేమ్‌లో తన సర్వీస్‌లో ఏస్‌ సంధించి సెట్‌తోపాటు మ్యాచ్‌ను ముగించేశాడు. విజయానంతరం ఫెడరర్‌ పెద్దగా సంబరాలు చేసుకోలేదు. గాల్లో చేతులు ఎత్తి అందరికీ వందనం చేశాడు. తన ప్రత్యర్థి సిలిచ్‌ దగ్గరకు వెళ్లి అతడినీ అభినందించాడు.









ఇన్ని ఘనతలు సాధించగలగడం నమ్మశక్యంగా లేదు. మరోసారి ఈ వేదికపై ఫైనల్‌ ఆడగలనని గత ఏడాది అనుకోలేదు. అప్పట్లో రెండు సార్లు జొకోవిచ్‌ చేతిలో ఫైనల్స్‌లో ఓడిపోవడం బాధించింది. అయితే పునరాగమనం చేయగలనని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. మనల్ని మనం నమ్మితే ఏదైనా సాధించవచ్చనేదానికి నా ఎనిమిదో టైటిల్‌ ఉదాహరణ. ఒక్క సెట్‌ ఓడకుండా ట్రోఫీ సాధించడం ఒక మాయలా కనిపిస్తోంది. విశ్రాంతి నాకు కలిసొచ్చింది. ఈ సారి మళ్లీ ఆరు నెలలు విరామం ఇస్తే అది మరోసారి అనుకూలంగా మారుతుందేమో చూడాలి.    

–ఫెడరర్‌




19  ఫెడరర్‌ సాధించిన గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ సంఖ్య. ఇందులో ఐదు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ (2004, 06, 07, 2010, 2017), ఒక ఫ్రెంచ్‌ ఓపెన్‌ (2009), ఎనిమిది వింబుల్డన్‌ (2003, 04, 05, 06, 07, 09, 2012, 2017), ఐదు యూఎస్‌ ఓపెన్‌ (2004, 05, 06, 07, 08) టైటిల్స్‌ ఉన్నాయి.



2 ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా ఫెడరర్‌ నెగ్గిన గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌. 2007 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో, 2017 వింబుల్డన్‌ టోర్నీలో ఫెడరర్‌ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్‌ కూడా కోల్పోలేదు. 1976లో జాన్‌ బోర్గ్‌ (స్వీడన్‌) తర్వాత ఫెడరర్‌ మాత్రమే ఒక్క సెట్‌ చేజార్చుకోకుండా వింబుల్డన్‌ విజేతగా నిలిచాడు.



2

ఓపెన్‌ శకంలో (1968 తర్వాత) 30 ఏళ్లు దాటిన తర్వాత ఒకే ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన రెండో ప్లేయర్‌ ఫెడరర్‌. గతంలో రాడ్‌ లేవర్‌ (1969లో) మాత్రమే ఈ ఘనత సాధించాడు.



1111 ఫెడరర్‌ కెరీర్‌లో విజయాల సంఖ్య.



102 వింబుల్డన్‌లో ఫెడరర్‌ ఆడిన మ్యాచ్‌లు. జిమ్మీ కానర్స్‌ రికార్డును అతను సమం చేశాడు.



1 వింబుల్డన్‌లో పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన పెద్ద వయస్కుడిగా ఫెడరర్‌ గుర్తింపు పొందాడు. 1976లో ఆర్థర్‌ యాష్‌ (32 ఏళ్లు) రికార్డు తెరమరుగైంది.





హింగిస్‌... 23వ ‘గ్రాండ్‌’ టైటిల్‌

స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ మహిళా దిగ్గజం మార్టినా హింగిస్‌ తన కెరీర్‌లో 23వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సాధించింది. వింబుల్డన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగం ఫైనల్లో హింగిస్‌–జేమీ ముర్రే (బ్రిటన్‌) ద్వయం 6–4, 6–4తో కొంటినెన్‌ (ఫిన్‌లాండ్‌)–హీతెర్‌ (బ్రిటన్‌) జంటపై గెలిచి విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా హింగిస్‌ సింగిల్స్‌లో 5, డబుల్స్‌లో 18 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top