రైజింగ్ పుణే కూర్పులో స్పష్టత


హర్షా భోగ్లే



బ్యాటింగ్ ఆర్డర్‌పై రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌కు ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చింది. అయితే తమ ఉత్తమ కూర్పు విషయంలో ఓ అంచనాకు రావడానికి వీరికి కొంచెం సమయం పట్టింది. నిజానికి ధోని సేన తాజా సీజన్‌లో ఇంకా పూర్తిగా నిలదొక్కుకోలేదనే చెప్పాలి. రహానే, డు ప్లెసిస్, పీటర్సన్, స్టీవ్ స్మిత్, ధోనిలతో టాప్-5 గట్టిగానే ఉంది. ఇందులో ఎవరో ఒకరు తమ జట్టు ప్రణాళికలను అమలుపరచగలుగుతున్నారు. కానీ పీటర్సన్ టోర్నీ నుంచి వైదొలగడంతో స్మిత్ తనకిష్టమైన మూడో నంబర్ స్థానంలో రాగలుగుతున్నాడు. అతడి జాతీయ జట్టులో వార్నర్, ఫించ్‌లాగా స్మిత్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ కాకపోయినా కళాత్మక షాట్లతో పాటు వినూత్నంగా ఆడగలడు. ధోని నంబర్‌ఫోర్‌లో రావాల్సి ఉంటుంది. ఫినిషర్స్‌గా మిషెల్ మార్ష్, తిసారా పెరీరాలను ఉపయోగించుకోవచ్చు. ఇక వికెట్ కీపర్, ఇద్దరు బౌలర్లతో టాప్-7లో పుణే కూర్పు పర్‌ఫెక్ట్‌గా ఉంది.



మరోవైపు చివరి నలుగురిలో  ఇద్దరు స్పిన్నర్లను ఆడించుకుంటే సరిపోతుంది. ఒకవేళ నాణ్యమైన ఫాస్ట్ బౌలర్ ఉంటే జట్టు పూర్తి సంతృప్తిగా ఉన్నట్టే. ఈ విషయంలో అశోక్ దిండా సరిపోతాడు. మరో జట్టు గుజరాత్ లయన్స్ మాత్రం బ్యాటింగ్ ఆర్డర్‌తో కాస్త ఇబ్బంది పడుతోంది. వీరికి డ్వేన్ స్మిత్, మెకల్లమ్, ఫించ్‌ల రూపంలో ముగ్గురు సూపర్ విదేశీ ఓపెనర్లు ఉన్నారు. ఒకవేళ సురేశ్ రైనా మూడో నంబర్‌లో రావాలనుకుంటే వీరిలో ఒకరు నాలుగు లేదా ఐదో స్థానంలో ఆడాల్సి ఉంటుంది.



కానీ ఫించ్ గైర్హాజరీతో గతంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు అనేక విజయాలు అందించిన డ్వేన్ స్మిత్, మెకల్లమ్ జోడి ఢిల్లీపై శుభారంభాన్ని ఇచ్చింది. ఫించ్ ఆడినా లోయర్ ఆర్డర్‌లో దిగాల్సి ఉంటుందేమో.. నిజానికి మెకల్లమ్ మూడు, రైనా నాలుగో స్థానంలో దిగాలని గుజరాత్ భావిస్తే బావుంటుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top