రవీంద్రజాలం

రవీంద్రజాలం


జడేజా ఆల్‌రౌండ్ నైపుణ్యం

 డ్వేన్ స్మిత్ మెరుపు అర్ధసెంచరీ

 రాజస్థాన్‌పై చెన్నై విజయం

 

 చెన్నై 74/5.... కీలక బ్యాట్స్‌మెన్ అందరూ పెవిలియన్‌లో... ఇక పోరాడే స్కోరు కూడా కష్టమే.. జడేజా క్రీజులోకి వచ్చాడు. ఓపిగ్గా చివరి వరకూ నిలబడ్డాడు.

 హమ్మయ్య... ఫర్వాలేదు... చెన్నై 140 పరుగులు చేసింది.

 

 రాజస్థాన్ టాప్ ఆర్డర్ మెరుపు షాట్లతో దూసుకుపోతున్నారు... ఇక చెన్నైకి కష్టమే... ఈసారి జడేజా బంతితో వచ్చాడు. ఒకే ఓవర్లో వాట్సన్, సామ్సన్‌ల వికెట్లు... చెన్నైకి ఊరట. రాజస్థాన్ మిడిలార్డర్‌లో స్మిత్ ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. మళ్లీ జడేజా... ఈసారి రెండు ఓవర్లలో స్మిత్, సౌతీల వికెట్లు... మ్యాచ్ చెన్నై గుప్పిట్లోకి.

 

 రవీంద్ర జడేజా చాలా కాలం తర్వాత ఆల్‌రౌండ్ నైపుణ్యం ప్రదర్శించి చెన్నై సూపర్‌కింగ్స్‌కు రాజస్థాన్ రాయల్స్‌పై విజయాన్ని అందించాడు.

 

 దుబాయ్: భారీ లక్ష్యం నిర్దేశించలేకపోయినా... నాణ్యమైన బౌలింగ్‌తో చెన్నై సూపర్‌కింగ్స్ చెలరేగింది. జడేజా స్పిన్ మ్యాజిక్‌తో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌ను నిలువునా వణికించాడు. ఫలితంగా ఐపీఎల్-7లో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో చెన్నై 7 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై విజయం సాధించింది.

 

 

 దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా..... బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 140 పరుగులు చేసింది. డ్వేన్ స్మిత్ (28 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు వేగంతో అర్ధసెంచరీ చేయగా... చివర్లో జడేజా (33 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. భాటియా 2, ఫాల్క్‌నర్, తాంబే, బిన్ని తలా ఓ వికెట్ తీశారు. తర్వాత రాజస్థాన్ 19.5 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. ధావల్ కులకర్ణి (19 బంతుల్లో 28 నాటౌట్; 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. భాటియా (20 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్సర్), స్మిత్ (20 బంతుల్లో 19; 1 ఫోర్) మోస్తరుగా ఆడారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జడేజా 4 వికెట్లు పడగొట్టాడు.

 

 ‘టాప్ లేచింది

 ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించిన స్మిత్ వేగంగా ఆడితే మెకల్లమ్ తడబడ్డాడు. తొలి రెండు ఓవర్లలో పెద్దగా పరుగులు రాకపోవడంతో ఫాల్క్‌నర్, సౌతీ బౌలింగ్‌లో స్మిత్ రెండు భారీ సిక్సర్లు కొట్టి స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. మెకల్లమ్ అవుటైన తర్వాత స్మిత్ వరుసగా నాలుగు ఫోర్లు కొట్టి మ్యాచ్‌లో ఊపు తెచ్చాడు. పవర్‌ప్లే ముగిసేసరికి చెన్నై ఖాతాలో 51 పరుగులు సమకూరాయి. కానీ రెండో ఎండ్‌లో రైనాను కట్టడి చేయడంతో పరుగుల వేగం మందగించింది.

 

 బిన్ని బౌలింగ్‌లో మరో సిక్సర్‌తో అర్ధసెంచరీ పూర్తి చేసిన స్మిత్ తర్వాతి బంతికే వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్‌లో రైనాను భాటియా బోల్తా కొట్టిస్తే.. కొద్దిసేపటికే డుప్లెసిస్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు.  ఇన్నింగ్స్‌ను భుజానికెత్తుకున్న ధోని డీప్ మిడ్ వికెట్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఫాల్క్‌నర్ చేతికి చిక్కాడు. దీంతో చెన్నై 74 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది.

