' అప్పుడు నిద్రమత్తులో ఉన్నా'

' అప్పుడు నిద్రమత్తులో ఉన్నా'


బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10వ సీజన్లో తనకు అత్యధిక ధర పలకడంపై అప్ఘాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. జింబాబ్వేతో సిరీస్ లో భాగంగా తాను హరారేలో ఉన్న విషయాన్ని తెలియజేసిన రషీద్.. ఐపీఎల్ వేలం జరిగే సమయానికి తాను గాఢమైన నిద్రమత్తులో ఉన్నట్లు పేర్కొన్నాడు. అయితే ఐపీఎల్ వేలంలో తన పేరు ఉండటంతో అప్ఘాన్ లో ఉన్న తల్లి దండ్రులు వేకువజామునే లేచి టీవీలు ముందు కూర్చున్నట్లు రషీద్ తెలిపాడు. తన పేరు ఐపీఎల్ బిడ్ లో వస్తుందనే విషయాన్ని అమ్మా-నాన్న ఫోన్ చేసి చెబితే కానీ తెలియలేదన్నాడు. దాంతో నిద్రమత్తులోనే ఐపీఎల్ బిడ్డింగ్ వీక్షించినట్లు తెలిపాడు.


'జింబాబ్వేతో సిరీస్ లో తగినంత విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరకలేదు. ఆ క్రమంలోనే నేను సోమవారం నిద్రమత్తులో ఉన్నా. ఐపీఎల్ వేలం జరుగుతుందనే విషయం తెలుసు. కానీ బాగా అలసటగా ఉండి అలానే పడుకున్నా. అయితే నా పేరు బిడ్డింగ్ లో వచ్చిన విషయాన్ని మా కుటుంబ సభ్యులు ఫోన్ చేసి చెప్పారు. దాంతో నేను హడావుడిగా లేచి నిద్రమత్తులోనే టీవీ వీక్షించా. నన్ను నాలుగు కోట్లు పెట్టి కొనుగోలు చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. నన్ను నేను నమ్మలేకపోవడమే కాదు.. నా జీవితంలో ఐపీఎల్ చాలా సంతోషాన్ని తీసుకొచ్చింది'అని రషీద్ అన్నాడు.


సోమవారం నాటి వేలంలో రషీద్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం ఐదుగురు అఫ్ఘాన్ ఆటగాళ్లు ఐపీఎల్ వేలం బరిలో నిలిస్తే, వారిలో ఇద్దర్ని అదృష్టం వరించింది. రషీద్ కంటే ముందు ఐపీఎల్ అమ్ముడుపోయిన మరో ఆఫ్ఘాన్ క్రికెటర్ మొహ్మద్ నబీ. ఇతన్ని కూడా సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. మొహ్మద్ నబీకి రూ. 30లక్షలు చెల్లించి సన్ రైజర్స్ దక్కించుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top