‘విశ్రాంతి' మంత్రం!

‘విశ్రాంతి' మంత్రం!


సాధన మనిషిని విజయంవైపు నడిపిస్తుందంటారు. కానీ భారత క్రికెటర్లు మాత్రం విశ్రాంతే తమ విజయమంత్రం అంటున్నారు. తీరికలేని షెడ్యూల్‌తో 365 రోజులు గడిపే భారత స్టార్స్...  ఈసారి ప్రపంచకప్‌లో దొరికిన విరామం తమలో ఉత్సాహాన్ని పెంచుతోందని చెబుతున్నారు.

 

సాక్షి క్రీడావిభాగం

ఈసారి ప్రపంచకప్‌లో భారత్‌కు మ్యాచ్‌కు మ్యాచ్‌కు మధ్య విరామం చాలా ఎక్కువగా వచ్చింది. తొలి మ్యాచ్ ఫిబ్రవరి 15న ఆడిన ధోనిసేన... మార్చి 6న నాలుగో మ్యాచ్ ఆడనుంది. అంటే 20 రోజుల వ్యవధిలో భారత్ మ్యాచ్‌లు కేవలం నాలుగే. బిజీ షెడ్యూల్‌తో ఎప్పుడూ ప్రయాణాలతో హడావుడిగా ఉండే ధోని అండ్ కో తొలిసారి తీరుబడిగా మ్యాచ్‌లు ఆడుతోంది. దీనివల్ల భారత క్రికెటర్లకు అదనంగా ‘విశ్రాంతి’ దొరుకుతోంది. ఇది టానిక్‌లా పని చేస్తోందని ధోని బృందం భావిస్తోంది.

 

చాలా అరుదు

సాధారణంగా మ్యాచ్‌ల మధ్య సుదీర్ఘ విరామం దొరకడం చాలా అరుదు. ఐపీఎల్ లాంటి టోర్నీలో అయితే ఉదయం విమానం దిగి సాయంత్రం మ్యాచ్ ఆడే సందర్భాలు కూడా ఉంటాయి. ద్వైపాక్షిక సిరీస్‌లలో ఒక్కో మ్యాచ్‌కు మధ్య రెండు రోజుల విరామం ఉంటుంది. ఒక రోజు ప్రయాణానికి, ఒక రోజు ప్రాక్టీస్‌కు సరిపోతుంది. కాబట్టి క్రికెటర్లకు సాధారణంగా ఖాళీ దొరకదు. ముఖ్యంగా భారత జట్టుకు ఈ తీరిక అసలే ఉండదు. ఈసారి ప్రపంచకప్ సందర్భంగా లభించిన విరామాన్ని బాగా వినియోగించుకుంటున్నారు.

 

రోజు విడిచి రోజు

ఈసారి భారత్ ప్రాక్టీస్ సెషన్లలో కూడా ఎక్కువగా పాల్గొనడం లేదు. ముక్కోణపు వన్డే సిరీస్ తర్వాత తొలిసారి భారత క్రికెటర్లకు టీమ్ మేనేజ్‌మెంట్ మూడు రోజులు సెలవు ఇచ్చింది. స్నేహితులతో, బంధువులతో గడపడం... షికార్లకు వెళ్లడానికీ అనుమతి ఇచ్చారు. ఈ సెలవు తమలో కొత్త ఉత్సాహాన్ని పెంచిందని క్రికెటర్లంతా అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ప్రపంచకప్‌లో ఒక్కసారిగా పుంజుకుని చెలరేగి ఆడారు. ఇలా ఆటతీరు మెరుగవడానికి అనేక కారణాలున్నా... విశ్రాంతి మంత్రం కూడా అందులో భాగమేనని ధోని అభిప్రాయం.



ఇప్పుడు టోర్నీ సందర్భంగా కూడా భారత క్రికెటర్లు అదే కొనసాగిస్తున్నారు. పాకిస్తాన్‌తో మ్యాచ్ తర్వాత దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు ఆరు రోజులు ఖాళీ దొరికింది. ఇందులో కేవలం మూడు రోజులు మాత్రమే ప్రాక్టీస్ చేశారు. అందులో ఒక రోజు కేవలం ఫీల్డింగ్‌కే పరిమితమయ్యారు. అయినా కానీ ఆటతీరులో మార్పు రాలేదు. ఆ తర్వాత అఫ్ఘాన్‌తో మ్యాచ్‌కు ముందూ ఇదే తీరు. ఈసారి వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు ఐదు రోజులు విరామం లభిస్తే... అందులో కేవలం రెండు రోజులు మాత్రమే ప్రాక్టీస్‌కు కేటాయించి... మూడు రోజులు విశ్రాంతి తీసుకుంటున్నారు.