 

 కుదురుకునేందుకు సమయం తీసుకున్న జడేజా రెండు ఫోర్లు కొట్టినా, ఎక్కువగా సింగిల్స్‌తో స్ట్రయిక్‌ను రొటేట్ చేశాడు. ఉన్నంతసేపు చక్కని సహకారం అందించిన మన్హాస్ ఆరో వికెట్‌కు 27 పరుగులు జోడించాక అవుటయ్యాడు. చివర్లో జడేజా, అశ్విన్ వేగంగా ఆడే ప్రయత్నం చేసినా రాజస్థాన్ బౌలర్లు నియంత్రించారు. కీలకమైన 18వ ఓవర్‌లో 3 పరుగులే ఇచ్చిన సౌతీ తన తర్వాతి ఓవర్‌లో 9 పరుగులతో సరిపెట్టాడు. ఈ జోడి ఏడో వికెట్‌కు అజేయంగా 39 పరుగులు జోడించడంతో చెన్నైకి ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.    

 

 జడేజా మ్యాజిక్

 రెండో ఓవర్‌లోనే నాయర్ రనౌట్ కావడం, సామ్సన్, రహానే నెమ్మదిగా ఆడటంతో రాజస్థాన్‌కు సరైన శుభారంభం లభించలేదు. హిల్ఫెన్హాస్ బౌలింగ్‌లో సామ్సన్ రెండు సిక్సర్లతో టచ్‌లోకి వచ్చినా... రహానే భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు.

 

 పవర్‌ప్లే ముగిసేసరికి 38/2 స్కోరుతో ఉన్న రాజస్థాన్‌ను జడేజా తన తొలి ఓవర్‌లోనే ఘోరంగా దెబ్బతీశాడు. వరుస బంతుల్లో వాట్సన్, సామ్సన్‌లను అవుట్ చేశాడు. దీంతో రాజస్థాన్ 7 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది.  

 

 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్మిత్‌ను స్టంపౌట్ చేసే సునాయాస అవకాశాన్ని ధోని వృథా చేశాడు. కానీ 9 బంతుల వ్యవధిలో స్మిత్, ఫాల్క్‌నర్, సౌతీ పెవిలియన్‌కు చేరారు. భాటియా ఒకటి, రెండు భారీ షాట్లు ఆడి ఆశలు రేకెత్తించినా... చెన్నై బౌలర్లు నిలువరించారు.

 

 స్కోరు వివరాలు

 చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) వాట్సన్ (బి) బిన్ని 50; బి. మెకల్లమ్ (సి) స్మిత్ (బి) ఫాల్క్‌నర్ 6; రైనా (సి) కులకర్ణి (బి) భాటియా 4; డు ప్లెసిస్ రనౌట్ 7; ధోని (సి) ఫాల్క్‌నర్ (బి) తాంబే 5; జడేజా నాటౌట్ 36; మన్హాస్ (సి) రహానే (బి) భాటియా 10; అశ్విన్ నాటౌట్ 9; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 140.  

 

 వికెట్ల పతనం: 1-35; 2-59; 3-64; 4-71; 5-74; 6-101

 బౌలింగ్: ధావల్ కులకర్ణి 3-0-18-0; సౌతీ 4-0-27-0; ఫాల్క్‌నర్ 3-0-38-1; తాంబే 4-0-27-1; బిన్ని 1-0-10-1; రజత్ భాటియా 4-0-13-2; వాట్సన్ 1-0-5-0.

 రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: నాయర్ రనౌట్ 5; రహానే (సి) మన్హాస్ (బి) అశ్విన్ 15; సంజు సామ్సన్ (సి) అండ్ (బి) జడేజా 16; వాట్సన్ (సి) హిల్ఫెన్హాస్ (బి) జడేజా 7; బిన్ని (సి) డుప్లెసిస్ (బి) మోహిత్ శర్మ 8; స్మిత్ (సి) డుప్లెసిస్ (బి) జడేజా 19; భాటియా (సి) అశ్విన్ (బి) హిల్ఫెన్హాస్ 23; ఫాల్క్‌నర్ (సి) ధోని (బి) పాండే 4;  సౌతీ (బి) జడేజా 4; కులకర్ణి నాటౌట్ 28; తాంబే రనౌట్ 2; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: (19.5 ఓవర్లలో ఆలౌట్) 133.

 వికెట్ల పతనం: 1-10; 2-37; 3-44; 4-44; 5-63; 6-75; 7-80; 8-85; 9-113; 10-133

 బౌలింగ్: హిల్ఫెన్హాస్ 4-0-32-1; ఈశ్వర్ పాండే 4-1-22-1; అశ్విన్ 3.5-0-27-1; జడేజా 4-0-33-4; రైనా 2-0-6-0; మోహిత్ శర్మ 2-0-13-1.


 




 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top