ఉన్నత స్థితిలోనే వీడ్కోలు

ఉన్నత స్థితిలోనే వీడ్కోలు

రిటైర్మెంట్‌పై పేస్ అభిప్రాయం

 బెంగళూరు: క్రీడా ప్రపంచంలో దిగ్గజాలు పీలే (ఫుట్‌బాల్), మహ్మద్ అలీ (బాక్సింగ్)ల మాదిరిగా తాను కూడా కెరీర్ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే ఆట నుంచి తప్పుకుంటానని భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ అన్నాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో పతకం గెలిస్తే ఈ అవకాశం రావొచ్చన్నాడు. ఒలింపిక్స్‌లో కాంస్యంతో పాటు కెరీర్‌లో 14 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన 41 ఏళ్ల పేస్... సెర్బియాతో జరిగిన డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ సందర్భంగా పలు అంశాలపై వెల్లడించిన అభిప్రాయాలు అతని మాటల్లోనే...

 సమన్వయం అత్యవసరం: బలం, అనుకూలతల మధ్య సమన్వయాన్ని రాబట్టడం టెన్నిస్ ఆటగాడికి చాలా అత్యవసరం. ప్రధానంగా మా ఆట వేగం, తక్షణ ప్రతిస్పందనలపై ఇది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మా శిక్షణ మొత్తం గాయాల బారిన పడకుండా చూసుకోవాలి. 

 ఆటపై ప్రభావం చూపింది: నా కూతురి విషయంలో భార్య రియా పిళ్లైతో నెలకొన్న వివాదం నా ఆటపై ప్రభావం చూపింది. అయితే దాన్ని అధిగమిస్తూ గ్రాండ్‌స్లామ్‌లాంటి పెద్ద విజయాలు సాధించా. చాలా ఏళ్లపాటు నిలకడగా ఆడా. డేవిస్ కప్‌లో ఎదురైన ఒత్తిడిని అధిగమించా. ఈ అనుభవం నాకు చాలా ఉపయోగపడింది. కానీ ఆటను పక్కనబెడితే నేను కూడా మనిషినే. అందరిలాగే నాకూ కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి.

 కూతురు అర్థం చేసుకుంది: నా కూతురు అయనా అంటే నాకు చాలా ఇష్టం. అమె బాగోగులు చూడటం నా బాధ్యత. జరుగుతున్న ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంది. అదే సమయంలో టెన్నిస్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. కష్టకాలంలో నా తలిద్రండుల మద్దతు మర్చిపోలేను. నా జట్టు సహచరుల తోడ్పాటు కూడా బాగుంది. 

 చాలా నేర్చుకున్నా: సాధారణంగా పర్యటనలకు వెళ్లినప్పుడు చాలా మందిని కలుస్తుంటా. ఆండ్రీ అగస్సీ, నెల్సన్ మండేలా, మహ్మద్ అలీలాంటి వాళ్లతో మాట్లాడి చాలా నేర్చుకున్నా. ఆట లేనప్పుడు నాకున్న వ్యాపారాలు చూసుకుంటా. నా జీవితంలో ఎదురైన సంఘటనలు, నేను నేర్చుకున్న అంశాలను అభిమానులకు చెబుతుంటా. 

 బ్రయాన్ సోదరులు బ్రాండ్ అంబాసిడర్లు: కెరీర్‌లో వంద ఏటీపీ టైటిల్స్ గెలవడం అంటే మాటలు కాదు. బ్రయాన్ సోదరులు ఆటకు నిజమైన బ్రాండ్ అంబాసిడర్లు. డేవిస్ కప్ డబుల్స్‌లో మేం గెలిచిన తర్వాత సోమ్‌దేవ్ అద్భుతంగా ఆడాడు. మంచి ఫిట్‌నెస్‌తో బలమైన వ్యాలీలతో తన మార్క్ ఆటను ప్రదర్శించాడు.

 

 

 

 

 


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top