 

వేదికలు అలవాటు...

ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లు నవంబర్ నుంచి పర్యటిస్తున్నారు. కాబట్టి అక్కడి వాతావరణ పరిస్థితులు పూర్తిగా అలవాటు అయ్యాయి. అదే విధంగా వారాల వ్యవధిలో పిచ్‌లలో మార్పులు రావు. అన్ని వేదికల్లోనూ టెస్టులు, వన్డేలు ఆడటం వల్ల దాదాపుగా అన్ని చోట్లా పరిస్థితులపై భారత జట్టుకు పూర్తి అవగాహన ఉంది. ఇది భారత్‌కు బాగా కలిసొస్తుందనే అనుకోవాలి. మెల్‌బోర్న్‌లాంటి పెద్ద మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేయడంలో ధోని మిగిలిన కెప్టెన్ల కంటే తెలివిగా వ్యవహరించాడు. దీనికి కారణం అక్కడి పరిస్థితులపై అవగాహన ఉండటమే.

 

భిన్నాభిప్రాయాలు

విరామం వచ్చినా ప్రాక్టీస్ సెషన్లకు విరామం ఇవ్వడం మంచిదా? కాదా?... అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ఆటగాళ్లకు ఫిట్‌నెస్ ఎంతో ముఖ్యం. అయితే జిమ్‌కు రోజూ వెళ్లడం వల్ల ప్రాక్టీస్‌కు వెళ్లకపోయినా ఫిట్‌నెస్‌ను కాపాడుకోవచ్చని ధోని చెబుతున్నాడు.


ఈ విశ్రాంతి మూలంగా ఆటగాళ్ల మీద పని ఒత్తిడి తగ్గుతుందనేది వాస్తవం. అయితే ఇంత విరామం వస్తే ఫామ్ కోల్పోయే ప్రమాదం ఉందనేది ఓ అభిప్రాయం. మొత్తం మీద ఇతర జట్లతో పోలిస్తే భారత క్రికెటర్లు విశ్రాంతి కాస్త ఎక్కువగానే తీసుకుంటున్నారు. గెలిచినంత కాలం  ఎవరూ పట్టించుకోకపోవచ్చు. కానీ ఒకవేళ ఏదైనా కీలక మ్యాచ్‌లో ఓడిపోతే... ప్రాక్టీస్ చేయకుండా పడుకున్నారనే విమర్శనూ ఎదుర్కోవాల్సి రావచ్చు.

 

టెన్నిస్... స్విమ్మింగ్


ప్రపంచకప్ సందర్భంగా కుటుంబ సభ్యులనో, స్నేహితులనో కలిసే అవకాశం లేదు. కాబట్టి షికార్లు కుదరవు. దీంతో దాదాపుగా అందరూ హోటల్‌కే పరిమితమవుతున్నారు. ఓ రెండు గంటల పాటు జిమ్‌లో, స్విమ్మింగ్‌పూల్‌లో గడుపుతున్నారు. నీళ్లలో ఆడే ఆటలతో టైమ్ పాస్ చేస్తున్నారు. దీనికి అదనంగా టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి క్రీడలు ఆడుకుంటున్నారు. ఇవన్నీ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంలో భాగం. అలాగే మిగిలిన సమయాల్లో వీడియో గేమ్స్ ఆడటం, అడపాదడపా షాపింగ్, ఇండియన్ రెస్టారెంట్లకు వెళ్లి భోజనం... ఇలా టైమ్ పాస్ చేస్తున్నారు.

 

 ‘మేం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన దగ్గర్నించి ప్రపంచకప్ ముగిసేవరకు లెక్క తీసుకుంటే దాదాపు ఐదు నెలలు ఈ పర్యటన సాగుతోంది. ఇంత సుదీర్ఘ పర్యటనలో నెట్ ప్రాక్టీస్ కంటే విశ్రాంతి చాలా ముఖ్యం. మానసికంగా ఆటగాళ్లు ఫిట్‌గా ఉండటం అవసరం’        - ధోని

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top